పేదలకు పట్టాలిచ్చే వరకూ పోరాటం
విఆర్‌ఒ హామీతో సిపిఎం ధర్నా విరమణ
పజాశక్తి - నాగలాపురం
పేదల ఇంటి స్థలాలకు పట్టాలిచ్చేంత వరకూ పోరాటం కొనసాగుతుందని సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు హెచ్చరించారు. బుధవారం నాగలాపురం తహశీల్దార్ కార్యాలయం వద్ద సుందరయ్య కాలనీలో గుడిసెలు వేసుకుని నివాసం ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వందవాసి నాగరాజు మాట్లాడుతూ వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం పేదలందరికీ ఇంటి స్థలాలు పంచుతుంటే, నాగలాపురంలో మాత్రం స్థానిక నాయకులు విరుద్ధంగా వ్యవహరించడం దారుణమన్నారు. గత 13 ఏళ్లుగా గుడిసెలు వేసుకుని నివాసం ఉంటుంటే, పట్టాలు ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. ఇంటిపట్టాల కోసం దీర్ఘకాలికంగా సిపిఎం ఆందోళన చేస్తూనే ఉందన్నారు. పేదలకు నివాస స్థలాలు, పక్కా ఇళ్లు, ప్రతి కుటుంబానికి రెండు ఎకరాల సాగు భూమి పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు దాసరి జనార్ధన్ మాట్లాడుతూ 13 ఏళ్లుగా విద్యుత్ సబ్‌స్టేషన్ పక్కనే గుడిసెలు వేసుకుని నివసిస్తుంటే వారి వైపు కన్నెత్తి చూడని అధికారులు, ఎన్నికలపుడు మాత్రం ఓట్లను దండుకునేందుకు వస్తారన్నారు. నాగలాపురం నుంచి టిపి పాలెం వెళ్లే ఆర్ అండ్ బి రోడ్డు మరమ్మతులకు నోచుకోకపోగా. రెండుసార్లు డబుల్ రోడ్డుకు శంకుస్థాపన చేసిన నాయకులు సింగిల్ రోడ్డు కూడా వేయలేకపోయారని విమర్శించారు. అధికారులు స్పందించి పేదలకు ఇంటి పట్టాలు మంజూరు చేసి, పక్కా ఇళ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అధికారులు స్పందించకపోతే లబ్దిదారులతో తహశీల్దార్ కార్యాలయం వద్ద ఆమరణ దీక్షకు కూర్చుంటామని హెచ్చరించారు. విఆర్‌ఒ నాగభూషణం స్పందిస్తూ అర్హులైన పేదలందరికీ ఇంటి పట్టాలు వెంటనే మంజూరు చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళనకారులు శాంతించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మెలుగు రమేష్, నాగలాపురం నాగరాజు, రామచంద్రారెడ్డి, ఆర్.మురగేష్, అముదా, దినమణి, సుబ్బమ్మ, బాలాజీ, అమృత, కోదండపాణి పాల్గొన్నారు.










