నిబంధనలతో పనులు దూరం చేసేందుకు కుట్ర
రెండు పూటలా హాజరు విధానంతో తగ్గుతున్న కూలీల హాజరు
వేసవి అలవెన్సులు, ఇతర సౌకర్యాల నిలిపివేతతో అవస్థలు
బిజెపి తీరుపై ప్రజల ఆగ్రహం
ప్రజాశక్తి - భీమడోలు
ఉపాధి హామీ చట్టంలో కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న సరికొత్త విధానాలు, నిబంధనలు పేదల ఉపాధిని దెబ్బకొడుతున్నాయి. నిరుపేదలకు ఎంతో ఆసరాగా ఉన్న ఈ చట్టాన్ని బిజెపి నీరుగారుస్తోంది. వారిని ఉపాధి పనులకు దూరంచేస్తోంది. గత ఏడాది జిల్లాలో ఉపాధి హామీ పనుల కల్పనలో భీమడోలు మండలం ప్రథమస్థానంలో నిలిచింది. ఈ నేపథ్యంలో 4.27 లక్షల పనిదినాలకుగాను 4.84 లక్షల పని దినాలను పూర్తి చేసుకుంది. ఉపాధి హామీకి అనుబంధంగా ఉన్న వివిధ శాఖలతో పాటు ఉపాధి హామీ కార్యాలయం ద్వారా 1900 పనులు చేపట్టారు. గత సంవత్సరం రూ.10.97 కోట్ల విలువగల పనులు చేపట్టడమే లక్ష్యంకాగా రూ.12.43 కోట్ల విలువగల పనులు చేశారు. ఇదే క్రమంలో గత ఆర్థిక సంవత్సరం నిర్వహించిన సామాజిక తనిఖీల్లో భీమడోలు మండలం నుంచి ఏ విధమైన రికవరీ నమోదు కాకపోవడం విశేషం. గత సంవత్సరం వరకూ ఉపాధి హామీ పనుల్లో పాల్గొనే కూలీలకు ఫిబ్రవరిలో 20 శాతం, మార్చి, ఏప్రిల్ నెలలకు 25 శాతం, మే నెలకు 30 శాతం, జూన్ నెలలో 20 శాతం వంతున అలవెన్స్ ఆదనంగా చెల్లించేవారు. మజ్జిగ కోసం ఐదు రూపాయలు, తాగు నీటికోసం నాలుగు రూపాయలు, పనిముట్ల కూలి రూపేణా రూ.ఐదున్నర వంతున అదనంగా చెల్లించేవారు. ఇక పనులను పర్యవేక్షించే మేట్లకు టార్పాలిన్లు, రవాణాకు రోజుకు ఒక్కక్కరికి రూ.పది, పనుల్లో పాల్గొనే కూలీలను ప్రోత్సహించేందుకుగాను ప్రతికూలీకి అదనంగా మూడు రూపాయలు చెల్లించేవారు. పని గంటలపై అంక్షలు ఉండేవి కావు. కూలీలకు రోజువారీ వేతనంగా రూ.257 వంతున చెల్లించేవారు. గత సంవత్సరం వరకూ ఈ పథకంలో రాష్ట్ర ప్రభుత్వం సైతం కొంత మేరకు భాగస్వామ్యం వహించేది. టాటా కన్సల్టెన్సీ సర్వీస్ ఈ పనుల నమోదు, చెల్లింపు కార్యక్రమాలను చేపట్టేది. ఇక దూరప్రాంతాలకు వెళ్లి పనులు నిర్వహించే ఉపాధి కూలీలకు వారు ఉండే ప్రాంతం నుంచి ఐదు కిలోమీటర్లు దాటితే రూ.20 వంతున చెల్లించేవారు. ప్రస్తుతం దాన్ని రద్దు చేశారు. ఒక్కొక్క కూలి కేటాయించిన రోజు వారి కూలీ 1.60 క్యూబిక్ మీటర్ల మట్టి తవ్వకం షరతులో ప్రస్తుత సంవత్సరం సైతం మార్పు చోటు చేసుకోలేదు. గత సంవత్సరం తాలూకా బిల్లులు పెండింగ్ లేవని ఉపాధి హామీ కార్యాలయ అధికారులు తెలిపారు. ప్రస్తుత సంవత్సరం పరిస్థితి మారింది. ఉపాధి హామీ పర్యవేక్షణ ఎన్‌ఎల్‌సి అనే కంపెనీ ద్వారా కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. దీనికోసం ఉపాధి హామీ కూలీలు ఉదయం, సాయంత్రం కలిపి ఎనిమిది గంటల పాటు పనిచేయాలన్న షరతు విధించింది. రెండు పూటలా యాప్ ద్వారా హాజరు నమోదు చేయాలని తెలిపారు. దీనికోసం నేషనల్ మొబైల్ మోనటరింగ్ సిస్టం యాప్‌ను ఫీల్డ్ అసిస్టెంట్లకు అందజేశారు. ఒక్కో సమయంలో సిగల్ సక్రమంగా లేని కారణంగా హాజరు నమోదు కాకపోవడంతో ఉపాధి హామీ పనుల్లో పాల్గొన్న కూలి ఆ రోజు వేతనాన్ని కోల్పోవాల్సి వస్తుంది. దీనికోసం ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాటు చేశామని చెబుతున్నప్పటికీ అవి అంతగా అమలు కావడం లేదని ఉపాధి కూలీలు చెబుతున్నారు.
ఇక కూలీలకిచ్చే సమ్మర్, ఇతర అలవెన్సులను పూర్తిగా రద్దు చేశారు. పనుల్లో పాల్గొని నిర్ణీత కొలతల మేరకు పనులు పూర్తి చేసిన వారికి ఇచ్చే కూలీని 257 రూపాయల నుంచి రూ.272కు పెంచారు. పెరిగిన ధరలు, పని గంటలు పెరిగిన నేపథ్యంలో కూలీని రూ.600కు పెంచాలని కూలీల డిమాండ్ చేస్తున్నారు. ఏడాదికి 200 పని దినాలు కల్పించాలని కోరుతున్నారు. ఇదే విధంగా గతంలో మాదిరి సౌకర్యాలను కల్పించాలని వేడుకుంటున్నారు. గత సంవత్సరం ఉపాధి హామీ పనుల్లో కనిపించిన ప్రగతి ఆధారంగా భీమడోలు మండలానికి ప్రస్తుత సంవత్సరం 4.48 లక్షల పని దినాల కల్పన, దీనికోసం రూ.12.14 కోట్ల బడ్జెట్ కేటాయించినట్లు అధికారులు తెలిపారు. మండలంలో 15,290 జాబ్ కార్డులు మంజూరు కాగా గత సంవత్సరం 12,286 మంది ఉపాధి హామీ పనుల్లో పాల్గొన్నారు. వంద రోజులు పని దినాలు పూర్తి చేసుకున్న వారికి ప్రభుత్వ షరతుల మేరకు నైపుణ్య అభివృద్ధి సంస్థ ఏ విధమైన శిక్షణ ఇవ్వడం లేదని కూలీలు అంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత సంవత్సరం ఉపాధి హామీ పనుల్లో పాల్గొనే కూలీల సంఖ్య బాగా తక్కువగా ఉండే అవకాశం ఉందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. గత సంవత్సరం ఉపాధి కూలీలకు రోజువారి సరాసరిన 240 రూపాయలు కూలి రాగా ప్రస్తుత సంవత్సరం రెండు పూటలా హాజరు నమోదు, తిరిగి రెండోసారి పనుల వద్దకు వెళ్లాల్సిరావడంతో పనుల్లో పాల్గొనే కూలీల సంఖ్య తగ్గుతుందని పరిశీలకులు చెబుతున్నారు. ఉపాధి హామీ చట్టం నిర్వీర్యమయ్యే అవకాశం ఉందని వారు అభిప్రాయపడుతున్నారు.










