ఆంధ్రప్రదేశ్‌ను పాలించిన ముఖ్యమంత్రులలో దామోదరం సంజీవయ్యది ఒక ప్రత్యేక స్థానం. పేదల పట్ల నిబద్ధత కలిగిన ముఖ్యమంత్రిగా సంజీవయ్య పేర్గాంచారు. భారతదేశంలో తొలి దళిత ముఖ్యమంత్రిగా, అతి పిన్న వయసులోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించిన వ్యక్తిగా ఆయన రికార్డుకెక్కారు.
ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా కల్లూరు మండలం, పెద్దపాడు గ్రామంలో సుంకులమ్మ, మునిదాసు దంపతులకు 1921 ఫిబ్రవరి 14న సంజీవయ్య జన్మించారు. బాల్యంలో పెదపాడునుంచి కర్నూలుకు నాలుగు కిలోమీటర్లు కాలి నడకన వెళ్ళి విద్యనభ్యసించారు. అనేక కష్టాలతో, పేదరికపు బాధలను అనుభవిస్తూ ఎస్.ఎస్.ఎల్.సిలో జిల్లాలోనే ప్రథమస్థానంలో ఉత్తీర్ణులయ్యారు. అనంతరం, అనంతపురం ఆర్ట్స్ కాలేజీలో చేరి 1942లో పట్టభద్రులయ్యారు.
1950లో మద్రాసు వెళ్ళి న్యాయశాస్త్రంలో పట్టభద్రులై అక్కడే న్యాయవాద వృత్తి చేపట్టారు. సంజీవయ్య చురుకుదనం, చొరవను గుర్తించిన కాంగ్రెస్ పార్టీ ఆయనకు పార్టీ సభ్యత్వం ఇచ్చి రాజకీయాల్లోకి తీసుకొచ్చింది. భారతదేశంలో మొదటిసారిగా 1950 జనవరి 26న రాజ్యాంగం అమలులోకి వచ్చిన మొదటి ప్రొవిజినల్ పార్లమెంటు సభ్యునిగా, హోం విభాగ సభ్యునిగా బాధ్యతలు సమర్ధంగా నిర్వహించారు.
1952లో కర్నూలు నుంచి సాధారణ ఎన్నికల్లో అసెంబ్లీ స్థానం నుంచి గెలుపొంది రాజాజీ కేబినెట్‌లో మున్సిపల్ శాఖామంత్రిగా పనిచేశారు. 1953లో టంగుటూరి ప్రకాశం పంతులు మంత్రివర్గంలో ఆరోగ్యం, పునరావాసం, హరిజనోద్ధరణ, ప్రణాళికలు, మాజీ సైనికుల సంక్షేమ శాఖామంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.
1954 మే 7న సికింద్రాబాద్‌కు చెందిన బుచ్చయ్య కూతురు కృష్ణవేణమ్మను కులాంతర వివాహం చేసుకున్నారు.
1955 ఆంధ్రరాష్ట్ర మధ్యంతర ఎన్నికల్లో ఎమ్మిగనూరు - కోడుమూరు ఉమ్మడి అసెంబ్లీ స్థానం నుంచి గెలిచి రవాణా, వాణిజ్యపన్నుల శాఖామంత్రిగా బెజవాడ గోపాలరెడ్డి మంత్రివర్గంలో పనిచేశారు. 1956 నవంబర్ 1వ తేదిన ఆంధ్రరాష్ట్రం - హైదరాబాద్ రాష్ట్రం స్వపరిపాలన, కార్మికశాఖా మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 1960 జనవరి 11న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.
