
ప్రజాశక్తి - చిలమత్తూరు : పేదలకు ఇంటిస్థలాలు ఇవ్వకుంటే అక్కడే గుడిసెలు వేస్తామని సమస్య పరిష్కారం కాకపోతే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని సిపిఎం నాయకులు హెచ్చరించారు. సిపిఎం మండల కార్యదర్శి వెంకటేష్, అధ్యక్షులు లక్ష్మినారాయణ, పైపల్లి గంగాధర్ ఆధ్వర్యంలో పేదలు శుక్రవారం తహశీల్దార్ కార్యాలయం ముందు శాంతి యుతంగా నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ అర్హులైన పేదలందరికి ఇంటి స్థలాలు చూపి పట్టాలు ఇస్తామని జాయింట్ కలెక్టర్ తో చర్చలు జరిపి సమస్యను పరిష్కరిస్తామని తహశీల్దార్ ఇచ్చిన హామీ మేరకు తాము శాంతియుతంగా ఆందోళన చేస్తున్నామని అన్నారు. అయితే శనివారం జరిగే చర్చల్లో సమస్య పరిష్కారం కాకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పేదలు ఇళ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అధికారులకు పేదలంటే లెక్క లేదని కాబట్టే గుడిసెలు పీకేశారని విమర్శించారు. జాయింట్ కలెక్టర్ వద్ద చర్చల అనంతరం తమ వైఖరి ప్రకటిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం లో కమిటీ సభ్యులు శివ, రహంతుల్లా, చందు, రియాజ్, అబ్బాస్ తదితరులు పాల్గొన్నారు.