పెనుకొండ : పట్టణంలో ఇళ్లు లేని పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సిపిఎం, వ్యకాసం, సిఐటియు ఆధ్వర్యంలో చేపట్టిన భూస్వాధీన పోరాటం మంగళవారం నాడూ కొనసాగింది. 668 సర్వే నెంబర్ ప్రభుత్వ స్థలంలో పేదలు సిపిఎం ఆధ్వర్యంలో గుడిసెలు వేసుకున్నారు. అధికారులు తక్షణం తమకు ఇళ్ల పట్టాలు మంజూరు చేసి, గృహాలు నిర్మించి ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దన్న, జిల్లా సహాయ కార్యదర్శి గంగాధర్, వెంకటరాముడు తదితరులు మాట్లాడుతూ నిరుపేదలకు ఇళ్ల స్థలాలు, పట్టాలు మంజూరు చేసే వరకు భూస్వాధీన పోరాటం కొనసాగిస్తామని చెప్పారు. అధికారులు స్పందించే వరకు ఈ ప్రాంతంలోనే గుడిసెలు వేసుకుని అక్కడే ఉంటామన్నారు. పేదలకు సొంతిళ్లు లేక బాడుగలు కట్టలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఇళ్ల స్థలాల కోసం ప్రజలు తహశీల్దార్, కమిషనర్, సబ్ కలెక్టర్, సచివాలయంలో అనేకమార్లు అర్జీలు ఇచ్చినా దాని గురించి పట్టించుకోవడం లేదన్నారు. అర్జీ పెట్టుకున్న 90 రోజుల్లో ఇళ్ల పట్టాలు ఇస్తామన్న హామీ నెరవేరడం లేదన్నారు. అధికారులు స్పందించి పెనుకొండలోని 668 సర్వే నెంబర్‌లో పేదలకు పట్టాలు ఇచ్చేంత వరకు ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. భూస్వాధీన పోరాటం విషయం తెలుసుకున్న తహశీల్దార్ స్వర్ణలత, కమిషనర్ వంశీకృష్ణ భార్గవ, పోలీస్ సిబ్బంది అక్కడికి చేరుకుని నాయకులతో మాట్లాడారు. పేదలందరికీ ఇళ్ల పట్టాలు ఇస్తామని, దీనికి కొంత సమయం కావాలని వారు చెప్పారు. ఇందుకు నాయకులు ఒప్పుకోలేదు. ఇళ్ల పట్టాలు ఇచ్చేంత వరకు ఈ స్థలం నుంచి కదిలేది లేదంటూ నాయకులు వారికి తెగేసి చెప్పారు. దీంతో అధికారులు అక్కడి నుంచి వెనుదిరిగారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు అన్నమయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి రమణ, వెంకటేష్, తిప్పన్న, కొండా వెంకటేష్, రంగప్ప పాల్గొన్నారు.










