Aug 25,2023 23:20

ప్రజాశక్తి - కాకినాడ రూరల్‌ గంగనాపల్లిలో పేదల ఇళ్ల కూల్చివేతపై విచారణ చేపట్టాలని సిపిఎం ఆధ్వర్యంలో ధర్నాచౌక్‌ వద్ద శుక్రవారం ధర్నా నిర్వహించారు. అనంతరం ఆర్‌డిఒ ఎన్‌వివి.సత్యనారాయణకు వినతిపత్రం అందించారు. గంగనాపల్లిలో 40 ఏళ్లుగా నివాసముంటున్న పేదల ఇళ్లు కూల్చి వేసిన వారిపై చర్యలు తీసుకోవాలని, న్యాయం చేయాలని నినదించారు. అనంతరం ర్యాలీగా అంబేద్కర్‌ విగ్రహం వరకు చేరుకుని అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కన్వీనర్‌ ఎం.రాజశేఖర్‌, కాకినాడ రూరల్‌ కార్యదర్శి తిరుమలశెట్టి నాగేశ్వరరావు మాట్లాడారు. గంగనాపల్లిలో గ్రామ కంఠం భూమిని 1983లో పేదలకు పంచారన్నారు. 40 ఏళ్లుగా 36 పేద కుటుంబాలు నివాసం ఉంటున్నాయన్నారు. అధికార పార్టీ, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు తప్పుడు కాగితాలు పుట్టించారన్నారు. ఎనిమిదిసార్లు పేదల పాకలను, ఇళ్లను కూల్చివేశారన్నారు. 1983లో పేదలకు పంచిన గ్రామకంఠం భూమి ఒక ప్రయివేటు వ్యక్తికి ఎలా రిజిస్ట్రేషన్‌ చేస్తారని ప్రశ్నించారు. రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పును పరిగణలోకి తీసుకోకుండా ప్రజాప్రతినిధులుగా ఉన్నవాళ్లే బుల్డోజర్లును, గూండాలను తీసుకుని వెళ్లి ఇళ్లను కూల్చడమే కాకుండా మహిళలను, అణగారిన వర్గాల వారిని కించపరుస్తూ మాట్లాడడం దారుణమన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వైసిపి ప్రభుత్వం అధికారంలోకొచ్చిన తర్వాత పేదల ఇళ్లు కూల్చివేత, స్థలాల ఆక్రమణలు పెరిగాయన్నారు. ఇళ్లను కూల్చేసిన ఘటనపై పూర్తి విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అనంతరం కాకినాడ ఆర్‌డిఒ ఎన్‌వివి. సత్యనారాయణకు వినతి పత్రంఅందించారు. ఈ సమస్య తమ దృష్టికి వచ్చిందని, విచారణ జరిపి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు చింతపల్లి అజరుకుమార్‌, సిహెచ్‌.రమణి, టి.రాజా, మేడిశెట్టి వెంకటరమణ, చిట్టూరి విజయకుమార్‌, బాధితులు పంపన నాగేశ్వరరావు, పంపన సుబ్బారావు, సన్నపు చిన్నారావు, తిరుమలశెట్టి ప్రసాద్‌, పిల్లి సుధాకర్‌, సాధనాల రాజు, పులుపుకూరి సూర్యారావు, పంపన సుబ్బలక్ష్మి, వాసంశెట్టి వీరరాఘవులు, దుప్పలపూడి సత్యవతి, డి.లక్ష్మణ్‌ తదితరులు పాల్గొన్నారు.