ప్రజాశక్తి - ఏలూరు
రాష్ట్ర ప్రభుత్వం పేదలకు నష్టం కలిగేలా అసైన్డ్ భూముల చట్ట సవరణ ఉందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మంతెన సీతారాం విమర్శించారు. వెంటనే ఈ చట్ట సవరణను నిలుపుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. స్థానిక పవర్‌పేటలోని సిపిఎం జిల్లా కార్యాలయంలో ఆదివారం జరిగిన జిల్లా కమిటీ సమావేశానికి పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు తెల్లం రామకృష్ణ అధ్యక్షత వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సీతారాం మాట్లాడుతూ అసైన్డ్ భూములపై యాజమాన్య హక్కులు కల్పించడం వల్ల భూస్వాములకు, పెత్తందారులకు ప్రయోజనం జరుగుతుందని, పేదలు నష్టపోతారని తెలిపారు. అసైన్మెంట్ భూములు పంపిణీ చేయాలన్నప్పుడు లబ్ధిదారులను అసైన్మెంట్ కమిటీలో నిర్ణయించాల్సి ఉన్నా దానికి భిన్నంగా చేయడాన్ని తప్పుబట్టారు. గ్రామ సచివాలయాల వద్ద అసైన్మెంట్ భూముల ఆక్రమణదారుల పేర్లు బహిర్గతపరచాలన్నారు. పెత్తందారులకు, భూస్వాములకు యాజమాన్యం హక్కులు కల్పించడం వల్ల అధికార పార్టీ నేతలే ప్రయోజనం పొందుతారని ఆందోళన వ్యక్తం చేశారు. అసైన్మెంట్ భూములు పంపిణీ చేయాలన్నప్పుడు లబ్ధిదారుల్ని అసైన్మెంట్ కమిటీలో నిర్ణయించాలని డిమాండ్ చేశారు. తక్షణం కమిటీలు వేసి చర్చించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం గతేడాది హడావుడిగా పేదల భూ పంపిణీకి చేసిన పనిలోనే పెత్తందారులు ఒక వ్యూహం ప్రకారం రాష్ట్రంలో వేలాది ఎకరాలు భూస్వాములు తమ ఆధీనంలో తెచ్చుకున్నారని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న భూదందా జాబితాలో అసైన్డ్ భూములు చేరిపోతున్నాయని, దీనివల్ల దళిత, గిరిజనులకు తీవ్రమైన అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్రంలో 1954 తర్వాత పేదలకు భూపంపిణీ చేసి అసైన్డ్ భూములపై 20 ఏళ్ల కాలపరిమితి విధించే యాజమాన్య హక్కులు కల్పించేందుకు మంత్రివర్గం ఆమోదముద్ర వేయడం ఆందోళన కలిగిస్తోందన్నారు. పేదలకు జీవనాధారంగా ఉన్న ఈ భూముల సాగుకు అవసరమయ్యే విధంగా సౌకర్యాలు కల్పించాలని కోరారు. వ్యవసాయానికి అనుకూలంగా లేకపోతే ఈ భూములను భూస్వాములు, పెట్టుబడిదారులు పేదల నుండి దౌర్జన్యంగా బలవంతంగా లాక్కొని అమ్ముకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నారన్నారు. వాటిలో వందలాది ఎకరాల్లో ఫ్యాక్టరీలు కడుతున్నారని, దీనికోసం ప్రభుత్వం పేదల నుండి భూములు లాక్కుంటుందని తెలిపారు.
సిపిఎం ఏలూరు జిల్లా కార్యదర్శి ఎ.రవి మాట్లాడుతూ జిల్లాలో లక్షలాది ఎకరాల అసైన్మెంట్ భూములు స్థానికేతర భూస్వాములు, స్థానిక భూస్వాముల చేతుల్లోనే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ భూములను బినామీల పేర్లతో దర్జాగా అనుభవిస్తున్నారని తెలిపారు. ఉదాహరణకు దెందులూరు మండలంలో దోసపాడు, కొవ్వలి, పోతునూరు గ్రామాల్లో సుమారు 150 ఎకరాలకుపైగా అసైన్మెంట్ భూములను స్థానికేతర భూస్వాములు, స్థానిక భూస్వాములు కుమ్మకై చేపలు, రొయ్యల చెరువులు తవ్వి దర్జాగా అనుభవిస్తున్న రెవెన్యూ శాఖ అధికారులు, జిల్లా జాయింట్ కలెక్టర్ పట్టించుకోకపోగా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. గత ఏడాది నుంచి దోసపాడులో దళితులు, పేదల భూముల కోసం పోరాడుతున్న భూస్వాముల చేతుల్లో ఉన్న భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని పేదలకు పంచాలని కోరుతున్నా అధికారులు మొద్దు నిద్రపోతున్నారని విమర్శించారు. దీనిపై 15 ఏళ్ల నుండి పోరాడుతున్నప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం దుర్మార్గమన్నారు. ఈ జిల్లాలో టి.నరసాపురం, చింతలపూడి, లింగపాలెం, పెదవేగి, నూజివీడు నియోజకవర్గం, జంగారెడ్డిగూడెం ప్రాంతాల్లో లక్షలాది ఎకరాల అసైన్మెంట్ భూములు నేటికీ భూస్వాముల ఆక్రమణలోనే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ భూములపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపి పేదలకు పంచాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్న అసైన్డ్ భూముల చట్టచవరణ వల్ల పేదలకు, దళితులకు తీవ్రమైన అన్యాయం జరుగుతుందన్నారు. ఈ నిర్ణయం వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని కోరారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శవర్గ సభ్యులు డిఎన్‌విడి.ప్రసాద్, ఆర్.లింగరాజు, పి.కిషోర్, జి.రాజు, మొడియం నాగమణి, జిల్లా కమిటీ సభ్యులు కె.శ్రీనివాస్ బి.సోమయ్య, ఎం.జీవరత్నం, పి.రామకృష్ణ, టి.దుర్గారావు పాల్గొన్నారు.










