Dec 07,2022 21:31

ప్రజాశక్తి - టి.నరసాపురం
              పోడు సాగు చేస్తున్న పేదలకు పట్టాలు మంజూరు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి తుమ్మల సత్యనారాయణ డిమాండ్‌ చేశారు. ఏజెన్సీ పోరాటాలకు ముఖద్వారమైన జంగారెడ్డిగూడెంలో ఈ నెల 8, 9 ,10 తేదీల్లో జరిగే రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో బుధవారం మండలంలోని అల్లూరి సీతారామరాజు నగర్‌, టి.నరసాపురం, ప్రకాష్‌నగర్‌, మల్లప్పగూడెం, బచ్చులేటిగూడెం, సాలిగూడెం, రామమ్మగూడెం, అబ్దుల్లాపురం గ్రామాల్లో వ్యవసాయ కార్మిక సంఘం జెండాలను బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ ఎనిమిదో తేదీన 12 గంటలకు జంగారెడ్డిగూడెం మార్కెట్‌ యార్డు వద్ద నుంచి బస్టాండ్‌ పక్కన ఉన్న మైదానం వరకు ర్యాలీ ప్రదర్శన కార్యక్రమం ఉంటుందని, అనంతరం జరిగే బహిరంగ సభకు మాజీ ఎంపీ, ఉపాధి హామీ రూపకల్పన చేసిన బృందాకరత్‌, వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ అధ్యక్ష కార్యదర్శులు విజయ రాఘవన్‌, రాష్ట్ర నాయకుల ు వెంకట్‌, రాష్ట్ర నలుమూలల నుంచి నాయకులు హాజరవుతారన్నారు. పదివేల మంది వ్యవసాయ కూలీలు, చిన్న సన్నకారు రైతులు పెద్ద ఎత్తున హాజరవుతున్నారు. ఈ మహాసభకు మండలంలోని వ్యవసాయ కూలీలు ప్రజలు హాజరై జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల నాయకులు మడకం సుధారాణి, రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యులు అనుమలు మురళి, మహిళా సంఘం మండల కార్యదర్శి మడకం కుమారి, గిరిజన సంఘం జిల్లా సహాయ కార్యదర్శి పుసం చిన్నసూర్యరావు, ఎర్ర కాలువ మిగులు భూములు పోరాట కమిటీ నాయకులు బుద్దుల దుర్గమ్మ పాల్గొన్నారు.
చాట్రాయి : ఎనిమిదో తేదీ నుంచి జంగారెడ్డిగూడెంలో నిర్వహించే వ్యవసాయ కార్మిక సంఘం 29వ రాష్ట్ర మహాసభలో వ్యవసాయ కార్మికులు, కూలీలు పాల్గొని జయప్రదం చేయాలని సిపిఎం మండల కార్యదర్శి కొమ్ము ఆనందం పిలుపునిచ్చారు. బుధవారం ఆయన స్థానికంగా మాట్లాడుతూ కూలి పెంచండి, భూమి పంచండి అనే నినాదంతో రాష్ట్ర మహాసభలు జరుగుతున్నాయని, ప్రతి వ్యవసాయ కూలీ ఈ మహాసభలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ మహాసభకు మాజీ ఎంపీ బృందాకారత్‌, కేరళ రాష్ట్ర మంత్రి, రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొంటారని తెలిపారు.
కలిదిండి : ఈ నెల ఎనిమిదో తేదీ నుంచి పదో తేదీ వరకు జంగారెడ్డిగూడెంలో నిర్వహించే వ్యవసాయ కార్మిక సంఘం 29వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ మండలంలోని పెదలంక, మూలలంక, భాస్కరరావుపేట, పడమటిపాలెం, సానారుద్రవరం, కోరుకొల్లు గ్రామాల్లో వ్యవసాయ కార్మిక సంఘం జెండా ఆవిష్కరణలు చేశారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి శేషపు మహంకాళరావు, మండల కార్యదర్శి జక్కుల మహేష్‌, మండల కమిటీ సభ్యులు పెరుమాల రమేష్‌, గోసంగి వినోద్‌, చీకటి సత్యనారాయణ, వీరవల్లి భాస్కరరావు, కుడిపూడి శ్రీనివాసరావు, గద్దె అనిల్‌, బుస్సా రామనాగేంద్రం, జోగి ఏసు, పంతగాని ప్రకాష్‌, ముంగం సురేష్‌, శేఖర్‌, అనిత పాల్గొన్నారు.