Jul 02,2023 23:44

మాట్లాడుతున్న లోక నాధం

ప్రజాశక్తి-మాడుగుల:పేద ప్రజలకు పట్టాలిచ్చినా ఫలితం లేకుండా పోయిందని, ఈ విషయం పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం తగదని సిపిఎం జిల్లా కార్యదర్శి కె లోకనాధం ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలోని ఒమ్మలి పంచాయతీ పరిధి వుర్లలోవ ప్రాంతాన్ని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి వెంకన్న, కార్యవర్గ సభ్యులు కె.గోవిందరావుతో కలిసి పరిశీలించారు. అనంతరం పట్టా దారులతో ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా లోకనాథం మాట్లాడుతూ, సంవత్సరాల తరబడి పట్టా భూములలో సాగు చేసుకుంటూ బతుకుతున్న పేదలను పాలకులు మోసం చేశారని విమర్శించారు. ఒమ్మలి గ్రామానికి చెందిన 150 మంది దళితులు, ఇతర పేదలకు 2013లో వుర్లలోవ రెవెన్యూ పరిధిలో 200 ఎకరాల డి ఫారం పట్టాలు ప్రభుత్వం మంజూరు చేసిందని తెలిపారు. వెబ్‌ లాండ్‌ రికార్డులో రెవెన్యూ విలేజ్‌గా నమోదు కాక పోవడంతో అన్‌ సెటిల్‌ విలేజ్‌గా ఉండిపోయిందని, దీంతో, పట్టాలు పంపిణీ చేసినా ఫలితం లేకుండా పోయిందని తెలిపారు. అనేక సంవత్సరాలుగా జీడి మామిడి సాగు చేస్తున్న పేద, దళిత రైతులకు ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని, వీరికి మాత్రం అందలేదని పేర్కొన్నారు.సంక్షేమ పథకాలు అమలు అందాలంటే వెబ్‌ లాండ్‌లో నమోదు కావాలని, ఊర్లోవ భూము అన్‌ లైన్‌ కాక వీరికి ఏ పథకం కూడా వర్తించలేదని పేర్కొన్నారు. ఇదే పరిస్థితి ఇతర ధనిక రైతులకు జరిగితే ప్రభుత్వం ఇలా నిర్లక్ష్యం చేస్తుందా అని ప్రశ్నించారు. ఈ విషయమై జాయింట్‌ కలెక్టర్‌ స్వయంగా దర్యాప్తు చేసి సదరు పట్టాలు ఆన్‌ లైన్‌ చేసి, అన్ని ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అమలు అయ్యేందుకు చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. అభివృద్ధి పేరిట ఏజన్సీ ప్రాంతాల్లో మైనింగ్‌ కంపెనీలకు ప్రభుత్వం లీజుకు ఇస్తుండటంతో పేదల పట్టా భూములకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని తెలిపారు. మైనింగ్‌ వ్యాపారులు గిరిజన, దళిత రైతులపై దౌర్జన్యాలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నేత భవాని, రైతులు పాల్గొన్నారు.