
ప్రజాశక్తి - కారంచేడు
పేదింటి విద్యా కుసుమాలకు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా విదేశీ విద్య అభ్యసించే అరుదైన అవకాశాన్ని అప్పటి సిఎం చంద్రబాబు కల్పించారని ఎంఎల్‌ఎ ఏలూరి సాంబశివరావు అన్నారు. ప్రస్తుత వైసిపి పాలనలో ప్రభుత్వ విద్యా వ్యవస్థలను ధ్వంసం చేశారని ఆరోపించారు. చంద్రబాబుపై సీఎం జగన్ అక్రమ కేసులు బనాయించేందుకు చూపిన శ్రద్ధలో కొంచెమైనా అభివృద్దిపై దృష్టి పెట్టాల్సిందని హితవు పలికారు. మండలంలోని కొడవలివారిపాలెంలో గురువారం రాత్రి మన పల్లెకు మన ఏలూరి పాదయాత్రని ప్రారంభించారు. తొలుత తెలుగు మహిళలు హారతులతో స్వాగతం పలికారు. రామాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. గ్రామంలోని ఎస్సీ, బిసి, ఎస్సీ కాలనీతో పాటు అన్ని వీధులు పర్యటించారు. మహిళలు, వృద్ధులు, పేదలను కలసి ప్రభుత్వం వ్యవహరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై మాట్లాడారు. టిడిపి హయాంలో ఎస్సీల అభ్యున్నతికి అమలు చేసిన 28పథకాలను జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం రద్దు చేసిందని అన్నారు. కొడవలివారిపాలెంను సమగ్రంగా అభివృద్ధి చేసే బాధ్యత తనదేనన్నారు. ఈపాటికే సీసీ రోడ్లు వేమని గుర్తు చేశారు. మురుగు నీటిపారుదలకు అధికారంలోకి రాగానే కాలువల నిర్మాణాలు చేపడతామని హామీ ఇచ్చారు. అర్హులైన పేదలందరికీ ఇల్లు నిర్మిస్తామని చెప్పారు. చంద్రబాబును రాజకీయంగా ఎదుర్కోలేక లేని అవినీతిని అంటగట్టి కక్షపూరితంగా అక్రమ కేసులు పెట్టడాన్ని ఉపేక్షించమని, వైసిపి నేతలు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. చంద్రబాబుని మరోసారి ముఖ్యమంత్రిని చేసుకునేందుకు టిడిపి శ్రేణులు సంఘటితంగా పనిచేయాలని కోరారు. చంద్రబాబు అక్రమ అరెస్టుపై కరపత్రాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి సలగల రాజశేఖర్ బాబు, టిడిపి మండల అధ్యక్షులు తిరుమల శెట్టి శ్రీహరి, నాయుడు హనుమంతరావు, షేక్ సంసుద్దీన్, పొద వీరయ్య, కొసరాజు సురేంద్రబాబు, కొడాలి శ్రీనివాసరావు, పూర్ణయ్య, సుబ్బారావు పాల్గొన్నారు.