Oct 13,2023 01:12

ప్రజాశక్తి - వేటపాలెం
పేదల సొంతింటికలను ప్రభుత్వం నెరవేర్చిందని కలెక్టర్ పి రంజిత్ భాష అన్నారు. మండలంలోని చల్లారెడ్డిపాలెం పంచాయితీ కొంజేటి నగర్‌ వద్ద జగనన్న కాలనీ గృహ ప్రవేశ మహోత్సవ వేడుకలు గురువారం నిర్వహించారు. రాష్ట్రంలో మొదటి విడత 5లక్షల గృహాలను పూర్తి చేయాలని సిఎం లక్ష్యంగా నిర్ణయించారని అన్నారు. ఆ మేరకు జిల్లాలో 50వేల గృహాలను నిర్మించడానికి చర్యలు తీసుకున్నామని అన్నారు. చల్లారెడ్డిపాలెంలో 8.26ఎకరాల భూమిలో 213గృహాలను మంజూరు చేసి 203గృహాలు పూర్తి చేసి ప్రారంభించినట్లు తెలిపారు. కాలనీలో పూర్తి స్థాయి మౌలిక సదుపాయాలు కల్పించడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. కాలనీలో కల్వర్టులు, అంతర్గత రోడ్లు నిర్మిస్తామని అన్నారు. ఎమ్మెల్సీ, శాసన మండలి విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి సిఎం అయిన తరువాత ప్రతి కుటుంబానికి, ప్రతి వ్యక్తికి సంక్షేమ పథకాలు అందిస్తున్నారని అన్నారు. రాబోయే రోజుల్లో మంచి పరిపాలన కోసం ప్రతి ఒక్కరూ ప్రభత్వానికి మద్దతుగా ఉండాలన్నారు. ఎంఎల్‌సి పోతుల సునీత మాట్లాడుతూ అక్కా, చెల్లెమ్మాల కోసం 10లక్షల గృహాలు నిర్మించడానికి సిఎం జగన్ చర్యలు తీసుకున్నారని చెప్పారు. నవరత్నాలు, పేద లందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా 5లక్షల మందికి గృహాలను మంజూరు చేసినట్లు చెప్పారు. ఎమ్మెల్యే కరణం బలరామ కృష్ణమూర్తి మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన సౌకర్యాలు ఉపయోగించుకుని జగనన్న కాలనీని సుందరంగా నిర్మిచుకున్నట్లు చెప్పారు. అధికారులు చిత్తశుద్ధి తో పనిచేయడం వల్ల జగనన్న కాలనీ సకాలంలో పూర్తి చేసినట్లు చెప్పారు. ప్రారంభోత్సవం సందర్భంగా కాలనీ నిర్మాణానికి, అభివృద్ధి కృషి చేసిన అధికారులను కలెక్టర్ సన్మానించారు. కార్యక్రమంలో వైసిపి ఇన్‌చార్జీ కరణం వెంకటేష్, మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు, హౌసింగ్‌ పిడి ప్రసాద్, డ్వామా పిడి శంకర్ నాయక్, డిఆర్డిఎ పిడి అర్జున్, తహశీల్దారు అశోక్ వర్ధన్, ఎంపిడిఒ రూతమ్మ, హౌసింగ్ డీఈ శరత్ చంద్ర, పంచాయితీ రాజ్‌ డిఈ స్వర్ణ శేషయ్య, వైసిపీ మండల అధ్యక్షులు బొడ్డు సుబ్బారావు, జెసిఎస్ కన్వీనర్ లేళ్ల్ శ్రీధర్, రామన్నపేట సర్పంచి కందేటి రమణ, ఆర్డబ్ల్యూఎస్ ఎఈ రాంకుమార్, హౌసింగ్ ఎఈ సుబ్బారావు, ఆర్‌బికె ఛైర్మన్‌ పల్లపోలు శ్రీనివాసరావు పాల్గొన్నారు