Oct 18,2023 19:41

టిడ్కో గృహాల లబ్ధిదారులకు మెగా కీను అందజేస్తున్న మంత్రులు

పేదల సొంతింటి కల సాకారం
- మంత్రులు అంజాద్‌ భాష, బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి, ఆదిమూలపు సురేష్‌
- ఆళ్లగడ్డ పట్టణ శివారులో టిడ్కో గృహాలు ప్రారంభం
ప్రజాశక్తి - ఆళ్లగడ్డ

    ప్రతి పేదవారికి సొంత ఇళ్లు ఉండాలన్న కలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నిజం చేశారని ఉప ముఖ్యమంత్రి అంజాద్‌ భాష, ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి, మున్సిపల్‌ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌లు పేర్కొన్నారు. బుధవారం ఆళ్లగడ్డ పట్టణ శివార్లలో టిడ్కో గృహాల ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రులు అంజాద్‌ భాష, బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి, ఆదిమూలపు సురేష్‌, జల వనరుల శాఖ రాష్ట్ర సలహాదారులు గంగుల ప్రభాకర్‌ రెడ్డి, ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యే గంగుల నాని, జిల్లా కలెక్టర్‌ మన్‌జీర్‌ జిలానీ సామూన్‌, జాయింట్‌ కలెక్టర్‌ రాహుల్‌ కుమార్‌ రెడ్డిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి బుగ్గన మాట్లాడుతూ పేదవాడి కోసం ముఖ్యమంత్రి జగన్‌ ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టారన్నారు. గత టిడిపి ప్రభుత్వం టిడ్కో ఇళ్లను ప్రారంభించారని, వారి హయాంలో 10 శాతం అయితే మిగిలిన 90 శాతం వైసిపి ప్రభుత్వంలో పూర్తి చేశామన్నారు. గత ప్రభుత్వంలో అన్ని స్కామ్‌లేనని, వైసిపి ప్రభుత్వం వచ్చాక రివర్స్‌ టెండరింగ్‌ చేసి రాష్ట్ర ఖజానాకు వందల కోట్లు మిగిల్చామని చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును అరెస్టు చేస్తే ఇతర రాష్ట్రాల్లో, దేశాల్లో వారి అనుచరులు నిరసనలు చేశారే గాని రాష్ట్రంలో ప్రజలు ఎవరూ స్పందించలేదని ఎద్దేవా చేశారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో వైసిపి ప్రభుత్వానికి మద్దతు పలుకుతారన్నారు. మంత్రి ఆదిమూలపు సురేష్‌ మాట్లాడుతూ సామూహిక గృహ ప్రవేశాల ప్రారంభోత్సవానికి తాను రావడం ఆనందంగా ఉందన్నారు. 23 ఎకరాల్లో టిడ్కో ఇండ్లు నిర్మించి లబ్ధిదారులకు అందజేసినట్లు చెప్పారు. ప్రస్తుతం ఈ స్థలం విలువ రూ. 100 కోట్లు ఉంటుందని తెలిపారు. ప్రజల కష్టాలను చూసి నాడు పాదయాత్రలో పేద వారందరికీ సొంతిల్లు కట్టించి ఇస్తామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఇచ్చిన హామీని నెరవేర్చారన్నారు. రాబోయే రోజుల్లో ఈ ప్రాంతం మరో ఊరుగా అభివృద్ధి చెందుతుందని, ఇళ్లను చక్కగా చూసుకోవాలని కోరారు. పేదల ఆశలను నెరవేర్చిన ముఖ్యమంత్రి వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డికి, స్థానిక ఎమ్మెల్యే గంగుల నానికి రాబోయే ఎన్నికల్లో మద్దతు తెలపాలని కోరారు. జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ ఆళ్లగడ్డ పట్టణంలో 1392 గృహాలను లబ్ధిదారులకు అందజేస్తున్నట్లు తెలిపారు. దసరా, దీపావళి పండుగలు ముందే వచ్చినట్లుగా ఇక్కడి వాతావరణం కనిపిస్తుందన్నారు. ఎంపీ పోచా బ్రహ్మానంద రెడ్డి మాట్లాడుతూ పేదవాడి సొంతంటి కలను నెరవేర్చిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను అందరూ గుర్తు పెట్టుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో విజయ డైరీ చైర్మన్‌ ఎస్వి జగన్మోహన్‌ రెడ్డి, రామతీర్థం పుట్టాలమ్మ ఆలయ చైర్మన్‌ గంగుల మనోహర్‌ రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ డాక్టర్‌ రామలింగారెడ్డి, కమిషనర్‌ రమేష్‌ బాబు, టిడ్కో ఎస్‌ఇ రాజశేఖర్‌, రామసుబ్బయ్య, రాష్ట్ర ముస్లిం మైనార్టీ జనరల్‌ సెక్రటరీ బాబులాల్‌, మార్కెట్‌ యార్డ్‌ చైర్మన్‌ గంధం రాఘవ రెడ్డి, ఇరిగేషన్‌ చైర్మన్‌ కర్రా గిరజా హర్షవర్ధన్‌ రెడ్డి, గంగుల విజయసింహారెడ్డి, తహశీల్దార్‌ హరినాథ్‌ రావు, ఎంపిపిలు గజ్జల రాఘవేంద్ర రెడ్డి, వీరభద్రుడు, కౌన్సిలర్‌ గొట్లూరు సుధాకర్‌ రెడ్డి, యాదవాడ నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.