ప్రజాశక్తి-నెల్లూరు :నగర నియోజకవర్గ పరిధిలోని 53 డివిజన్ ప్రాంతం వెంకటేశ్వరపురం మెయిన్ రోడ్డు సమీపంలో నిరుపేదలు, బలహీన వర్గాలకు చెందిన వారు గడిచిన 60 ఏళ్లుగా ఇళ్లు నిర్మించుకొని జీవనం సాగిస్తుంటే అటువంటి ఇళ్లను అధికారులు కూల్చివేయడం దుర్మార్గమంటూ సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో సిటి తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. గురువారం సిపిఎం నగర కమిటీ కార్యదర్శి కత్తి శ్రీనివాసులు ఆధ్వర్యంలో బాధితులు ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగర నియోజకవర్గ పరిధిలోని నిరుపేదల ఇళ్లను దౌర్జన్యంగా కూల్చివేయడాన్ని వైసిపి ప్రభుత్వం ఆనవాయితీగా పెట్టుకుందన్నాని విమర్శించారు. వెంకటేశ్వరపురం ప్రాంతంలోని అధికారులు దౌర్జన్యంగా తొలగించిన ఇళ్లకు నిరుపేదలు ప్రభుత్వానికి పన్నులు చెల్లిస్తున్నారని, విద్యుత్తు బిల్లులు చెల్లిస్తూన్నా ఎటువంటి నోటీసులు వారికి అందజేయకుండా అధికారులు ఆ ప్రాంతానికి విచ్చేసి మీ ఇళ్లను తొలగించి వేస్తాం.. ఈ ప్రాంతాన్ని ఖాళీ చేసి వెళ్లాలంటూ చెప్పి తీవ్ర భయాందోళనలకు గురి చేయడం సరికాదన్నారు. స్థానికంగా ఉన్న అధికార పార్టీకి చెందిన నాయకులు సచివాలయ సిబ్బందిని నిరుపేదల ఇళ్ల వద్దకు పంపించి ఇటువంటి ప్రకటనలు చేయించడం ఎంత వరకు న్యాయమన్నారు. ఇప్పటికే మైపాడు రోడ్డు ప్రాంతంలో వందలాది నివాసాలను దౌర్జన్యంగా కూల్చారన్నారు. రంగనాయకుల పేట వారధి సెంటర్‌లో కూల్చివేసిన ఇళ్లకు సంబంధించిన బాధితులకు జిల్లా అధికారులు ఇప్పటి వరకు ఎటువంటి ప్రత్యామ్నాయ స్థలాలు చూపలేదన్నారు. జిల్లా అధికారులు నియమనిబంధనలు పాటించకుండా , ప్రజాసమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లకుండా కాంట్రాక్టర్లతో కుమ్మక్కై నిరుపేదల ఇళ్లను కూల్చివేయడమే ధ్యేయంగా వైసిపి పాలకులు ప్రయత్నాలు చేయడం దుర్మార్గమన్నారు. ప్రజల ఇళ్ల స్థలాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలంటే ప్రభుత్వం భూ సేకరణ చట్టాన్ని అనుసరించి నిరుపేదలకు నష్ట పరిహారం అందజేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ఈ సమస్యను జిల్లా అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఇళ్లను కోల్పోయిన బాధితులకు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని, అదే సమయంలో బాధితులు నిరుపేదలు కావడంతో వారందరికి నష్టపరిహారం చెల్లించేందుకు చర్యలు తీసు కోవాలన్నారు. జిల్లా స్థాయి అధికారులు ఇళ్ళను కూల్చివేసే సమయంలో బాధిత కుటుంబాలతో చర్చలు నిర్వహించి, వారి అనుమతితోనే స్థలం స్వాధీనం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నగర కమిటీ సభ్యులు మూలం.ప్రసాద్,శాఖా కార్యదర్శి నక్కా వెంకటేశ్వర్లు, స్థానిక నాయకులు భయ్యన్న, కోమలి, నాగభూషణమ్మ,రాజేంద్ర ప్రసాద్ మరియు భాధితులు పాల్గొన్నారు.










