Jul 31,2021 06:18

    'నూతన విద్యా విధానం' 2030-2040 సంవత్సరాల మధ్యలో పూర్తిగా అమలవుతుంది. స్కూలు కాంప్లెక్స్‌లలో అంగన్‌వాడీ విద్య నుండి 12వ తరగతి వరకు బి.ఇడి. నాలుగు సంవత్సరాల కోర్సు చేసిన ఉపాధ్యాయులే బోధిస్తారు. ఎస్‌.జి.టి లు, అంగన్‌వాడీ టీచర్లు ఉపాధి కోల్పోతారు. ప్రాథమిక స్థాయి నుండి ఉన్నత స్థాయి విద్య వరకు వృత్తి విద్యను ప్రవేశపెట్టడం...చదువు కొనలేని వారికి వృత్తి విద్యను నేర్పించి బయటకు పంపడానికే. స్కూళ్ళు, కాలేజీలు, యూనివర్సిటీలు యావత్తు స్వయం ప్రతిపత్తిని పొంది ఆర్థికంగా, సామాజికంగా ప్రతికూల పరిస్థితుల్లో ఉన్న విద్యార్థులను బయటకు గెంటేస్తాయి. ప్రభుత్వ, ప్రైవేట్‌ భాగస్వామ్యంతో విద్యా సంస్థలు నడుస్తాయి. డబ్బున్నవాళ్లేే చదువును కొనసాగిస్తారు. విద్యా సంస్థల పాలన స్వతంత్ర వ్యక్తుల పేరుతో ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి పోతుంది. 'నూతన విద్యా విధానం' విద్య ప్రైవేటీకరణ, వాణిజ్యీకరణ, కార్పొరేటీకరణలను పూర్తి చేస్తుంది.
     నాణ్యమైన విద్యను అందరికీ అందుబాటు లోకి తేవటం ద్వారా...సమానమైన, న్యాయమైన సమాజాభివృద్ధి కోసం 'నూతన విద్యా విధానం' అవసరమని విధాన పత్రంలో చెప్పారు. కానీ ఈ విధానం వలన వాస్తవంలో ఆర్థికంగా, సామాజికంగా వెనకబడిన తరగతులకు విద్య మరింత దూరమవుతుంది. 'నూతన విద్యా విధానం' పరస్పర వైరుధ్యాలతో కూడుకుంది. చెప్పేది ఒకటి, తలపెట్టింది మరొ కటిగా ఉన్న ఈ విద్యా విధానాన్ని పూర్తిగా వ్యతిరేకించాలి. ప్రస్తుత విద్యా వ్యవస్థను నూతన విద్యా విధానం నిస్సందేహంగా ఆటంకపరుస్తుంది. ప్రాథమిక స్థాయి నుండే వెనుకబడిన తరగతులకు విద్య అందుబాటులో లేకుండా పోతుంది.
 

                                                           విద్యా హక్కు చట్టానికి తూట్లు

    పద్నాలుగు సంవత్సరాల వయసు వరకు ఉచిత నిర్బంధ విద్యను అందించాలన్న '2009 విద్యా హక్కు చట్టాని'కి, రాజ్యాంగానికి...నూతన విద్యా విధానం పూర్తి వ్యతిరేకం. విద్యా హక్కు చట్టంలో నిర్దేశించిన బాధ్యతలను ప్రభుత్వం ఎంత వరకు నెరవేర్చిందో నూతన విద్యా విధానం సమీక్ష చేయలేదు.
     ప్రాథమిక పాఠశాలల్లో తరగతికి ఒకరు చొప్పున కనీసంగా ఐదుగురు టీచర్లు, ఒక హెడ్‌ మాస్టరు ఉండాలని 2009 చట్టం నిర్దేశించింది. ఆ ప్రకారం టీచర్లను రిక్రూట్‌ చేయకుండా, ఇపుడు సింగిల్‌ టీచర్‌ స్కూళ్ళు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అంగన్‌వాడీ సెంటర్లలో చెప్పే విద్య దగ్గర నుండి 12వ తరగతి వరకు స్కూళ్ళు అన్నిటినీ గ్రూపింగ్‌ చేసి ప్రతి 5 లేదా 10 కిలో మీటర్ల వరకు ఒక స్కూల్‌ కాంప్లెక్స్‌ (సముదాయం)ను నెలకొల్పాలని 'నూతన విద్యా విధానం' నిర్దేశించింది.
     ఒక్కో స్కూల్‌ కాంప్లెక్స్‌ కిందికి 5 నుండి 10 కిలో మీటర్లు పరిధిలో ఉన్న మూడు రకాల స్కూళ్ళను (ప్రీ ప్రైమరీ 1 నుండి 2వ తరగతి వరకు, 3 నుండి 8 వరకు, 9 నుండి 12 వరకు) తీసుకు రావాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పాఠశాలల వారీ మేనేజింగ్‌ కమిటీలకు బదులుగా స్కూలు కాంప్లెక్స్‌ కమిటీలు ఏర్పడతాయి. ఆయా కాంప్లెక్స్‌ల పరిధిలో ఉన్న ఉపాధ్యాయులను గరిష్టంగా ఉపయోగిస్తారు.
    స్కూల్‌ కాంప్లెక్స్‌లకు పాక్షిక స్వయం ప్రతిపత్తి ఉంటుంది. సామాజిక కార్యకర్తలు, స్వచ్ఛంద కార్యకర్తలు, నిష్ణాతులకు కాంప్లెక్స్‌ కమిటీలు విద్యా బోధనలో ప్రవేశం కల్పిస్తాయి. ఆర్‌.ఎస్‌.ఎస్‌ లాంటి మతోన్మాద శక్తుల ప్రవేశానికి అవకాశం వస్తుంది.
    విద్యాహక్కు చట్టం ప్రకారం 9వ తరగతి వరకు డిటెన్షన్‌ విధానం లేదు. 3, 5, 8 తరగతులకు పరీక్షలు నిర్వహించాలని నూతన విద్యావిధానం నిర్దేశించింది. అదే సమయంలో ఈ తరగతుల స్థాయిలో కూడా వృత్తి విద్యా కోర్సులను ప్రస్తావించింది. పరీక్షలు తప్పిన వారికి వివిధ పనులు నేర్పించి బయటకు పంపే ధోరణి కనపడింది.
    కనీసం 5 లేదా 8 తరగతుల వరకు మాతృ భాషలో బోధించే అవకాశం 'నూతన విద్యా విధానం'లో ఉంది. విద్యాహక్కు చట్టం ప్రకారం కూడా మాతృభాష లోనే విద్య గరపాలి. కానీ రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం చట్ట విరుద్ధంగా కోర్టు తీర్పులను లెక్కజేయకుండా ప్రాథమిక స్థాయి నుండి ఇంగ్లీషులో బోధించాలని నిర్ణయించింది. ఇంగ్లీషు మీడియం వలన విద్యకు వెనుకబడిన తరగతులన్నీ దూరమవుతాయి.
అంగన్‌వాడీ స్కూళ్ళను ఎలిమెంటరీ స్కూళ్ళలో, 3, 4, 5 తరగతులను హై స్కూళ్ళలో, 9, 10 తరగతులను ఇంటర్‌ మీడియట్‌తో కలపటం విద్యా వ్యవస్థ విచ్ఛిన్నతకే దారితీస్తుంది. చిన్న పిల్లలు దూరంలో ఉన్న స్కూళ్ళకు వెళ్ళలేక చదువులకు దూరమవుతారు. ఆర్థికంగా, సామాజికంగా బలపడిన కుటుంబాలు మాత్రమే తమ పిల్లలను బడికి పంపించగలుగుతాయి.
'విద్యా హక్కు చట్టం-2009' ప్రకారం అసంఘటిత కార్మికులు, వలస కార్మికుల కుటుంబాలు పనులకు వలసపోయి మరలా తిరిగి వచ్చిన తరువాత వారి పిల్లల వయసుకు తగ్గ క్లాసులో చేర్చుకోవాలి. వారికి ప్రత్యేకంగా బోధించి ఇతర రెగ్యులర్‌ పిల్లల స్థాయికి చేర్చాలి. ఇటువంటి అవకాశం 'నూతన విద్యా విధానం'లో లేనే లేదు.

