పేదలకు ఆరోగ్యశ్రీ పథకం ఒక వరం
- ఎమ్మెల్యే కాటసాని
ప్రజాశక్తి బనగానపల్లె
ఆరోగ్య శ్రీ పథకం పేద ప్రజలకు వరంలాంటిదని ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి పేర్కొన్నారు. సోమవారం పట్టణంలోని ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి నివాసంలో 17వ విడత ముఖ్యమంత్రి సహాయనిధి పథకం ద్వారా 13 మంది లబ్ధిదారులకు 16 లక్షల 15 వేల రూపాయల చెక్కులను ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 3,224 జబ్బులను ఆరోగ్యశ్రీ పరిధిలోకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకురావడం జరిగిందన్నారు. గతంలో ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లాలంటేనే పేదల గుండెలు పగిలిపోయేటివని కానీ ఇప్పుడు ఆరోగ్యశ్రీ పథకం ద్వారా కార్పొరేట్ ఆసుపత్రుల్లో సైతం పేదవారు వైద్య చికిత్స తీసుకోవడం జరుగుతుందని తెలిపారు . కొంతమంది ప్రజలు వారు వెళ్లిన ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ పథకం లేదని డబ్బులు పెట్టి జబ్బులు నయం చేసుకోవడం జరుగుతుందని, రోగికి వచ్చిన రోగాన్ని బట్టి ఆరోగ్య శ్రీ పథకం ఉన్నటువంటి ఆసుపత్రికి వెళితే ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పేదవానికి ఉచితంగా వైద్య చికిత్స అందించడం జరుగుతుందని తెలిపారు. ఇప్పటివరకు సీఎం సహాయక నిధి కింద నియోజకవర్గంలో 17 విడతలలో 872 మంది లబ్ధిదారులకు 4 కోట్ల 90 లక్షల 41,500 వేల రూపాయలు చెక్కులు రూపంలో పేదలకు అందించడం జరిగిందని తెలిపారు. గత ప్రభుత్వ పాలనలో వైయస్సార్ ఆరోగ్యశ్రీ పథకానికి తూట్లు పొడవడం జరిగిందని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన తండ్రి వైయస్సార్ తీసుకువచ్చిన ఆరోగ్యశ్రీ పథకం సజీవంగా ఉంచాలనే లక్ష్యంతో వైద్య రంగానికి పెద్దపీట వేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసిపి అవుకు మండల కన్వీనర్ కాటసాని తిరుపాల్ రెడ్డి, జిల్లా ప్రచార కార్యదర్శి సిద్ధం రెడ్డి రామ్మోహన్ రెడ్డి, నాయకులు బండి బ్రహ్మానందరెడ్డి, ఎర్రగుడి రామసుబ్బారెడ్డి,కంపమళ్ల లోకేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.










