ప్రజాశక్తి-అనకాపల్లి
నాణ్యమైన విద్యకు పేద విద్యార్థులు దూరంగా ఉన్నారని, నాణ్యమైన విద్య అందించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్‌ఎఫ్‌ఐ) రాష్ట్ర నాయకులు సిహెచ్.పావని విమర్శించారు. స్థానిక దొడ్డి రామునాయుడు కార్మిక కర్షక నిలయంలో మంగళవారం ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా మహాసభ ప్రారంభమైంది. ముందుగా ఎస్‌ఎఫ్‌ఐ పతాకాన్ని ఆవిష్కరణ చేసి, భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పావని మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విద్యా విధానం పేదలకు విద్యను మరింత దూరం చేసేదిగా ఉందని తెలిపారు. దీనిని రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం అత్యుత్సాహంతో అమలుకు పూనుకోవడం దారుణమన్నారు. మహిళలు, విద్యార్థినులపై రోజు రోజుకు దాడులు పెరుగుతున్నాయని, వారికి రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అనకాపల్లిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని, జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు తమ తమ విద్యా సంస్థల్లో ఉన్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి పిలుపునిచ్చారు. ఎస్‌ఎఫ్‌ఐ మాజీ నాయకులు శంకర్ మాట్లాడుతూ విద్యార్థులు చదువుకునే పరిస్థితులు పోయి చదువును కొనుక్కునే పరిస్థితి ఏర్పడిందన్నారు. విశ్వవిద్యాలయాలు కళాశాలల్లో కామర్స్, చరిత్ర గ్రూపులను తొలగించడం అన్యాయమన్నారు. సభలో ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర నాయకులు నాయుడు, మామిడి రమణ, జిల్లా అధ్యక్షులు ఎస్ రమణ, డివిజన్ కార్యదర్శి గొర్లి తరుణ్, పావని, గీతాకృష్ణ, మౌనిక, సాయి ధనుష్, బాలాజీ, బాబ్జి, జిల్లావ్యాప్తంగా 150 మంది విద్యార్థులు పాల్గొన్నారు.










