Jan 27,2023 22:15

వ్య.కా.స
ప్రజాశక్తి - టి.నర్సాపురం

                 అర్హులైన పేదలందరికీ భూమి పంచాలని, కూలీలకు కూలి పెంచాలని ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పిల్లి రామకృష్ణ డిమాండ్‌ చేశారు. మండలంలోని మల్లప్పగూడెంలో సంఘం మండల కమిటీ, ముఖ్యకార్యకర్తల సమావేశం మండల కార్యదర్శి మడకం సుధారాణి అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథి రామకృష్ణ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక, గిరిజన, రైతుసంఘాల ఆధ్వర్యంలో ఫిబ్రవరి 8న ఉదయం 10 గంటలకు మండలంలోని రామన్నపాలెం గ్రామంలో ఎర్ర కాలువ మిగులు భూముల్లోని పామాయిల్‌ తోటలో జిల్లా సదస్సు జరుగుతుందన్నారు. జిల్లావ్యాప్తంగా ఉన్న ఆదివాసులు, దళితులు, భూమిలో సాగులో ఉన్న పేదలు భూమి కోసం పోరాటాలు చేస్తున్న వారు జిల్లా సదస్సులో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. జంగారెడ్డిగూడెం, టి.నర్సాపురం మండలాల్లోని సుమారు 1500 ఎకరాలు ఎర్ర కాలువ రిజర్వాయర్‌ మిగులు భూములను పేదల సాగుకు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఆదివాసుల హక్కులు కాపాడి పోడు భూములకు పట్టాలివ్వాలని, దోసపాడు ఇతర చోట్ల అసైన్‌మెంట్‌ భూములను దళితులకు పొజిషన్‌ కల్పించి పట్టాలివ్వాలని, విఎస్‌ఎస్‌ పంటలకు కటింగ్‌ ఆర్డర్లు ఇవ్వాలని కోరారు. వ్యవసాయ కూలీలకు కూలి పెంచాలన్నారు. ఉపాధి కూలీలకు పని కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి తుమ్మల సత్యనారాయణ, అనుమోలు మురళి, పుసం చిన్న సూర్యరావు, సరియం దుర్గమ్మ పాల్గొన్నారు.