ప్రజాశక్తి -పెనుకొండ : పట్టణంలో ఇల్లు లేని పేదలకు ఇళ్లస్థలాలు ఇచ్చేంతవరకు పోరాటం కొనసాగిస్తామని వ్యవసాయకార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దన్న, జిల్లా సహాయ కార్యదర్శి గంగాధర్, సిఐటియు జిల్లా కార్యదర్శి రమేష్ పేర్కొన్నారు.శుక్రవారం పట్టణంలోని తహశీల్దార్ కార్యాలయం ముందు పేదలతో కలిసి ఉదయం నుండి మధ్యాహ్నం 4గంటల వరకు బైటాయించారు. పేదలు వేసుకున్న గుడిసెలు తొలగింపునకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా తహశీల్దార్ స్వర్ణలతను నిలదీశారు. ఇళ్ల స్థలాలు లేని పేదప్రజలు స్థలాల కోసం సచివాలయంలో అర్జీలు ఇచ్చి 95రోజులు పూర్తి అయిందని ఇంతవరకు పేదలకు పట్టాలు పంపిణీ చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్పటిలోగా పంపిణీ చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. స్పందించిన తహశీల్దార్ మాట్లాడుతూ అహుడా లేఅవుట్‌లో ప్రభుత్వ స్థలం లేదని,668సర్వే నంబర్ లో ప్రభుత్వ భూమి ఎంతవుందో సర్వే చేయిస్తామని తెలిపారు. సబ్ కలెక్టర్ తో మాట్లాడి పట్టణంలో ప్రభుత్వ స్థలాలను ఉంటే వాటిని సర్వే చేసి లే అవుట్ వేస్తామన్నారు. సచివాలయంలో నమోదు చేసుకున్న వారి జాబితా సబ్ కలెక్టర్ లాగిన్ లో ఉన్నాయని అక్కడి నుండి వచ్చిన వెంటనే పట్టాలు పంపిణీ చేస్తామని తెలిపారు. అయితే మహిళలు,ప్రజలు,నాయకులు తమకు పట్టాలు ఇచ్చేంతవరకు ప్రభుత్వ స్థలంలో గుడిసెలు వేసుకుని అక్కడే ఉంటామని తెగేసి చెప్పి వెళ్లిపోయారు. తిరిగి మడకశిర రోడ్డులోని అహుడా లే అవుట్ ప్రక్కన గుడిసెలు వేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పెనుకొండ సిఐ కరుణాకర్, ఎస్‌ఐ రమేష్ బాబు ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు వెంకటరాముడు, నారాయణ, తిప్పన్న, నరసింహ, సిఐటియు మండల కార్యదర్శి బాబావలి, కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు హనుమయ్య, వెంకటేష్, రంగప్ప, తిప్పన్న, కొండ వెంకటేష్, మహిళలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.










