Sep 05,2023 23:55

సబ్‌కలెక్టర్‌ కార్యాలయం వద్ద ధర్నాలో ప్రసంగిస్తున్న ఎం.ఇంతియాజ్‌

         పెనుకొండ : ఇళ్ల పట్టాలు, పట్టాదారుపాసు పుస్తకాల విషయంలో అధికారులు, ఎమ్మెల్యే స్పందించకుంటే పేదలతో కలిసి సత్యసాయి జిల్లా కలెక్టర్‌ కార్యాలయం వరకు మహా పాదయాత్ర చేస్తామని సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం.ఇంతియాజ్‌ తెలిపారు. పెనుకొండ నగర పంచాయతీ పరిధిలో ఇళ్లు లేని పేదలు, రొద్దం మండలం కోగిర, కంబాలపల్లి, శ్యాపురం గ్రామాలకు చెందిన భూములు లేని నిరుపేద రైతులతో కలసి మంగళవారం నాడు పట్టణంలో నిరసన తెలిపారు. పట్టణ పురవీధుల నుంచి సబ్‌కలెక్టర్‌ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం వద్ద వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి గంగాధర్‌ అధ్యక్షత ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పెద్దన్న, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు హరి, సిఐటియు మండల కార్యదర్శి బాబావలి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్బంగా సిపిఎం జిల్లా కార్యదర్శి ఇంతియాజ్‌ మాట్లాడుతూ అర్హులైన నిరుపేదలు తమ సమస్యలను పరిష్కారించాలని సంబంధిత తహశీల్దార్‌, సబ్‌ కలెక్టర్‌, కలెక్టర్‌లకు అర్జీలు సమర్పించారన్నారు. ఇంతవరకు పేదల సమస్యలు పరిష్కారం కాలేదన్నారు. పెనుకొండలో ప్రభుత్వ స్థలంలో పేదలు గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్నారని, వారికి అక్కడ ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఇళ్ల పట్టాల విషయంపై గతకొన్ని నెలలుగా అనేక రూపాల్లో శాంతియుతంగా ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నా అధికారులు, స్థానిక ఎమ్మెల్యే, పేదల సమస్యలను పట్టించుకోకపోవడం దారుణమన్నారు. రొద్దం మండలం కోగిర గ్రామ రెవెన్యూ పొలం సర్వే నంబర్లు 666 - 669లో 800 ఎకరాల్లో ఆయా గ్రామాలకు చెందిన పేద రైతులు సాగులో ఉన్నారని చెప్పారు. వీరందరికీ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రస్తుత భూ పంపిణీలో అసైన్మెంట్‌కు ప్రతిపాదిస్తూ పట్టాదారు పాసుపుస్తకాలు ఇవ్వాలని కోరారు. రొద్దం మండలం కోగిర, శాపురం, కంబాలపల్లి గ్రామాలకు చెందిన దళిత, గిరిజన, బలహీన వర్గాల భూమిలేని నిరుపేద కుటుంబాలు దాదాపు 250 మంది 800 ఎకరాల ప్రభుత్వ భూమిని రాళ్లు, రప్పలు తొలగించి వ్యవసాయానికి అనుకూలంగా మార్చి సాగు చేస్తున్నారన్నారు. వీరందరికీ పట్టాదారు పాస్‌ పుస్తకాలు ఇవ్వాలన్నారు. ఈ సమస్యలపై అధికారులు, ఎమ్మెల్యే వెంటనే స్పందించాలని డిమాండ్‌ చేశారు. లేకుంటే పేదలతో కలిసి కలెక్టరేట్‌ వరకు మహాపాదయాత్రను నిర్వహిస్తామని చెప్పారు. అనంతరం సబ్‌కలెక్టర్‌ కార్యాలయం ఏఓ రమణకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు నారాయణ, వెంకటరాముడు, సిపిఎం నాయకులు తిప్పన్న, నరసింహాతో పాటు పేదలు పాల్గొన్నారు.