పేదల సాగు భూములకు పట్టాలివ్వాలి
ప్రజాశక్తి - ఓజిలి
పేదలు సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు మంజూరు చేయాలని మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయం ఎదుట సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు ఆధ్వర్యంలో రైతులు గురువారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వందవాసి నాగరాజు మాట్లాడుతూ మండల పరిధిలోని మాచవరం గ్రామ సర్వేనెంబర్ 207, 226 భూముల్లో నిరుపేద రైతులు నిమ్మ సాగు చేస్తుంటే రెవెన్యూ యంత్రాంగం పోలీసులను వెంటపెట్టుకుని నిమ్మ చెట్లను తొలగించడం అన్యాయమన్నారు. రెండేసి ఎకరాల భూములు కల్పించాలని పేద ప్రజలు పలుమార్లు విన్నవించినా కాలయాపన చేస్తున్నారని తెలిపారు. మరోవైపు భూస్వాములు, పెత్తందారులు మాత్రం ఎకరాలకు ఎకరాలుగా ఆక్రమించుకుంటూ పోతుంటే రెవెన్యూ అధికారులు నిద్రపోతున్నారని ప్రశ్నించారు. కుందాం రెవెన్యూలోని సర్వే నెంబర్ 1లో 1200 ఎకరాలు మేత పోరంబోకు భూములు ఉన్నాయని వాటిని సర్వే చేసి గిరిజనులకు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేదలందరికీ భూములు కల్పించాలని పదేపదే చెబుతూ మీడియాకే పరిమితమయ్యారని పేర్కొన్నారు. వాస్తవానికి ప్రజాక్షేత్రంలో అర్హులైన పేదలకు భూములు ఇవ్వడంలో అధికారులు కాలయాపన చేస్తున్నారని ఎద్దేవా చేశారు. సూళ్ళూరుపేట నియోజవర్గ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య సాగు భూములకు పట్టాలు పంపిణీ చేయడంలో విఫలమయ్యారని తెలిపారు. ప్రథమ పౌరుడుగా మండలంలోని మాచవరం, కుందాం గ్రామాల్లో పేదలకు భూములు కల్పించి భూ పట్టాలు ఇప్పించి పేదలకు అండగా నిలవాలని ఆయన డిమాండ్ చేశారు. పేదలకు సాగుభూములు పట్టాలు ఇవ్వడంలో నిర్లక్ష్యం వహిస్తే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఓజిలి మండలంలో పెద్ద ఎత్తున భూ పోరాటం నిర్వహిస్తామని హెచ్చరించారు. సీపీఎం నేతలు చాపల వెంకటేశ్వర్లు ,శివకవి ముకుందా, చెంగయ్య మాట్లాడుతూ పేదలు సాగు భూములకు పట్టాలు ఇచ్చేవరకు సిపిఎం పోరాడుతుందని తెలియజేశారు. ఆనంతరం తహశీల్దార్‌కు వినతి పత్రం సమర్పించారు. తహశీల్దార్ శివరామ సుబ్బయ్య స్పందిస్తూ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకురాలు పద్మమ్మ .చంద్రకళ, మాచవరం గ్రామస్తులు విశ్వనాథ్, గురవయ్య , కుందాం గిరిజనులు పాల్గొన్నారు.










