Apr 28,2023 19:44

పథకాలను వివరిస్తున్న ప్రదీప్‌రెడ్డి

ప్రజాశక్తి మంత్రాలయం
నియోజకవర్గ ప్రజలకు అండగా, ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డికి తోడుగా రాంపురం రెడ్డి సోదరుల సేవలు అందిస్తూ ముందుకు సాగుతున్నారు. ఒకరికి రూ.10 వేల ఆర్థిక సహాయం, మరొకరి చదువుకు అయ్యే ఖర్చు భరించే భరోసా ఇచ్చి మానవత్వం చాటుకున్నారు. ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి ఆదేశాల మేరకు వైసిపి యువనేత వై.ప్రదీప్‌ రెడ్డి మండలంలోని చిలకలడోన గ్రామంలో శుక్రవారం రెండో రోజు 'గడపగడపకు మన ప్రభుత్వం' నిర్వహించారు. గడపగడపకు వెళ్లి సంక్షేమ పథకాల అమలు తీరు గురించి లబ్ధిదారులతో అడిగి తెలుసుకున్నారు. అదే గ్రామానికి చెందిన మహానంది గత కొన్ని నెలల క్రితం గుంటూరు జిల్లా వినుకొండ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి ఇంటి వద్దే ఉంటున్నారు. ఆరా తీసిన యువ నేత బాధితుని గోడు విని వెంటనే తక్షణ సహాయం కింద రూ.10 వేల నగదు అందజేసి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మరో చోట కర్రె లక్ష్మన్న అనారోగ్యంతో మృతి చెందగా ప్రభుత్వం నుంచి ఎలాంటి పరిహారమూ రాకపోవడంతో విషయాన్ని ఆయన భార్య శంకరమ్మ ప్రదీప్‌రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. స్పందించిన ఆయన వెంటనే కర్రె లక్ష్మన్న కుమారుడు హరికృష్ణ చదువుకు అయ్యే ఖర్చు భరిస్తామని హామీ ఇచ్చారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఉల్లిగడ్డల తిమ్మప్పను పరామర్శించారు. అవసరమైతే వైద్య ఖర్చులు చూసుకుంటామని ధైర్యం చెప్పారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను కోరారు. వైసిపి మండల అధ్యక్షులు జి.భీమిరెడ్డి, ఇన్‌ఛార్జీ విశ్వనాథ్‌ రెడ్డి, ఎస్‌ఐ వేణు గోపాల్‌ రాజ్‌, సొసైటీ ఛైర్మన్‌ వెంకట్‌ రెడ్డి పాల్గొన్నారు.