Jun 03,2023 00:11

మాట్లాడుతున్న ఐటిడిఎ పిఒ సూరజ్‌ గనోరే

వైద్యాధికారులను ఆదేశించిన ఐటిడిఎ పిఒ సూరజ్‌ గనోరే
ప్రజాశక్తి - రంపచోడవరం

ఏజెన్సీలోని పేదలందరికీ సకాలంలో వైద్య సేవలు అందించే విధంగా తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని రంపచోడవరం ఐటిడిఎ ప్రాజెక్ట్‌ అధికారి సూరజ్‌ గనోరే పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక ఐటీడీఏ సమావేశ మందిరంలో నుండి రంపచోడవరం, చింతూరు డివిజన్‌ పరిధిలోని 11 మండలాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా పిఒ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫ్యామిలీ ఫిజీషియన్‌ కార్యక్రమం ద్వారా గ్రామాలలో ప్రతి ఇంటికీ వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితులను కనుగొని తగు వైద్య సేవలు అందించాలని కోరారు. బిపి, షుగర్‌, టీబీ, కేన్సర్‌ వ్యాధులు ఉన్న వారిని గుర్తించి మెరుగైన వైద్య సేవలు అందించే విధంగా ఐడి ఏర్పాటు చేసి, ఎప్పటికప్పుడు వైద్యాధికారులు, సిబ్బంది ఆయా గ్రామాలలో పర్యటించి మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. నెలలు నిండిన వెంటనే 15 రోజుల ముందే గర్భిణులను సంబంధిత ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోని వెయిటింగ్‌ హాల్లో జాయిన్‌ చేసుకోవాలన్నారు. ప్రతి ఏ పిహెచ్‌సిలో ఎంత మంది గర్భిణులు ఉన్నది ఆరా తీశారు. అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలల్లోని విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. డెంగీ, మలేరియా ప్రబలకుండా దోమల నివారణకు మందు పిచికారి చేయాలన్నారు. దోమల నివారణ మందు పిచికారి రిపోర్టులు ఎప్పటికప్పుడు సమర్పించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎడిఎం అండ్‌ హెచ్‌ఒ డాక్టర్‌ అనూష, అడిషనల్‌ డిఎంహెచ్‌ఒ డాక్టర్‌ పుల్లయ్య, డాక్టర్‌ రాధిక, ఎఎంఒ నక్క వెంకటేశ్వరరావు, వైద్యాధికారులు పాల్గొన్నారు.