Apr 13,2023 23:14

గేయాలు ఆలపిస్తున్న ప్రజానాట్య మండలి కళాకారులు

ప్రజాశక్తి-తాడేపల్లి : పేదల పేటల్లో ప్రజానాట్య మండలి కళాకారులు తమ ఆటపాటతో అలరించారు. సఫ్దర్‌ హష్మి 69వ జయంతి సందర్భంగా తాడేపల్లి పట్టణంలోని వడ్డెర కాలనీ రామాల యం ఎదురుగా గల పైబజార్‌లో గురువారం నిర్వహించిన ఆట-పాట కార్యక్రమంలో పాటలు, కళా రూపాల ప్రదర్శన ద్వారా ప్రస్తుత పాలకుల ప్రజావ్యతిరేక విధానాలను, దేశాన్ని కార్పొరేట్లకు తెగనమ్ముతున్న తీరును కళ్లకుకట్టారు. దేశభక్తి, అభ్యుదయాన్ని ప్రబోధిస్తూ స్వాతంత్య్ర సమరయోధుల, విప్లవ వీరుల గాధలను ఆలపించారు.
ఈ సందర్భంగా ప్రజాశక్తి బుకహేౌస్‌ ఎడిటర్‌ ఎస్‌.వెంకట్రావు మాట్లాడుతూ వీధినాటికను ప్రజల ఆయుధంగా మలిచిన సఫ్దర్‌ హష్మి ప్రజల్లో నేటికీ జీవించి ఉన్నారని అన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్య లపై, ఫ్యాక్టరీల్లో కార్మికులను యాజమాన్యం ఎలా దోపిడీ చేస్తుందనే అంశాలపై ఢిల్లీ నడిబొడ్డులో 'అల్లాబోలో' నాటికను ప్రదర్శి స్తుండగా సఫ్దర్‌ హష్మీని అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం నడిరోడ్డు మీద హత్య చేయించిందని గుర్తు చేశారు. మూడు రోజుల అనంతరం అదే ప్రాంతంలో హష్మి భార్య మలైశ్రీ హష్మి అదే నాటికను వేలాది మంది సమక్షంలో ప్రదర్శించి ప్రజా స్ఫూర్తిని కొనసాగించారని చెప్పారు. కళారూపాల ద్వారా ప్రజలు చైతన్యవంతమై తిరుగుబాటు చేస్తారనే భయం పాలకవర్గాలకు మింగుడు పడని అంశంగా మారి హష్మిని పొట్టన పెట్టుకున్నారన్నారు. ప్రస్తుతం దేశంలో బిజెపి పాలనలో పెట్రోల్‌, గ్యాస్‌, నిత్యావసర సరుకుల ధరలు పెంచారని, ప్రజలు కొనుగోలు చేయలేని విధంగా నడ్డివిరుస్తున్న బిజెపి ప్రభుత్వాన్ని ప్రజలు నిలదీయాలని అన్నారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు అని చెప్పి ఉన్న ఉద్యోగాలు ఊడబీకు తున్నారని మండిపడ్డారు. రోజువారీ కూలీ పని చేసుకునే వారికి జీవనం దుర్భరంగా మారిందన్నారు. ప్రజల చైతన్యంతోనే సమ స్యలు పరిష్కారమవుతాయన్నారు. సంఘ వ్యతిరేక శక్తులు, ఫాసిస్టు శక్తుల నుంచి దేశాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ప్రతిఒ క్కరిపై ఉందని తెలిపారు. సమాజాన్ని, ప్రజలను సీరియల్స్‌ తప్పుదోవ పట్టిస్తున్నా యని చెప్పారు. తొలుత హష్మి చిత్రపటానికి వెంకట్రావు పూలమాలలు వేసి నివాళుర్పించారు. కార్యక్రమంలో ప్రజా నాట్య మండలి రాష్ట్ర కార్యదర్శి ఎస్‌.అనిల్‌ కుమార్‌, ఉపాధ్యక్షులు గాదె సుబ్బారెడ్డి, సహాయ కార్యదర్శి ఎస్‌కె ఖాశీం, రాష్ట్ర కమిటీ సభ్యులు కవి, అప్పన్న, జివి రంగారెడ్డి, ఆర్‌వి రాఘవయ్య, ప్రసాద్‌, కె.కరుణాకరరావు, వి.రాజేష్‌, ఎస్‌కె హనీఫ్‌ పాల్గొన్నారు.