                                                              ప్రైవేటుపై నియంత్రణ ఎత్తివేత

    ఇక నుండి పాఠశాల విద్యాశాఖ మొత్తం మీద ఒక విధానాన్ని రూపొందించి విద్యా వ్యవస్థ మెరుగుదలను పర్యవేక్షించడానికి పరిమితం అవుతుంది. ప్రైవేట్‌ స్కూళ్ళను నియంత్రించడంతో దానికి సంబంధం ఉండదు.
ప్రైవేటు, ప్రభుత్వ, ధార్మిక సంస్థల స్కూళ్ళు అన్ని స్థాయిల్లో తమంతట తామే నియంత్రణ చేసుకోవాలి. కొన్ని కనీస ప్రమాణాలు నిర్దేశించేందుకు రాష్ట్ర స్థాయిలో స్వతంత్ర స్టేట్‌ స్కూల్‌ స్టాండర్డ్‌ అధారిటీ ఏర్పడుతుంది.
పబ్లిక్‌, ప్రైవేటు, ధార్మిక సంస్థల పాఠశాలలకు గ్రేడింగ్‌ ఇస్తారు. స్టేట్‌ స్కూల్స్‌ స్టాండర్డ్స్‌ (ప్రమాణాలు) అధారిటీని ఏర్పాటు చేస్తారు. పబ్లిక్‌, ప్రైవేట్‌ స్కూళ్ళను సమాన స్థాయిలో చూస్తారు. పబ్లిక్‌ పాఠశాలలు ప్రభుత్వ నిరాదరణకు గురవుతాయి.
అభివృద్ధి చెందిన దేశాల్లో ఇప్పటికీ ప్రభుత్వమే పూర్తిగా 1 నుండి 12వ తరగతి వరకు ఉచిత, నాణ్యమైన విద్యను అందిస్తుంది. 5 సంవత్సరాల్లోపు విద్యను అందించాలనే ప్రయత్నం అక్కడ జరగదు. కిండర్‌ గార్టెన్‌ క్లాస్‌ కూడా 5 సంవత్సరాలు పూర్తయిన తరువాతనే. పాఠశాల భవనాలు, ఆట స్థలాలు విశ్వవిద్యాలయాల స్థాయిని తలపిస్తాయి. అన్ని రకాల స్కూళ్లు దగ్గరలో అందుబాటులో ఉంటాయి.
కానీ మన దేశం అభివృద్ధి చెందకుండానే విద్యా బాధ్యత నుండి ప్రభుత్వం తప్పుకుంటోంది. నూతన విద్యా విధానం వలన పాఠశాల విద్య కూడా ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణకు దారితీస్తుంది. పేదలు, వెనుకబడిన సామాజిక తరగతులు భారీ స్థాయిలో నష్టపోతాయి.
 

                                                                      ఉన్నత విద్య

   కాలేజీలన్నీ దాదాపుగా అటానమస్‌ (స్వయంప్రతిపత్తి)గా మారతాయి. అటానమస్‌ కాలేని కాలేజీలు మూత పడతాయి. కాలేజీల సంఖ్య బాగా తగ్గి అందుబాటులో లేకుండా పోతాయి. ఫీజుల భారం సామాన్య ప్రజలు భరించలేరు.
యూనివర్సిటీలు రాష్ట్ర ప్రభుత్వాల చేతిలో ఉన్నవి పూర్తిగా కేంద్ర ప్రభుత్వం చేతిలోకి పోతాయి. ఉన్నత విద్య మొత్తానికి కలిపి ఒకే నియంత్రణా సంస్థ జాతీయ స్థాయిలో ఏర్పడుతుంది. యూనివర్సిటీలు అన్నీ పునర్‌ వ్యవస్థీకరణ, ఏకీకృతాలకు గురై మెగా యూనివర్సిటీలుగా రూపాంతరం చెందుతాయి. యూనివర్సిటీల పాలన స్వతంత్ర బోర్డుల చేతిల్లోకి పోతుంది.
అటానమస్‌ డిగ్రీ కాలేజీలు డిగ్రీలు ప్రదానం చేస్తాయి. ఎపుడు కావాలంటే అపుడు కాలేజీ మానుకోవచ్చు. డిగ్రీ మొదటి సంవత్సరం పూర్తి చేస్తే ఒక సర్టిఫికెట్‌, రెండో సంవత్సరం పూర్తి చేసిన వారికి డిప్లమా, మూడు సంవత్సరాలు పూర్తి చేస్తే డిగ్రీ ఇస్తారు. సామాజికంగా,
ఆర్థికంగా వెనుకబడిన వారు కాలేజీల నుండి నిష్క్రమించే అవకాశం కల్పించారు. 'నూతన విద్యా విధానం'లో రిజర్వేషన్ల ప్రస్తావన ఎక్కడా లేదు.
వంద విదేశీ యూనివర్సిటీలు భారత దేశంలో స్థాపించుకునే అవకాశం కల్పించారు. ఉన్నత విద్య మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం నియంత్రిస్తుంది. భారత ఉన్నత విద్యా కమిషన్‌ను ఏర్పాటు చేస్తారు. దీని కింద నాలుగు నియంత్రణా సంస్థలు ఏర్పాటవుతాయి. 1) జాతీయ ఉన్నత విద్య నియంత్రణ కౌన్సిల్‌, 2) గుర్తింపు (అక్రెడిటేషన్‌) ఇచ్చే జాతీయ కౌన్సిల్‌, 3) ఉన్నత విద్య గ్రాంట్స్‌ కౌన్సిల్‌, 4) సాధారణ విద్యా కౌన్సిల్‌. ఉన్నత విద్యా సంస్థలలో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం వస్తుంది. స్వతంత్ర సంస్థలుగా ఉన్నత విద్యా సంస్థలను తీర్చిదిద్దడమే లక్ష్యం.
అంగన్‌వాడీ సెంటర్లను ప్రాథమిక పాఠశాలల్లోకి, 3, 4, 5 తరగతులను హైస్కూల్లోకి, 9, 10 తరగతులను ఇంటర్‌ మీడియట్‌తో కలపటంతో...పేదలకు, సామాన్య ప్రజలకు ప్రాథమిక విద్య, హైస్కూలు విద్య అందుబాటులో లేకుండా పోతుంది.
రాష్ట్రంలో ఇంగ్లీషు మీడియం వలన స్కూలు డ్రాపవుట్లు పెరుగుతాయి. స్కూళ్లు దూరమవడంతో కూడా డ్రాపవుట్లు పెరుగుతాయి. 3, 5, 8 తరగతులకు జాతీయ పరీక్షలు నిర్వహించడం, డిగ్రీ చదివేప్పుడు ప్రతి సంవత్సరం చదువు మానేయడానికి అవకాశం కల్పించటం తదితర అంశాలన్నీ ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన తరగతులను విద్య నుండి బయటకు పంపడానికే.
