ప్రజాశక్తి-పెందుర్తి : అర్బన్ హౌసింగ్ స్కీమ్ కింద పెందుర్తి నియోజకవర్గం నగర పరిధిలోని పేదలకు ఇంటి పట్టాలను స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో గురువారం ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్‌రాజు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలోని పేదలందరికీ పక్కా ఇల్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్మోహన్‌రెడ్డి చేపట్టిన పాదయాత్రలో ప్రజల కష్టాలను తెలుసుకుని అన్ని వర్గాల వారికి సొంతగూడు కల్పించాలనే సంకల్పంతో 33 లక్షల మందికి పట్టాల పంపిణీ కార్యక్రమం చేపట్టారని తెలిపారు. నగర పరిధిలో లక్షా 30వేల మందికి ఇంటి పట్టాలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. రైతుల అనుభవంలోని భూములను సేకరించినందుకు గాను వారికి 900 గజాల స్థలాలను కేటాయించినట్లు తెలిపారు. అయితే కొంత మంది రాజకీయ స్వార్థంతో కోర్టులో కేసు వేసి పేదలకు అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కోర్టులో కేసులను పరిష్కరించి మిగిలిన వారికి కూడా ఇంటి పట్టాలు అందిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి నాగమణి, వైస్ ఎంపిపి దేవుడుబాబు, జెడ్‌పిటిసి సభ్యులు ఉప్పిలి దేవి, జోనల్ కమిషనర్ మల్లయ్య నాయుడు, తహసీల్దార్ ఆనంద్ కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు.










