ప్రజాశక్తి-కాకినాడ రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న మెడికల్ కాలేజీల్లో సీట్లు అమ్మొద్దని, పేదవారికి వైద్య విద్యను దూరం చేయొద్దని డిమాండ్ చేస్తూ కాకినాడ కోకిల సెంటర్ వద్ద ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ కాకినాడ జిల్లా కార్యదర్శి ఎం.గంగా సూరిబాబు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకూ కేటాయించిన వైద్య కళాశాలలో రాష్ట్రానికి ఐదు మాత్రమే కేటాయించి ఆంధ్రప్రదేశ్‌పై బిజెపి ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని మరొకసారి చాటి చెప్పిందన్నారు. కేటాయించిన ఐదు కాలేజీల్లో పేదవారికి వైద్య విద్యను దూరం చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం చూస్తుందని విమర్శించారు. మెడికల్ కాలేజీల్లో 50 శాతం సీట్లలో 35 శాతం సీట్లను బి కేటగిరీ కింద, 15 శాతం సీట్లు ఎన్నారై సి కేటగిరీ కింద, సెల్ఫ్ ఫైనాన్స్ గ్రూప్‌లుగా రాష్ట్ర ప్రభుత్వం అమ్ము కునేందుకు తీసు కొచ్చిన 107,108 జిఒల వల్ల పేద, మధ్య తరగతి విద్యార్థులు వైద్య విద్యకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి అధికారం లోకి రాకముందు తాము అధికారంలోకి వచ్చిన తర్వాత అందరికీ ఉచిత విద్య ఇస్తామని చెప్పి నేడు అధికారంలోకి వచ్చిన తరువాత పేదవారికి వైద్య విద్యను దూరం చేస్తునారన్నారు. జిఒ నెంబర్ 107, 108 వల్ల పేద, మధ్యతరగతి విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నగర నాయకులు సాహిత్, వాసు, తేజ, అభిషేక్, ఆదర్శ కార్తీక్ పాల్గొన్నారు.