1962లో అఖిల భారత కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులుగా ఎన్నికై, 1964లో నెహ్రూ మంత్రివర్గంలో కార్మికమంత్రిగా సమర్థంగా బాధ్యతలు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీకి రెండవ పర్యాయం జాతీయ అధ్యక్షులుగా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఆయన పదవిలో వున్నప్పుడు ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనారిటీ, మహిళల ప్రాతినిధ్యం పెంచేందుకు ఎంగానో కృషిచేశారు. తెలుగును అధికార భాషగా, ఉర్దూ రెండవ భాషగా ఆయన హయాంలోనే నిర్ణయించారు. భాష పట్ల ఎనలేని గౌరవం కలిగి, పేదల పక్షపాతిగా, అల్పసంఖ్యాక వర్గాల అభ్యున్నతికోసం అహర్నిశలూ పాటుపడిన గొప్ప వ్యక్తిత్వం కలిగిన నాయకుడు సంజీవయ్య. ఒకసారి సంజీవయ్య గారు పుట్టిన ఊరుకు తన తల్లిని చూడటానికి వచ్చి తిరిగి వెళుతూ ఆమె చేతిలో వందరూపాయలు పెట్టారు. 'వృద్ధాప్యంలో వున్న మిగతా వారికి ఎవరు చేస్తారు ఇటువంటి సహాయం' అన్న తల్లి మాటలు సంజీవయ్యను ఆలోచనల్లో పడేసింది. దాని ఫలితమే వృద్ధాప్య ఫించను పథకం రూపకల్పన.
ముఖ్యమంత్రిగా సంజీవయ్య అనేక వినూత్న కార్యక్రమాలు రూపకల్పన చేశారు. లక్షల ఎకరాల బంజరు భూములను నిరుపేదలకు పంపిణీ చేశారు. రాయలసీమ, కర్నూలు జిల్లాలో గాజులదిన్నె ప్రాజెక్టు, ఉత్తరాంధ్ర ప్రజలకు శ్రీకాకుళం జిల్లాలో వంశధార ప్రాజెక్టుకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టుల ద్వారా ఆయా జిల్లాల్లో సాగునీరు, త్రాగునీరు అందుతుంది. ఎస్‌సి, ఎస్‌టి, బి.సిలకు సేవా సహకార సంఘాలను స్థాపించారు. వీటిద్వారా బడుగు బలహీన వర్గాల ఆర్థిక స్వావలంబనకు ఎంతగానో కృషిచేశారు.
సంజీవయ్య అల్పసంఖ్యాకుల నాయకుడు మాత్రమే కాదు. ఆయన అందరితో కలిసిపోయి సాదాసీదాగా, కలివిడిగా వుండే వ్యక్తిత్వం. ఒక్కసారి పరిచయం అయితే చాలు. ఎక్కడున్నా ఇంటిపేరుతో సహా గుర్తుపెట్టుకోగల జ్ఞాపకశక్తి ఆయన సొత్తు.
పదవులకోసం, ఆయన ఎప్పుడూ ఆరాటపడ లేదు. నీతి, నిజాయితీ, నిబద్ధత గల నాయకుడు సంజీవయ్య.ముఖ్యమంత్రిగా సంజీవయ్య తీసుకున్న చర్యలలో అన్నిటికన్నా ముఖ్యమైనది షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగలు, వెనుకబడిన తరగతుల వారికి ఉద్యోగాలలో ప్రమోషన్లకు రిజర్వేషన్ పద్ధతిని అమలుపరచడం.
కళలపట్ల, సాహిత్యం పట్ల ఆయనకు ఎనలేని ప్రేమ. ఆయన హయాంలోనే లలిత కళల అకాడమీ ఏర్పాటు చేశారు. కేంద్రమంత్రిగా ముఖ్యంగా కార్మిక మంత్రిగా, కార్మికులకు అనేక సంక్షేమ కార్యక్రమాలను రూపకల్పన చేసిన కార్మిక పక్షపాతి దామోదరం సంజీవయ్య. ఆయన శతజయంతి సందర్భంగా ఈ సంవత్సరం ఆయన కృషిని స్మరించుకుని, స్ఫూర్తి పొందడం నేటి మనందరి కర్తవ్యం. దామోదరం సంజీవయ్య గారికి శతజయంతి నివాళి.
ఆర్. మల్లికార్జున రావు
(రచయిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత మరియు సంస్కృతి సమితి ముఖ్య కార్యనిర్వాహణాధికారి)
సెల్ నెం 9491659899










