విశాఖ నగరంలోను, దాని చుట్టూ అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుంటున్నామంటూ సర్కారువారు ప్రతి వారం కూల్చివేతలు, బోర్డులు పాతడంతో రాష్ట్రమంతటా చర్చ సాగుతోంది. విశాఖ జిల్లాలో లక్షా 50 వేల ఎకరాల భూములకు సంబంధించి ల్యాండ్ ట్యాంపరింగ్ జరిగిందని అప్పటి జిల్లా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ ప్రకటించారు. టిడిపి ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) నియమించి ఒక తంతు నడిపించగా వైసిపి సర్కారు 'సిట్'ను నియమించినా నివేదికను ఇప్పటికీ బహిరంగ పర్చలేదు. అప్పటి ప్రతిపక్ష పార్టీ నాయకులు, అనుయాయులు కబ్జా చేశారని గత ప్రభుత్వం చెప్పగా ఈ సర్కారు ఇప్పటి విపక్ష పార్టీ నేతల భూములు, ఆస్తులపైనే కేంద్రీకరిస్తోంది. కాబట్టి అధికారంలో ఉన్న పార్టీ అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములను ప్రజల పరం చేయడం కన్నా అధికారాన్ని ఉపయోగించి రాజకీయ ప్రత్యర్థులను దెబ్బ తీయడంపైనే దృష్టి పెడుతున్నట్టు ప్రజలు భావిస్తున్నారు. విశాఖ నగరం, దానికి చుట్టూ ఉన్న 11 మండలాల పరిధిలో భూములు కబ్జాకు గురయ్యాయన్నది వాస్తవం. వాటిలో ఇనాం, భూదాన భూములు, సముద్ర తీరం, కొండ, గెడ్డ పోరంబోకులు, ఫారెస్టు భూములే ఎక్కువ. వీటిని గతంలో, ఇప్పుడు అధికారంలో ఉన్న నాయకులు, వారి అనుయాయులు, కొందరు ఉన్నతాధికార్లు కబ్జా చేసిన మాట నిజం. అందుకని, కబ్జాదారులందరిపైనా చర్యలు తీసుకొనే ధైర్యం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా? అన్న సందేహం పలువురికి కలుగుతోంది. ప్రభుత్వ పెద్దలు చెబుతున్నట్టు నిజాయితీగా భూ కబ్జాలను వెలికితీసి దోషులపై క్రిమినల్ చర్యలు తీసుకుంటే ప్రజలు హర్షిస్తారు. లేకపోతే ప్రత్యర్థులను లొంగదీసుకోవడానికి, లేదా దెబ్బ తీయడానికి దీన్ని ఆయుధంగా వాడుకుంటున్నారని అర్ధం చేసుకుంటారు.
కబ్జాదారుల నుండి స్వాధీనం చేసుకున్న భూములకు, ఇప్పటికే ఖాళీగా వున్న ప్రభుత్వ భూములకు యజమానులు ప్రజలే. నిజమైన హక్కుదార్లయిన నిరుపేదలకు నివాసాలు ఏర్పరచడానికి ఆ భూములను కేటాయించడం ప్రభుత్వ బాధ్యత. విశాఖపట్నాన్ని రాష్ట్ర పాలనా రాజధాని చేస్తామంటున్నారు. అలా జరిగినా లేకున్నా రాష్ట్రంలో జనాభా రీత్యా, పారిశ్రామికంగా, ఆర్థికంగా అదే ప్రధాన నగరం. అలాంటి చోట ఆసుపత్రులు, విద్యాసంస్థలు, ఇతర ప్రభుత్వ కార్యాలయాలకూ భూములు చాలా అవసరం. ఒకసారి అవి సర్కారు చేజారితే ప్రజోపయోగ కార్యక్రమాలను సైతం భూమి లేదన్న కారణంతో చేపట్టలేని దురవస్థ ఏర్పడవచ్చు. అలాగే ప్రజా జీవనం సాఫీగా సాగాలంటే వివిధ సేవలందించే పేదలు, అసంఘటిత కార్మికులకు నగరం లోపలే గృహ వసతి కల్పించాలి. అలా కాకుండా సుదూర ప్రాంతాల నుండి రావలసివస్తే పేదలకు ఆర్థిక భారం మాత్రమేగాక వారందించే సేవలకూ కొన్ని పరిమితులు ఏర్పడతాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈ దిశగా ఆలోచించకపోవడం విచారకరం. ఇప్పటికే నగరంలో ఖాళీగా వున్న ప్రభుత్వ భూముల్ని 'బిల్డ్ ఎ.పి', 'ఎ.పి స్టేట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్' పేరిట రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, సంపన్నులకు కట్టబెట్టే చర్యలకు పాల్పడడం దారుణం. గంగవరం పోర్టు సంయుక్త రంగంలో రూపొందింది. 1,800 ఎకరాల ప్రభుత్వ భూమిని తన వాటాగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. ఇప్పుడు ఆ పోర్టును అదానీ ఏకపక్షంగా హస్తగతం చేసుకుమటుంటే నోరెత్తకపోవడం దేనికి నిదర్శనం? ప్రభుత్వరంగం లోని హిందూస్తాన్ జింక్ కర్మాగారాన్ని వాజ్‌పేయి ప్రభుత్వం ప్రైవేటుకు అప్పగిస్తే ఇప్పుడా పరిశ్రమను ఎత్తేసి, రియల్ ఎస్టేట్‌గా మార్చారు. కార్పొరేట్ సంస్థల భూ కబ్జాలకు సహకరించడం చూస్తే ప్రభుత్వ సంపదను కాపాడే విషయంలో రాష్ట్ర సర్కారు నిజాయితీ ప్రశ్నార్ధకం అవుతున్నది.
ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచించి ప్రభుత్వ భూములను అమ్మడం, తనఖా పెట్టడం, లీజుకివ్వడం వంటి నిర్ణయాలను ఉపసంహరించుకోవాలి. భవిష్యత్తులో ప్రజావసరాల కోసం పదిలపర్చుకోవాలి. కొంత భూమిలో పేదలకు, అసంఘటిత కార్మికులకూ నగరంలో గృహ వసతి కల్పించాలి. అలా చేయకుండా మాది 'ప్రజా ప్రభుత్వం' అంటే జనం నమ్మరు సరికదా ఈ సర్కారు ప్రజాగ్రహానికి గురి కాక తప్పదు.










