Oct 17,2023 21:07

కొమరాడ : వైద్యశిబిరాన్ని పరిశీలిస్తున్న డిఎంహెచ్‌ఒ జగన్నాధరావు

ప్రజాశక్తి - కురుపాం : పేద ప్రజలకు వరం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమమని, దీని ద్వారా ప్రభుత్వం గ్రామాల్లో అందిస్తున్న వైద్య సేవలు ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌ అన్నారు. మండలంలోని నీలకంఠాపురంలో మంగళవారంనిర్వహించిన జగనన్న సురక్ష వైద్య శిబిరాన్ని ఆయను సందర్శించారు. ఈ సందర్భంగా వైద్య శిబిరంలో రోగులకు అందిస్తున్న వైద్య సేవల తీరును పరిశీలించారు. వైద్య శిబిరంలో ఏర్పాటు చేసిన పలు విభాగాలను, మందులు నిల్వలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇంటింటికీ వాలంటీర్లు, ఎఎన్‌ఎంల ఆరోగ్య సర్వేతో పాటు గ్రామ సచివాలయ పరిధిలోని సిడిఎన్‌సిడి సర్వే జాబితా వివరాలు ఆధారంగా రోగులను గుర్తించి ఏ ఒక్కరూ వైద్యానికి దూరం కాకుండా మెరుగైన వైద్యం అందించాలని అన్నారు. ఆరోగ్య శ్రీ కింద అత్యవసర పరిస్థితుల్లో వైద్యసేవలు పొందుటకు అందుబాటులో గల ఆసుపత్రుల గురించిన సమాచారం శిబిరానికి వచ్చే రోగులకు తెలియజేసి అవగాహన కల్పించాలని సూచించారు. శిబిరానికి వచ్చే వారికి అవసరమైన ఆరోగ్య చికిత్సలతో పాటు మనోధైర్యాన్ని నింపాలన్నారు. అనారోగ్యంతో అధిక డబ్బులు ఖర్చుపెట్టి కుటుంబాలు ఆర్థికంగా చితికిపోకూడదన్న ఉద్దేశంతో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం గ్రామాల్లో నిర్వహిస్తుందనిన్నారు. వైద్యశిబిరంలో సేవలు పొందుతున్న ప్రజలకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీయగా గ్రామంలో నిపుణులైన వైద్యులు అందుబాటులో ఉండి సేవలు అందిస్తుండడంతో వైద్య పరీక్షలు కోసం శిబిరానికి వచ్చామని, వైద్య శిభిరంలో మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని సంతప్తి వ్యక్తం చేశారు. ఆరోగ్యకర గ్రామాలకు జగనన్న సురక్ష వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి బి.సత్యనారాయణ, ఎంపిడిఒ వివి శివరామప్ప,వెద్య సిబ్బంది, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
సీతానగరం : మండలంలోని దయానిధిపురంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే అలజంగి జోగారావు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన ప్రజలకు అందుతున్న ఆరోగ్య పరీక్షలతో పాటు అక్కడ ఏర్పాట్లను పరిశీలించారు. రోగులకు ఎక్కడా ఇబ్బంది కలగకుండా కుర్చీలు ఏర్పాటు చేసి, వికలాంగులు, వద్దులకు వీల్‌ చైర్లు సమకూర్చి వారిని వైద్యులు వద్దకు తీసుకుని వెళ్లేలా చూడాలని ఎమ్మెల్యే సూచించారు.వృద్ధులను, వికలాంగులను, ప్రజలను ప్రత్యేకంగా కలుసుకుని వారి సమస్యలను తెలుసుకుని వారికి పూర్తి వైద్య సహాయ సహకారాలు అందేలా చూడాని వైద్యులకు, ఆరోగ్య సిబ్బందికి ఆదేశించడం జరిగినది. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యులు మామిడి బాబ్జీ, ఎంపీపీ ప్రతినిధి బలగ శ్రీరాములు నాయుడు, సర్పంచ్‌ తెంటు రామారావు, మాజీ సర్పంచ్‌ యాల్ల రాధాకృష్ణ, మండల వైసిపి నాయకులు, కార్యకర్తలు, ఎంపిడిఒ, పలుశాఖల అధికారులు పాల్గొన్నారు.
గుమ్మలక్ష్మీపురం : జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో భాగంగా గుమ్మలక్ష్మీ పురం మండలంలో వైద్య సిబ్బంది ఇంటింటి ఆరోగ్య సర్వే నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఎల్విన్‌ పేటలోని ఎంపీడీవో క్వార్టర్స్‌ వీధిలో మంగళవారం ఇంటింటి ఆరోగ్య సర్వే చేసి వైద్య పరీక్షలు నిర్వహించారు. జ్వరం, బిపి, షుగర్‌, చర్మ వ్యాధులు, కంటి వ్యాధులకు సంబంధించి ఉన్నవారిని గుర్తించి పరీక్షలు నిర్వహించారు. ఈ నెల 31న జరగబోయే జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరానికి రావాలని సూచిస్తున్నారు.
