ప్రజాశక్తి-పిడుగురాళ్ల : కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్), వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈనెల 27వ తేదీ ఉదయం 10 గంటలకు గురజాల ఎంపిడిఒ కార్యాలయం వద్ద జరగనున్న నియోజకవర్గ స్థాయి భూసదస్సు జయప్రదం చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం పల్నాడు జిల్లా కార్యదర్శి ఎలక్ష్మీశ్వరరెడ్డి, సిఐటియు మండల కార్యదర్శి టి.శ్రీనివాసరావు కోరారు. ఈ మేరకు మండలంలోని జానపాడు, తుమ్మలచెరువు, పిడుగురాళ్ల, బ్రాహ్మణపల్లి, శ్రీనివాసనగర్ తదితర గ్రామాల్లో సోమవారం బైక్ యాత్ర ద్వారా ప్రచారం చేశారు. లక్ష్మీశ్వరరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు పేదలకు భూములు పంచుమంటూనే మరోవైపు పేదల నుంచి గుంజుకున్న భూములను భూస్వాములకు రెగ్యులరైజ్ చేయడానికి వీలుగా చట్ట సవరణ చేస్తోందని విమర్శించారు. అసైన్మెంట్ భూములను అమ్మరాదు, కొనరాదు అని 9/77 పిఒపి చట్టం చెబుతున్నా ఆ చట్టాన్ని ఉల్లంఘించి అసైన్మెంట్ చేసిన భూములను 20 ఏళ్లు దాటితే సర్వహక్కులు ఇస్తున్నామనే పేరుతో అమ్ముకోటానికి అవకాశం కల్పిస్తోందని చెప్పారు. ఈ నిర్ణయం వల్ల ఇప్పటికే రాష్ట్రంలో 58 లక్షల ఎకరాల అసైన్మెంట్ భూముల్లో దాదాపు 26 లక్షల ఎకరాలు అన్యాక్రాంతం అయ్యాయని, వాటన్నింటినీ రెగ్యులరైజ్ చేసుకోవడానికి ఈ చట్ట సవరణ అవకాశం ఇస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ చట్ట సవరణను వ్యవసాయ కార్మిక సంఘం తీవ్రంగా వ్యతిరేకిస్తోందన్నారు. ఒకవేళ అమ్ముకో వడానికి అవకాశం కల్పిస్తే ప్రభుత్వమే కొనుగోలు చేసి ఈ భూములను మళ్లీ భూమిలేని పేదలకు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. గురజాల నియోజక వర్గంలో పేదలకు భూములు పంపిణీ చేయడానికి రకరకాల భూములు న్నాయని, వాటిని గుర్తించి పేదలకు పంపిణీ చేయాలని కోరడం కోసమే సదస్సు నిర్వహిస్తున్నామని చెప్పారు.










