Oct 09,2023 23:11

ఇళ్లను కూలుస్తున్న పొక్లెయినర్‌

ప్రజాశక్తి - పొన్నూరు రూరల్‌ : పట్టణంలోని 22 వార్డులోని శ్రీ అవ్వారు ఆదెమ్మ సత్రానికి ఎందిన స్థలంలో 40 ఏళ్లుగా నివాసం ఉంటున్న ఆరు కుటుంబాలకు చెందిన ఇళ్లను గుంటూరు దేవాదాయ శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ మహేష్‌రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం తొలగించారు. బాధితులు అడ్డుకునే ప్రయత్నం చేసినా అప్పటికే మోహరించిన పోలీసులు వారిని పక్కకు నెట్టేయడంతో పొక్లెయినర్లు వచ్చి ఇళ్లను నేలమట్టం చేశాయి. ఈ ప్రదేశంలో కళ్యాణ మండపం నిర్మించాల్సి ఉందని, ఇళ్లు తొలగించాలని నివాసితులకు గతనెల 8న నోటీసులు జారీ చేశామని అధికారులు చెబుతున్నారు. ఇళ్ల తొలగింపు సమాచారం తెసుకున్న మాజీ ఎమ్మెల్యే ధూలిపాళ్ల నరేంద్ర కుమార్‌ అక్కడికి చేరుకుని మహేష్‌రెడ్డిని నిలదీశారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఇళ్లను ఎలా తొలగిస్తారని ప్రశ్నించారు. నోటీసులు ఇచ్చామని, కోర్టు ఆదేశాల మేరకే ఇళ్లను తొలగిస్తున్నామని చెప్పిన అసిస్టెంట్‌ కమిషనర్‌ అక్కడి నుండి వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా కారును అడ్డగించారు. నరేంద్రకుమార్‌ను పోలీసులు పక్కకు లాగేసి అసిస్టెంట్‌ కమిషనర్‌ను అక్కడి నుండి పంపించారు. దీంతో నరేంద్రకుమార్‌ అక్కడే ఉన్న సంత్రం ఈఓ కె.భవానీ ప్రసాద్‌ను నిలదీశారు. ముందుస్తు నోటీసులను బహిర్గతం చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ క్రమంలో కొంతసేపు వాగ్వాదం జరిగింది. మరోవైపు తమకు అధికారులు అన్యాయం చేస్తున్నారని, తమకు నోటీసులేమీ ఇవ్వలేదని నరేంద్రకుమార్‌ ఎదుట బాధితులు కన్నీటి పర్యంతమయ్యారు. ఇళ్ల తొలగింపు సందర్భంగా బయట పడేసిన సామాన్లను నరేంద్ర ఆధ్వర్యంలో సత్రం గదుల తాళాలు పగలగొట్టి వాటిల్లో పెట్టారు. తమకు జగనన్న కాలనీల్లో స్థలాలు కేటాయించి ఇళ్లు నిర్మించాలని, అప్పటి వరకూ సత్రం స్థలంలోనే తలదాచుకుంటామని బాధితులు చెప్పారు. అయితే వీరికి జగనన్న కాలనీల్లో ఇళ్లు కేటాయించినట్లు ఇఒ చెబుతుండగా కళ్యాణ మండపం నిర్మాణం అనంతరం వచ్చే ఆదాయం ద్వారా ప్రతిరోజూ 100 మంది పేదలకు అన్నదానానికి నిర్ణయించామని, ప్రభుత్వం, ఎమ్మెల్యే సహకారంతో దేవదాయ శాఖ నిధులతో నిర్మాణం చేపడగామని సంత్రం ఫౌండర్‌ ట్రస్టీ అవ్వారు వెంకటేశ్వరరావు అన్నారు.