
పేదలకు అభివృద్ధికే సంక్షేమ పథకాలు
ప్రజాశక్తి-మర్రిపాడు : వైసిపి ప్రభుత్వం హయాంలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పేదల అభివృద్ధికి సంక్షేమ పథకాలను అందజేస్తున్నారని ఎంఎల్‌ఎ మేకపాటి విక్రమ్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం మర్రిపాడు మండలం భీమవరం సచివాలయం పరిధిలోని పొంగూరుకండ్రిక గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ మేరకు గ్రామంలో ప్రతీగడపకు వెళ్లి ముఖ్యమంత్రి అందజేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ప్రతి ఇంటికి వెళ్లి సంక్షేమ లబ్ధి కరపత్రాలను అందజేశారు. గ్రామస్తులు తెలిపిన పలు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ఎంఎల్‌ఎ విక్రమ్‌రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి పేద ప్రజలకు అభివృద్ధికి సంక్షేమ పథకాలను అందజేస్తున్నారన్నారు. ప్రతి సచివాలయం పరిధిలో అర్హులైన అందరికీ సంక్షేమ పథకాలను అందించారని తెలిపారు. చిన్నచిన్న కారణాలతో అనర్హులుగా ఉన్న వారిని సైతం జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా అర్హులను చేసి వారికి సంక్షేమ పథకాలను అందజేశారని పేర్కొన్నారు. ప్రధానంగా రైతు భరోసా అందజేయడంతో భూముల విషయమై రైతులంతా తమ రెవెన్యూ సమస్యలను పరిష్కరించేందకు వచ్చారని, దాంతో జిల్లా కలెక్టర్‌ను కలిసి రెవెన్యూ సమస్యల పరిష్కారంపై దృష్టి సారించామన్నారు. ఇప్పటికే 30వేల నోషనల్ ఖాతాలు, 8వేల సాదా బైనామా కేసులు, 23వేల ఎకరాల చుక్కల భూములు సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లు వివరించారు. ప్రతి సచివాలయం పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా రూ.20లక్షలు నిధులు మంజూరయ్యాయని, అదనంగా మరో రూ.20లక్షలు నిధులు మంజూరుకు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లామని వివరించారు. అంతేకాక అభివృద్ధి పనుల్లో భాగంగా గ్రామంలో అవసరమైన సిసిరోడ్లు, సైడ్ డ్రైయిన్లు లాంటి పనులు ముమ్మరంగా సాగుతున్నాయని, మిగిలిన పనులను కూడా పూర్తి చేస్తామని వివరించారు. డిసెంబర్ 9వ తేదీన నిర్వహించే వ్యవసాయ సమీక్షలో వ్యవసాయరంగంలో నిష్ణాతులైన వారిని పిలిపించి రైతులకు అవసరమైన సలహాలు, సూచనలు అందజేసే విధంగా చర్యలు తీసుకోనున్నామని వివరించారు. ఇలాంటి వ్యవసాయ సమీక్షలు ప్రతి సంవత్సరం నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలిపారు. ప్రతి సంవత్సరం వ్యవసాయ సమీక్షల ద్వారా వారు అందచేసిన సలహాలు, అభివృద్ధి గురించి తెలుసుకునేందుకు వీలు కలుగుతుందన్నారు. ఆత్మకూరు నియోజకవర్గంలో 90శాతం రైతులు ఉన్నందున ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గ్రామంలో వికలాంగురాలైన కోటగిరి ఆదిలక్ష్మికి స్థానిక వైసిపి నాయకులు మేకపాటి వెంగయ్య రూ.5వేలు ఆర్థికసాయం అందజేశారు. కార్యక్రమంలో వైసిపి కన్వీనర్ సుబ్బిరెడ్డి, మాజీ కన్వీనర్ శ్రీనివాసులు నాయుడు, స్థానిక సర్పంచ్ గుర్రం మాధవి, తిరుపాలు, చెన్న కృష్ణయ్య, వైసిపి జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ చెవుల శ్రీనివాసులు యాదవ్, నాయకులు మాదాల సుబ్బారావు, నాగేశ్వరరావు, మేకపాటి వెంకయ్య, కల్లూరి జనార్ధన్, సిహెచ్ రామకృష్ణారెడ్డి, సర్పంచులు హరిబాబు, రామ్మోహన్, ఉర్లగంటి శ్రీనివాసులురెడ్డి, బేరి రామ్మోహన్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.