Oct 30,2023 22:01

ఎమ్మెల్యే శంకర నారాయణ ఇంటి వద్ద నిరసన తెలుపుతున్న పేదలు

        పెనుకొండ : ఇళ్ల పట్టాల కోసం పెనుకొండలో పేదలు పెద్ద ఎత్తున నిరసనాగ్రహం వ్యక్తం చేశారు. ఏళ్ల తరబడి సొంతిళ్లు లేక అవస్థలు పడుతున్న తమకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని కోరుతూ గత కొన్ని రోజులుగా సిపిఎం ఆధ్వర్యంలో వివిధ రూపాల్లో ఆందోళనలు చేస్తున్నారు. ఇందులో భాగంగా పెనుకొండ పట్టణం మడకశిర రోడ్డులోని ప్రభుత్వం స్థలంలో ఇటీవల భూ స్వాధీన పోరాటం నిర్వహించి అందులో గుడిసెలు వేసుకున్నారు. ఈ గుడిసెలను నాలుగు రోజుల క్రితం రెవెన్యూ, పోలీస్‌ అధికారులు జెసిబిలతో తొలగించారు. దీనిని నిరసిస్తూ పెనుకొండ ఎమ్మెల్యే శంకరనారాయణ ఇంటి ముట్టడికి సిపిఎం పిలుపునిచ్చింది. అందులో భాగంగా సోమవారం ఉదయం పెద్ద సంఖ్యలో పేదలు ఎమ్మెల్యే శంకర్‌ నారాయణ ఇంటిని ముట్టడించారు. ఇంటి ప్రధాన గేటుకు వద్ద బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఇళ్ల పట్టాలు ఇవ్వాలని కోరుతూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రెవెన్యూ, పోలీసు అధికారులు జెసిబిలతో గుడిసెలను తొలగించడంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటిపై ఎమ్మెల్యే సమాధానం ఇవ్వాలని నినాదాలు చేస్తూ ఇంట్లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఆందోళన విషయం తెలుసుకున్న పెనుకొండ సిఐ రాజా రమేష్‌, ఎస్‌ఐ రాజేష్‌, రమేష్‌ బాబు, పోలీస్‌ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. ఆందోళనకారులతో మాట్లాడి ఆందోళనను విరమించాలని కోరారు. ఇళ్లు లేకుండా నిరాశ్రయిలుగా ఉన్న తమకు ఇంటి స్థలం ఇవ్వమని అడిగితే ఇలా గుడిసెలు కూల్చేయడం ఏమిటంటూ పోలీసులను పేదలు ప్రశ్నించారు. తమకు ఇళ్ల పట్టాలు ఇస్తేనే ఆందోళన విరమిస్తామని స్పష్టం చేశారు.
బలవంతపు అరెస్టులు.. సిపిఎం నాయకులకు అస్వస్థత
శాంతియుతంగా నిరసన తెలుపుతున్న మహిళలు, సిపిఎం నాయకులను బలవంతంగా అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. తాము ఎమ్మెల్యేను కలిసి సమస్యను వివరిస్తామని చెప్పినా వినకుండా అరెస్టులకు ఉపక్రమించారు. ఏకపక్షంగా పోలీసులు ఆందోళన చేస్తున్న వారిని ఇష్టారీతిన ఈడ్చుకుంటూ వెళ్లి అరెస్టులు చేశారు. మహిళలు అని చూడకుండా వారిపై ప్రతాపం చూపారు. బలవంతపు అరెస్టును ఎదుర్కొనే క్రమంలో తోపులాట జరిగింది. వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు నారాయణ, తిప్పన్న, సిపిఎం నాయకులు కొండా వెంకటేష్‌ తదితరులను పోలీసులు బలవంతంగా అరెస్ట్‌ చేసి సోమందేపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఆందోళనకు నాయకత్వం వహిస్తున్న వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దన్న, జిల్లా సహాయ కార్యదర్శి గంగాధర్‌, జిల్లా కమిటీ సభ్యులు వెంకటరాముడులను అరెస్టు చేసేందుకు ప్రయత్నించారు. ఈ సమయంలో మహిళలు వలయంగా ఏర్పడి వారిని అరెస్టు చేయనీయకుండా అడ్డుపడ్డారు. దీంతో పోలీసులు కొంచెంసేపు ఆగారు. తరువాత సిపిఎం, వ్యకాసం నాయకులను బలవంతంగా అరెస్టు చేశారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దన్నను అరెస్ట్‌ చేసి రొద్దం పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. సిపిఎం నాయకులు గంగాధర్‌, వెంకటరాముడులను పెద్ద సంఖ్యలో పోలీసులు చుట్టుముట్టి అరెస్టు చేసేందుకు యత్నించారు. ఈసమయంలో నాయకులు గంగాధర్‌, వెంకటరాముడులు స్పృహ తప్పి అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురైన నాయకులను మహిళలు చికిత్స నిమిత్తం పెనుకొండ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఇక రొద్దం పోలీసు స్టేషన్‌లో ఉన్న వ్యకాసం జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దన్న కూడా తీవ్ర అస్వస్థతకు గురై కళ్లు తిరిగి కిందపడ్డాడు. వెంటనే ఆయన్ను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ఏళ్ల తరబడి అడుగుతున్నా స్పందించడం లేదు..
మహిళల ఆవేదన

ఇళ్ల పట్టాల కోసం ఏళ్ల తరబడి అధికారులు, నాయకులను అడుగుతున్నా వారి నుంచి స్పందన కరువైందని పేద మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఇళ్ల స్థలాల కోసం అధికారులు, పెనుకొండ ఎమ్మెల్యేకు అర్జీలు ఇచ్చామన్నారు. వారి నుంచి స్పందన రాకపోవడంతో భూస్వాధీన ఉద్యమం నిర్వహించి మడకశిర రోడ్డులోని ప్రభుత్వ స్థలంలో గుడిసెలు వేసుకున్నామన్నారు. ప్రభుత్వ భూమిలో పట్టాలు ఇవ్వమని అడిగితే దాని గురించి వారు పట్టించుకోలేదన్నారు. తాము ఎంతో కష్టపడి వేసుకున్న గుడిసెలను సైతం రెవెన్యూ, పోలీసులు అధికారులు కూల్చి వేసి నిలువనీడ లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యం పేదల గురించి మాట్లాడే ప్రజా ప్రతినిధులకు తమ గృహ కష్టాలు కన్పించడం లేదాని ప్రశ్నించారు. తాము గుడిసెలు వేసుకున్న స్థలంలో ఇళ్ల పట్టాలు ఇచ్చేంత వరకు ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు.