ప్రజాశక్తి - పల్నాడు జిల్లా : దేవాలయ భూముల కౌలుదారులుగా చిన్న, సన్నకారు రైతుల పేర్లు నమోదు చేయాలని ప్రభుత్వాన్ని వ్యవసాయ కార్మిక సంఘం పల్నాడు జిల్లా కార్యదర్శి అనుముల లక్ష్మీశ్వరరెడ్డి డిమాండ్ చేశారు. వ్యవసాయ కార్మిక సంఘం, కెవిపిఎస్ ఆధ్వర్యంలో గురువారం ఉదయం 10 గంటలకు గురజాల ఎంపిడిఒ కార్యాలయం వద్ద జరిగే భూ సదస్సు జయప్రదం చేయాలని కోరుతూ గురజాల మండలంలో బుధవారం ఆటో ప్రచారం నిర్వహించారు. జంగమేశ్వరపురం, చర్లగుడిపాడు, గురజాల, గంగవరం, పులిపాడు, దైద, సమాధానంపేట, గోగులపాడు, మాడుగుల, అంజనీపురం తదితర గ్రామాల్లో ప్రచారం సాగింది. ఈ సందర్భంగా లక్ష్మీశ్వరరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేదలకు భూములు పంచుతామని ఒకవైపు చెబుతున్నా మరోవైపు పేద, చిన్న సన్నకారు రైతుల ఆధీనంలోని దేవాలయ భూములను వారి పేరుతో నమోదు చేయకుండా పెద్ద రైతుల పేరుతో నమోదు చేస్తోందని అన్నారు. తద్వారా చిన్న రైతులకు రాయితీలు, పథకాలు అందకుండా చేస్తోందని విమర్శించారు. గంగవరం, మాడుగుల, దైద తదితర అనేక గ్రామాల్లో దేవాదాయ భూములు సాగు చేసుకుంటూ కౌలు చెల్లిస్తున్న పేద రైతుల పేర్లను దేవాదాయ శాఖ రికార్డుల్లో నమోదు కావడం లేదని, వారికి కౌలు రైతుగా పంట రుణాలు ఇవ్వడం లేదని అన్నారు. కోనేరు రంగారావు భూ కమిటీ సిఫార్సులు ప్రకారం భూమి లేని ప్రతి పేద కుటుంబానికి రెండెకరాల సాగుభూమి పంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పేదలకు పంచడానికి వీలున్న భూముల వివరాలను రాష్ట్ర ప్రభుత్వం ముందు ఉంచడానికే సదస్సును నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సదస్సు అనంతరం ఆర్‌డిఒకు భూముల జాబితాను ఇస్తామని చెప్పారు. అసైన్మెంట్ భూముల విషయంలో ఉన్న పీఓటి చట్టం 9/77ను సవరించడం సరికాదన్నారు. ఇప్పటికే అసైన్మెంట్ భూముల్లో సగం భూములు అన్యాక్రాంతం మయ్యాయని, అన్యాక్రాంతమైన భూములను తిరిగి స్వాధీనం చేసుకుని పేదలకు పంపిణీ చేయాలని, అనర్హులకు భూములు రిజిస్ట్రేషన్ చేయొద్దని కోరారు. ప్రచారంలో చర్లగుడిపాడు భూ పోరాట కమిటీ సభ్యులు పి.ఆదాం, కె.అక్కులు, పి.రమేష్, బి.సువర్ణబాబు, వి.ఏసుబాబు, కె.ఎలమంద పాల్గొన్నారు.










