ప్రజాశక్తి - దెందులూరు
పేదలందరికి కార్పొరేట్ స్థాయిలో ఉచితంగా వైద్యం అందించాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎ.రవి డిమాండ్ చేశారు. మండలంలోని దోసపాడు గ్రామంలో వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆదివారం మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరాన్ని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఆర్‌ఎంఒ డాక్టర్ పిఎఆర్‌ఎస్.శ్రీనివాసరావు ప్రారంభించారు. అంజనీ దశరథ్ ఆసుపత్రి వైద్యులు ఈడ్పుగంటి ఠాగూర్ ప్రసాద్ వైద్య సేవలు అందించారు. కంటి వైద్య టెక్నీషియన్ వేణుగోపాల్ కంటి పరీక్షలు నిర్వహించారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పి.రామకృష్ణ అధ్యక్షతన నిర్వహించిన ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎ.రవి మాట్లాడుతూ సంఘం ఆధ్వర్యంలో దోసపాడు గ్రామంలో పేదలు, దళితుల అసైన్డ్ భూముల కోసం పోరాటం నడుస్తుందన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం పోరాటాలే కాకుండా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందన్నారు. వైద్య రంగంలో కార్పొరేట్ సంస్థల ప్రవేశంతో పేదలకు వైద్యం అందని పరిస్థితి వచ్చిందన్నారు. ప్రభుత్వాలు పేదలకు వైద్యం అందించే ప్రభుత్వ వైద్యం అభివృద్ధి చేయకుండా, కార్పొరేట్ సంస్థలకు రాయితీలు ప్రోత్సాహకాలు ఇస్తున్నాయని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం కేరళ తరహాలో ప్రతి గ్రామంలో డాక్టర్‌తో కూడిన ప్రభుత్వ ఆసుపత్రులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. వైద్య శిబిరంలో రోగులకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు పి.కిషోర్, మెడికల్ సేల్స్ రిప్రజెంటేటివ్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి వివివిఎన్.ప్రసాద్, తిప్పాని లక్ష్మీకాంతం, మెమోరియల్ ట్రస్టు నిర్వాహకులు కె.రామాంజనేయులు, మెడికల్ సేల్స్ రిప్రజెంటేటివ్ యూనియన్ నాయకులు సిహెచ్.సీతయ్య, అంతోని, కార్తిక్, శ్రీనివాస్, సంఘం నాయకులు పి.ఆనందరావు, జాన్‌రాజు, సునీల్, పవన్ తేరేజమ్మ, లలిత, మాణిక్యం సహాయ సహకారాలు అందించగా స్థానిక పెద్దలు, మహిళలు పాల్గొన్నారు.