'నూతన విద్యా విధానం' 2030-2040 సంవత్సరాల మధ్యలో పూర్తిగా అమలవుతుంది. స్కూలు కాంప్లెక్స్‌లలో అంగన్‌వాడీ విద్య నుండి 12వ తరగతి వరకు బి.ఇడి. నాలుగు సంవత్సరాల కోర్సు చేసిన ఉపాధ్యాయులే బోధిస్తారు. ఎస్‌.జి.టి లు, అంగన్‌వాడీ టీచర్లు ఉపాధి కోల్పోతారు.
ప్రాథమిక స్థాయి నుండి ఉన్నత స్థాయి విద్య వరకు వృత్తి విద్యను ప్రవేశపెట్టడం...చదువు కొనలేని వారికి వృత్తి విద్యను నేర్పించి బయటకు పంపడానికే. స్కూళ్ళు, కాలేజీలు, యూనివర్సిటీలు యావత్తు స్వయం ప్రతిపత్తిని పొంది ఆర్థికంగా, సామాజికంగా ప్రతికూల పరిస్థితుల్లో ఉన్న విద్యార్థులను బయటకు గెంటేస్తాయి.
ప్రభుత్వ, ప్రైవేట్‌ భాగస్వామ్యంతో విద్యా సంస్థలు నడుస్తాయి. డబ్బున్నవాళ్లేే చదువును కొనసాగిస్తారు. విద్యా సంస్థల పాలన స్వతంత్ర వ్యక్తుల పేరుతో ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి పోతుంది. 'నూతన విద్యా విధానం' విద్య ప్రైవేటీకరణ, వాణిజ్యీకరణ, కార్పొరేటీకరణలను పూర్తి చేస్తుంది.
అందరికీ విద్యను అందించే బాధ్యత నుండి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తప్పుకుంటున్నాయి. జిడిపి లో 6 శాతాన్ని విద్యకు ఖర్చు పెట్టాలని 1966 లోనే కొఠారి కమిషన్‌ సిఫార్సు చేసింది. అప్పటి నుండి ఇప్పటి వరకు అవి అమలు కాలేదు. నేటికీ జిడిపి లో 3.5 శాతాన్నే విద్యకు ప్రభుత్వాలు ఖర్చు పెడుతున్నాయి.
'నూతన విద్యా విధానం' అనేది అంగన్‌వాడీలు లేదా స్కూలు టీచర్ల సమస్య మాత్రమే కాదు. ఇది సమాజం మొత్తానికి సంబంధించినది. దేశంలో విద్య, వైద్యం ప్రభుత్వం చేతుల్లో లేకపోతే భారత సమాజం అభివృద్ధి కాదు. మానవాభివృద్ధి సూచికల్లో వెనుకబాటు ఇంకా కొనసాగుతుంది.
కార్మికవర్గంతో సహా నూతన విద్యా విధానం వలన నష్టపోయే వర్గాలన్నీ ఐక్యంగా పోరాడి 'నూతన విద్యా విధానాని'్న తిప్పి కొట్టాలి. ప్రజానుకూల విధానం కోసం నిబద్ధతతో పోరాడాలి.
2015 సంవత్సరానికి చేరుకోవాల్సిన సహస్రాబ్ది అభివృద్ధి లక్ష్యాలను చేరుకోలేదు. మరలా ఇపుడు 2015 నుండి మొదలు పెట్టి 2030 నాటికి 17 నికర అభివృద్ధి లక్ష్యాలను పెట్టారు. దానిలో నాణ్యమైన విద్య ఒక లక్ష్యం.
'నూతన విద్యా విధానం' వలన నాణ్యమైన విద్య పేదలకు అందుబాటులో ఉండదు. అది ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందిన తరగతులకే అందుతుంది. ఇది పాలకవర్గాల లక్ష్యం. దాన్ని అన్ని తరగతులకు అందుబాటులోకి వచ్చేలా మార్పుల కోసం ఐక్యంగా పోరాడాలి. 2009 విద్యాహక్కు చట్టాన్ని తు.చ. తప్పకుండా అమలు జరపాలని పోరాడాలి.
 

/ వ్యాసకర్త సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు /
పి. అజయ కుమార్‌

పి. అజయ కుమార్‌