Oct 30,2022 22:24

ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు

ప్రజాశక్తి -తగరపువలస : ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి హయంలోనే పేదల సొంతింటి కల సాకారం అవుతుందని స్థానిక ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. జివిఎంసి 1, 2, 3 వార్డుల పరిధిలో ఉన్న 828 మంది లబ్ధిదారులకు రెండో విడత అందరికీ ఇళ్లు పథకం కింద ఆదివారం పట్టాలు అందజేశారు. స్థానిక ఎన్‌టిఆర్‌ పార్క్‌ ఆవరణలో జరిగిన ఇళ్ల పట్టాల పంపిణీ సభలో ఆయన మాట్లాడుతూ, మొదటి విడతలో భీమిలి జోన్‌ పరిధిలో సుమారు 5 వేల మందికి, మండలంలో 3,700 మందికి ఇళ్ళ పట్టాలు పంపిణీ చేశామన్నారు. భీమిలి జోన్‌, మండల పరిధిలో సుమారు రూ.70 కోట్ల విలువైన ప్రభుత్వ స్థలాలు ఇళ్ల పట్టాలు కింద అందజేసినట్లు వివరించారు.
సుదీర్ఘ కాలంగా రాజకీయ అనుభవం ఉందని చెప్పుకుంటున్న చంద్రబాబు కంటే ,పేదలకు మేలు చేయాలన్న గొప్ప మనసున్న నేత జగన్మోహన్‌రెడ్డి అని ఎమ్మెల్యే అన్నారు. సిఫార్సులు,పైరవీలు లేకుండా అత్యంత పార దర్శకంగా ఇళ్ల పట్టాలు మంజూరు చేస్తున్నట్లు వివరించారు. సంక్షేమ పథకాల అమలుతో జగన్మోహన్‌రెడ్డి ఇప్పటికే జనంలో హీరో అయ్యారని, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ సినిమాలో మాత్రమే హీరో అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జివిఎంసి కమిషనర్‌ రాజాబాబు, 1, 4 వార్డుల కార్పొరేటర్లు అక్కరమాని పద్మ, దౌలపల్లి కొండబాబు, కో ఆప్షన్‌ సభ్యులు కొప్పల ప్రభావతి, పిఎసిఎస్‌ అధ్యక్షులు రామునాయుడు, వ్యవసాయ సలహా మండలి జిల్లా చైర్మన్‌ పెదబాబు, ఎఎంసి చైర్మన్‌ యలమంచిలి సూర్యనారాయణ, జెడ్‌పిటిసి సభ్యులు గాడు వెంకటప్పడు, జోన్‌-1 కమిషనర్‌ ఎస్‌.వెంకటరమణ, తహసీల్దార్‌ కోరాడ వేణుగోపాల్‌ తది తరులు పాల్గొన్నారు.
అభివృద్ధి పనులకుశంకుస్థాపన
ఆదర్శ నగర్‌, సంతపేట, బాలాజీ నగర్‌, చిట్టివలస వార్డు సచివాలయాల పరిధిలో రూ.76.40 లక్షలతో చేపట్టనున్న సిమెంట్‌ రోడ్లు, కాల్వల నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.