
ప్రజాశక్తి-అనకాపల్లి
పేదల క్షేమాన్ని కాంక్షించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ చెప్పారు. మండలంలోని గొలగాం గ్రామంలో గురువారం ఎంపీపీ గొర్లి సూరిబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి అమర్నాథ్ పాల్గొన్నారు. పథకాలు అందని వారు మంత్రి దృష్టికి తీసుకురావడంతో ఆయన వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడిన అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పథకాలు అందే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ గ్రామానికి చెందిన కోరుబిల్లి నాగరాజు, గొంతిన మోహన్ సాయిను పరామర్శించి, ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. చికిత్సకు అవసరమైన మొత్తాన్ని ప్రభుత్వం నుంచి అందించేలా చూస్తామని హామీ ఇచ్చారు. గ్రామంలో రూ.10.30 లక్షలతో నిర్మించిన 20 కిలోలీటర్ల ఓవర్ హెడ్ ట్యాంక్‌ను ప్రారంభించారు. రూ.6 లక్షలతో నిర్మించనున్న సిసి రోడ్లకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నరసింహారావు, వైసిపి నాయకులు మంత్రి సత్తిబాబు, శంకరం వైసిపి నాయకులు పసుపులేటి రామకృష్ణ, ఎంపీటీసీ సభ్యులు వైసిపి నాయకులు పాల్గొన్నారు.