పెనుకొండ : పెనుకొండలో నిరుపేదలందరికీ ఇళ్ల పట్టాలు ఇచ్చేంత వరకు ఆందోళన విరమించే ప్రశక్తే లేదని సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం.ఇంతియాజ్ స్పష్టం చేశారు. పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గురువారం పట్టణంలోని సబ్‌కలెక్టర్ కార్యాలయం ఎదుట వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో రిలేనిరాహార దీక్షలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఇంతియాజ్ మాట్లాడుతూ పెనుకొండ నగర పంచాయతీ పరిధిలో సొంత ఇళ్లు లేని పేదలు వ్యవసాయ కార్మిక సంఘం, సిఐటియు, సిపిఎం ఆధ్వర్యంలో భూస్వాధీనం పోరాటం చేశారన్నారు. ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసుకుని అందులో పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారని తెలిపారు. అధికారులు పేదల సమస్యలను పట్టించుకోకుండా వారు వేసుకున్న గుడిసెలను తొలగించడం దుర్మార్గమైన చర్య అన్నారు. పేదలకు సొంత ఇళ్లు లేక, అద్దె ఇళ్లకు బాడుగలు కట్టలేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇళ్ల స్థలాలు ఇవ్వాలని పేదలు తహశీల్దార్, కమిషనర్, సబ్ కలెక్టర్, కలెక్టర్, సచివాలయాల్లో పలుమార్లు అర్జీలు ఇచ్చారన్నారు. అయినా అధికారుల నుంచి ఎలాంటి స్పందనా లేదన్నారు. అర్జీలు పెట్టుకున్న 90 రోజుల్లోపు ఇళ్ల పట్టాలు ఇస్తామన్న ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి హామీ ఏమైందని ప్రశ్నించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పేదలకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించేంత వరకు ఆందోళనలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. రైతుసంఘం జిల్లా ఉపాధ్యక్షులు హరి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నవరత్నాల్లో భాగంగా పేదలకు ఇళ్లు కట్టించి ఇస్తామన్న హామీ అమలుకు నోచుకోలేదన్నారు. పెనుకొండలో పేదలు ఇళ్ల స్థలాల కోసం ఎమ్మెల్యే శంకరనారాయణను కలిసి విన్నవించినా ఫలితం లేదన్నారు. రెవెన్యూ అధికారులు కూడా నిర్లక్ష్యంగా వహిస్తున్నారని చెప్పారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దన్న మాట్లాడుతూ పేదలకు న్యాయం జరిగేంతవరకు పోరాడుతామన్నారు. అధికారులు స్పందించకుంటే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఫిరంగి ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ సొంత ఇళ్లు లేని పేదలు ప్రభుత్వ స్థలంలో గుడిసెలు వేసుకుంటే వాటిని తొలగించడం అన్యాయమన్నారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యకాసం జిల్లా సహాయ కార్యదర్శి గంగాధర్ జిల్లా కమిటీ సభ్యులు వెంకటరాముడు, నారాయణ, తిప్పన్న, సదాశివ పేదలు పాల్గొన్నారు.