సాలూరు: స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఆవరణలో ఏడో సచివాలయం పరిధిలో ఉన్న ప్రజల కోసం నిర్వహించిన వైద్య శిబిరాన్ని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పువ్వల ఈశ్వరమ్మ పరిశీలించారు. అనంతరం రోగులకు కేస్‌ షీట్లు పంపిణీ చేశారు. 12వార్డు కౌన్సిలర్‌ హరి అప్పలకొండ తో కలిసి గర్భిణీ స్త్రీలకు సీమంతం నిర్వహించారు.అనంతరం సభలో మాట్లాడుతూ ప్రయివేటు ఆసుపత్రులకు వెళ్లి మెరుగైన వైద్యం పొందలేని పేదల కోసం ప్రభుత్వం నిపుణులైన వైద్యులతో వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఈ శిబిరాలను ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ శిబిరానికి హాజరైన రోగులందరికీ వైద్య సేవలు అందించామని కమిషనర్‌ జయరాం తెలిపారు. కార్యక్రమంలో అర్బన్‌ బ్యాంక్‌ అధ్యక్షుడు జర్జాపు ఈశ్వరరావు, వైసిపి జిల్లా ప్రధాన కార్యదర్శి జర్జాపు సూరిబాబు, కౌన్సిలర్లు రాపాక మాధవరావు, గొర్లి వెంకటరమణ, పప్పల లక్ష్మణరావు, ఆర్‌ఐ అహ్మద్‌, శానిటేషన్‌ ఇన్‌ స్పెక్టర్‌ ఫకీర్‌ రాజు పాల్గొన్నారు.
పాచిపెంట : మండలంలోని కొటికిపెంటలో సర్పంచ్‌ ఇజ్జాడ అప్పలనాయుడు ఆధ్వర్యంలో మంగళవారం జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న ఎంపిపి బి ప్రమీల మాట్లాడుతూ జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయన్నారు. కార్యక్రమంలో వైసిపి మండల అధ్యక్షుడు గొట్టాపు ముత్యాల నాయుడు. వైస్‌ ఎంపిపి మీసాల నారాయణ, టి.గౌరీశ్వరరావు, సలాది అప్పలనాయుడు, ఎం.మధుసూదన్‌ రావు. డిప్యూటీ డిఎంహెచ్‌ఒ డాక్టర్‌ శివకుమార్‌, గ్రామస్తులు పాల్గొన్నారు
కొమరాడ: మండలంలోని గుణానాపురంలో జగనన్న ఆరోగ్య సురక్ష ( జెఎఎస్‌) కార్యక్రమాన్ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ బగాది జగన్నాథరావు మంగళవారం తనిఖీ చేశారు. ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో ఏర్పాటు చేసిన కౌంటర్లను సందర్శించారు. శిబిరానికి విచ్చేసిన వైద్య నిపుణులు, ప్రజలతో మాట్లాడారు. గ్రామాలు, వార్డుల్లో ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారికి గ్రామాల్లోనే స్పెషలిస్టు వైద్యులతో సత్వర వైద్యం అందుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. వైద్య శిబిరంలో ఔషధాలు అందుబాటులో ఉన్నాయన్నారు. అవసరం మేరకు వైద్య పరీక్షలు నిర్వహిస్తారని చెప్పారు. జిల్లాలో ఇప్పటి వరకు సుమారు 70 వేల మంది ప్రజలు శిబిరాల్లో వైద్య సేవలు పొందారని ఆయన చెప్పారు. ఇందులో 7628 మందికి మధుమేహం ఉన్నట్లు, 12152 మందికి బిపి ఉన్నట్లు గుర్తించామన్నారు. కార్యక్రమంలో వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.
సాలూరు రూరల్‌: మండలం పెద బోర బంద లో జగనన్న అరోగ్య సురక్ష కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వైస్‌ ఎంపిపి రెడ్డి సురేష్‌ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలనే ఉద్దేశ్యంతోనే జగనన్న అరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టిందని, దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో మండల వైసిపి అధ్యక్షుల సువ్వాడ భరత్‌ శ్రీనివాసరావు, ఎంపిడిఒ గొల్లపల్లి పార్వతి, జెఎసి ఛైర్మెన్‌ కల్లెపల్లి త్రినాథ్‌నాయుడు, డిప్యూటీ డిఎంహెచ్‌ఒ శివ కుమార్‌, వైద్యులు, సచివాలయ, అంగన్వాడీ, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
వీరఘట్టం : మండలంలోని తుడిలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ కె.వెంకటరమణ, మండల ఉపాధ్యక్షులు పి.విజయకుమారి, తహశీల్దార్‌ సిహెచ్‌ సత్యనారాయణ, వైద్యాధికారులు జి.ప్రదీప్‌కుమార్‌, ఎస్‌ నితీశా, సచివాలయ కార్యదర్శి ఎ.చిన్నారావు, వైద్య, సచివాలయ సిబ్బందితో పాటు గ్రామ వాలంటీర్లు గ్రామస్తులు పాల్గొన్నారు.