Aug 04,2023 00:46

మాట్లాడుతున్న సిపియం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌.బాబురావు

ప్రజాశక్తి-గుంటూరు : ప్రభుత్వ భూముల్లో ఇళ్లేసుకుని దీర్ఘకాలంగా నివాసముంటున్న పేదలకు ఇళ్ల పట్టాలిచ్చి, పక్కాగృహాల నిర్మాణానికి రుణాలు మంజూరు చేయాలని సిపిఎం డిమాండ్‌ చేసింది. ఈ మేరకు తీర్మానాన్ని బ్రాడీపేటలోని ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆమోదించింది. సమావేశానికి జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఈమని అప్పారావు అధ్యక్షత వహించగా రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సి.హెచ్‌.బాబురావు మాట్లాడారు. ఇళ్ల స్థలాలు లేని పేదలకు, వారివారి గ్రామాల్లో స్థలాలు మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు. కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చాక నిత్యావసర సరుకుల ధరలు, పెట్రోలు, డీజిల్‌, వంట గ్యాస్‌ ధరలు పెరిగాయని, ప్రజల అదాయాలు మాత్రం పెరగలేదని అన్నారు. పెరిగిన ధరలతో ప్రజల జీవనం దుర్భరంగా మారిందన్నారు. అనేక కులాలు, మతాలు, సంప్రదాయాలున్న భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం ఏకరూప పౌరస్మృతి పేరుతో ప్రజల మధ్య విభజన సృష్టించే ప్రయత్నం చేస్తోందన్నారు. ఈ విధానాలకు వ్యతిరేకంగా ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మణిపూర్‌లో 3 నెలల నుండి తెగల మధ్య ఘర్షణలు జరుగుతున్నా మహిళలను వివస్త్రను చేసి ఊరేగిస్తున్నా, గిరిజనులపైన హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం, నరేంద్రమోడీ స్పందించకపోవడం దుర్మార్గమన్నారు. దేశ వ్యాప్తంగా ముస్లిములు, క్రైస్తవులపై దాడుల, హత్యలు, గృహదహనాలు జరుగుతున్నాయన్నారు. వీటిపై పార్లమెంట్‌లో చర్చించాలని డిమాండ్‌ చేశారు. సిపిఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు మాట్లాడుతూ మంగళగిరి నియోజకవర్గంలో 20 వేల కుటుంబాలవారు ప్రభుత్వ భూముల్లో ఇళ్లేసుకుని నివాసముంటున్నారని, వారందరికీ పట్టాలివ్వాలని కోరారు. వ్యవసాయ సీజన్‌ ప్రారంభమయినందున విత్తనాలు, ఎరువులు, రైతు భరోసా కేంద్రాల్లో అందుబాటులో ఉంచాలన్నారు. సీజన్‌ మారినందున కళ్ల కలకలు, జ్వరాలు ఇతర వ్యాధులు ప్రబలుతున్నాయని, ప్రభుత్వ వైద్యశాలలో తగిన మందులు అందుబాటులో ఉంచాలని కోరారు. సమావేశంలో జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వై.నేతాజి, ఎన్‌.భావన్నారాయణ, ఎం.రవి, కె.నళినీకాంత్‌, ఎస్‌.ఎస్‌.చెంగయ్య, నాయకులు బి.కోటేశ్వరి, ఎల్‌.అరుణ పాల్గొన్నారు.