Oct 12,2023 21:51

జగన్న కాలనీలను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే, కలెక్టర్‌ తదితరులు

           తాడిపత్రి రూరల్‌ : సొంతింటి కలను సాకారం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం పేదలందరికీ ఇళ్ల పట్టాలను మంజూరు చేసి గృహాలను నిర్మించి ఇస్తున్నట్లు ఎంపీ తలారి రంగయ్య తెలిపారు. తాడిపత్రి మండలం సజ్జలదిన్నె గ్రామం వద్దనున్న వైఎస్సార్‌ జగనన్న సజ్జలదిన్నె కాలనీ-1లో గహప్రవేశ మహోత్సవాన్ని గురువారం నిర్వహించారు. ఈకార్యక్రమంలో ఎంపీ తలారి రంగయ్య, ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, కలెక్టర్‌ ఎం.గౌతమి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ తలారి రంగయ్య మాట్లాడుతూ జిల్లాలో 23,385 ఇళ్లను పూర్తి చేసి గురువారం నాడు గహప్రవేశ మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. జిల్లాలో 26 వేల ఎకరాలను ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వం ఇచ్చిందన్నారు. వైసిపి అధికారంలోకి వచ్చిన నాలుగున్నరేళ్ల అనంతరం ఏమి లబ్ధి కలిగింది అనేది ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకోవాలని సూచించారు. గత పాలనకు ఇప్పటి పాలనకు తేడా చూసుకుని వచ్చే ఎన్నికల్లో సరైన నిర్ణయం తీసుకోవాలని ప్రజలను కోరారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మాట్లాడుతూ తాడిపత్రిలో 4,500 పట్టాలను మంజూరు చేశామన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలను వారి ఇంటి వద్దకే వెళ్లి అందజేస్తున్నామన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఇలాంటి పరిస్థితి ఉండేది కాదన్నారు. కలెక్టర్‌ గౌతమి మాట్లాడుతూ జగనన్న కాలనీలలో యుద్ధ ప్రాతిపదికన మౌలిక వసతుల కల్పన చేపడతామన్నారు. అన్ని సదుపాయాలు కల్పించిన తర్వాత ఇల్లు కట్టుకుని పూర్తి చేసుకోవడం లబ్ధిదారుల బాధ్యత అన్నారు. ఇళ్ల నిర్మాణం పూర్తి చేసేందుకు అవసరమైన సహకారం అందించేందుకు అధికారులు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారని సూచించారు. అనుకూల పరిస్థితులు ఉన్నప్పుడు లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని, ఇళ్లు కట్టుకునేందుకు ముందుకు రావాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రజక కార్పొరేషన్‌ ఛైర్మన్‌ మీసాల రంగన్న, ఎడిసిసి బ్యాంక్‌ ఛైర్‌పర్సన్‌ లిఖిత, సిడబ్ల్యూసి ఛైర్‌పర్సన్‌ మేడా రామలక్ష్మి, హౌసింగ్‌ పీడీ నరసింహారెడ్డి, ఆర్డీవో మధుసూదన్‌, పిఆర్‌ ఎస్‌ఈ భాగ్యరాజ్‌, హౌసింగ్‌ డిఈ కష్ణారావు, మాజీ ఎడిసిసి బ్యాంక్‌ ఛైర్‌పర్సన్‌ పామిడి వీరాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.