Oct 10,2023 20:56

ప్రజాశక్తి - ఏలూరు అర్బన్‌
       రాష్ట్ర ప్రభుత్వం పేదలు, దళితుల పట్ల నిరంకుశంగా వ్యవహరిస్తుందని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి జక్కంశెట్టి సత్యనారాయణ, జిల్లా కార్యదర్శి పి.రామకృష్ణ విమర్శించారు. అసైన్డ్‌ చట్ట సవరణను రాష్ట్ర ప్రభుత్వం తక్షణం రద్దు చేయాలని, భూ పంపిణీలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాను చేర్చాలని డిమాండ్‌ చేస్తూ మంగళవారం ఏలూరు వసంతమహల్‌ సెంటర్‌లో సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి జక్కంశెట్టి సత్యనారాయణ, జిల్లా కార్యదర్శి పి.రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం భూ పంపిణీ చేస్తామని ప్రకటించి అసైన్డ్‌ భూముల చట్ట సవరణ చేయడం దుర్మార్గమన్నారు. 9/77 చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకే రాష్ట్ర ప్రభుత్వం పూనుకుందన్నారు. పేదలు, దళితులు, గిరిజనులు సాగుచేసుకుంటున్న భూములకు హక్కు పత్రాలు ఇవ్వకపోగా ఈ చట్ట సవరణ ద్వారా 20 ఏళ్లు ఎవరైతే ఎంజారుమెంట్‌లో ఉన్నారో వారికే పట్టాలిస్తామని చెప్పడం దుర్మార్గమన్నారు. కాకులను కొట్టి గద్దలకు పెట్టినట్లుగా రాష్ట్ర ప్రభుత్వం పేదల చేతుల్లో ఉన్న భూములను భూస్వాములకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తుందన్నారు. ఎర్రకాలువ మిగులు భూములు పేదలకు, దళితులకు, గిరిజనులకు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. 30 ఏళ్ల నుండి ప్రభుత్వ భూములను అక్రమంగా, దౌర్జన్యంగా భూములమ్మేసిన భూస్వాములే సాగు చేస్తున్నారని మండిపడ్డారు. చట్టవిరుద్ధంగా రెవెన్యూ, ఇరిగేషన్‌, విద్యుత్‌ శాఖల అధికారులు పేదలకు అన్యాయం చేస్తూ భూస్వాములిచ్చే లంచాలు మింగి అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 30 ఏళ్ల క్రితం ఎర్రకాలువ రిజర్వాయర్‌ ప్రాజెక్టు కోసం ఇప్పటి ప్రభుత్వం సుమారు 3500 ఎకరాలు భూసేకరణ చేసిందన్నారు. ఈ భూముల్లో సుమారు మూడు వేల ఎకరాలు మిగులుగా ఉందని ఆ భూములు ప్రాజెక్టుకు ఆనుకుని ఉన్న గ్రామాల్లో పేదలకు సాగుకు అవకాశం కల్పించాలని కోరారు. దీనితోపాటు ఏక్‌సాల్‌ పట్టాలివ్వాలని డిమాండ్‌ చేశారు. ఎర్రకాలువ మిగులు భూముల్లో పేదలు, దళితులు, గిరిజనులపైన ఇరిగేషన్‌ అధికారులు కేసులు పెట్టడం దుర్మార్గమన్నారు. చట్టాలు ధిక్కరించే వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తున్న భూస్వాములపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. చింతలపూడి, నూజివీడు, దెందులూరు, ఉంగుటూరు నియోజకవర్గాల్లో పేదల భూములు ఆక్రమణలో ఉన్నాయని, ఆక్రమించుకున్న భూస్వాములపై చట్టపరమైన చర్యలు తీసుకుని పేదలకు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. జంగారెడ్డిగూడెం, చింతలపూడి మండలాల్లో వందలాది ఎకరాల అసైన్డ్‌, సీలింగ్‌ భూములు భూస్వాముల చేతుల్లో ఉన్నాయని తెలిపారు. ఆ భూములను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్వాధీనం చేసుకుని పేదలకు పంచాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షులు ఎం.జీవ రత్నం, జిల్లా ఉపాధ్యక్షులు ఎ.రవి, టి.ముత్యాలమ్మ, ఎస్‌.మహంకాళిరావు, సహాయ కార్యదర్శి యు.వెంక టేష్‌, రాజమండ్రి దానియేలు, ఎం.సుధారాణి సత్యనారాయణ, మాధవ, సుబ్బారావు పాల్గొన్నారు.