
ప్రజాశక్తి - భీమవరం
జగనన్న ఆరోగ్య సురక్ష నిరుపేద కుటుంబాలకు ఒక వరమని, ప్రతి కుటుంబమూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి అన్నారు. శనివారం భీమవరం మున్సిపల్ పరిధిలో జరుగుతున్న జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ఆమె పరిశీలించారు. శిబిరం వద్ద ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్, ఒపి రిజిష్ట్రేషన్, స్పాట్ రిజిష్ట్రేషన్, ఐటి రూమ్, వైద్యుల కేటాయింపు, ల్యాబ్, వైఎస్‌ఆర్ ఆరోగ్యశ్రీ సహాయ కేంద్రం, వైద్యుల గదులు, మందులిచ్చే కౌంటర్, న్యూట్రిషన్ స్టాల్, కంటి పరీక్షా కేంద్రాలను కలెక్టర్ సందర్శించి రోగులతో మాట్లాడారు. అనంతరం ఆమె మాట్లాడుతూ జిల్లాలో అన్ని సచివాలయాల పరిధిలో శిబిరాలను నిర్వహిస్తామన్నారు. ఆరోగ్య సురక్ష ద్వారా అందిస్తున్న స్పెషలిస్టుల సేవలను సైతం గ్రామాల్లోకి తెచ్చారని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రతి గ్రామంలో వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి, నిర్ణీత సమయం కేటాయించి, వారికి వైద్యం అందిస్తామన్నారు. ఇసిజితో సహా మొత్తం 14 రకాల పరీక్షలు చేసి, 105 రకాల మందులు ఉచితంగా అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పురపాలక సంఘం కమిషనర్ ఎం.శ్యామల, డిఎంహెచ్‌ఒ డి.మహేశ్వర రావు, జిల్లా పంచాయతీ శాఖ అధికారి జివికె మల్లికార్జునరావు, అదనపు డిఎంహెచ్‌ఒ బి.భానునాయక్ పాల్గొన్నారు.
తాడేపల్లిగూడెం:ప్రజల ఆరోగ్యమే జగనన్న లక్ష్యమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవాదాయ, ధర్మాదాయ శాఖా మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. పట్టణంలోని రెండో వార్డు వీకర్స్ కాలనీలో జగనన్న ఆరోగ్య సురక్ష మెగా మెడికల్ క్యాంపు శనివారం నిర్వహించారు. మంత్రి రాజమండ్రి జిఎస్‌ఎల్ ఆసుపత్రి యాజమాన్యంతో మాట్లాడి వైద్య శిబిరం నిర్వహణకు అవసరమైన రెండు భారీ మొబైల్ మెడికల్ యూనిట్లను ఇక్కడకు తెప్పించారు. అనంతరం వైద్య శిబిరంలో ఏర్పాటుచేసిన కౌంటర్లను సందర్శించారు. ఐసిడిఎస్ న్యూట్రిషన్ స్టాల్‌ను సందర్శించి మాట్లాడారు. ముఖ్యమంత్రి ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని రూపొందించారన్నారు. బిపి, షుగర్, హిమోగ్లోబిన్, మలేరియా, డెంగీ తదితర ఏడు పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తారని తెలిపారు. నెలవారి మందులు కూడా ప్రభుత్వమే ఉచితంగా ఇస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ అనపర్తి శామ్యూల్, స్టేట్ కోఆర్డినేటర్ విజయలక్ష్మి, ఆర్‌డిఒ కె.చెన్నయ్య, ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పగడాల సూర్యనారాయణ ప్రసంగించారు.