Jul 29,2023 21:15

గుమ్మలక్ష్మీపురం : టిడిపి మేనిఫేస్టోను ఆవిష్కరిస్తున్న టిడిపి నాయకులు జగదీశ్వరి, కార్యకర్తలు

ప్రజాశక్తి - గుమ్మలక్ష్మీపురం : ప్రతి కుటుంబాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో మహాశక్తి కార్యక్రమాన్ని తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు ప్రవేశపెట్టారని కురుపాం నియోజకవర్గం టిడిపి ఇన్‌ఛార్జి తోయక జగదీశ్వరి అన్నారు. మండలంలోని కుక్కిడి పంచాయతీ కుక్కిడి శివడ, నిగరం, పెద్దగూడ గ్రామాల్లో మహాశక్తి కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భవిష్యత్తుకు గ్యారంటీలో భాగంగా ప్రతి మహిళా ఆర్థికంగా అభివృద్ధి చెందాలని, 18ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1500, ప్రతి రైతుకు ఏడాదికి రూ.20వేలు చొప్పున అందివ్వాలని, డిగ్రీ చదువుకున్న ప్రతి నిరుద్యోగికి నెలకు రూ. 3,000 ఆర్థిక సాయం, ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంత మంది పిల్లలకు ఏడాదికి రూ.15వేలు ఇస్తామని, ప్రతి మహిళకు జిల్లాలో ఆర్టీసీ ప్రయాణం ఉచితమని, ప్రతి నిరుపేద కుటుంబానికి ఏడాదికి మూడు గ్యాస్‌ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చంద్రబాబు నాయుడు ఇచ్చిన మేనిఫెస్టోను ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో టిడిపి మండల ప్రధాన కార్యదర్శి పోలూరు శ్రీనివాసరావు, ఎస్టీ సెల్‌ కార్యదర్శి అడ్డాకుల నరేష్‌, క్లస్టర్‌ ఇన్‌ఛార్జ్‌ వెంకట్రావు, యూనిట్‌ ఇన్‌ఛార్జ్‌ నల్లా రవికుమార్‌, బూత్‌ ఇన్‌ఛార్జ్‌ రాము, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
సాలూరు : రానున్న ఎన్నికల్లో టిడిపి అధికారంలోకి వస్తే మహిళా సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని నియోజకవర్గ ఇన్చార్జి జి.సంధ్యారాణి చెప్పారు. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న మహాశక్తి చైతన్య రథం ర్యాలీలో భాగంగా పట్టణంలో ర్యాలీ చేపట్టారు. ఇన్‌ఛార్జి సంధ్యారాణితో పాటు మాజీ ఎమ్మెల్యే ఆర్పీ భంజ్‌ దేవ్‌ ఆధ్వర్యాన నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ టిడిపి ప్రకటించిన మేనిఫెస్టోతో ప్రతి పేదకుటుంబానికి ఏటా రూ.లక్షా 22వేల ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. 2024 ఎన్నికల్లో టిడిపి అధికారంలోకి రావడం ఖాయమని అభిప్రాయం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు నిమ్మాది తిరుపతిరావు, పట్టణ నాయకులు గొర్లి మధుసూదనరావు, కౌన్సిలర్లు బందాపు సత్యవతి, కె.వరలక్ష్మీ, మాజీ కౌన్సిలర్‌ డి.కష్ణ పాల్గొన్నారు.