ప్రజాశక్తి-కాకినాడ రూరల్ కాకినాడ రూరల్ మండలం గంగనపల్లిలో పేదల ఇళ్లు కూల్చివేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, కూల్చివేసిన ఇళ్లను తక్షణం నిర్మించి ఇవ్వాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. గ్రామంలోని శాలిమామ కాలనీని వారు సందర్శించారు. ఈ సందర్భంగా సిపిఎం కాకినాడ జిల్లా కన్వీనర్ మోర్త రాజశేఖర్, పార్టీ కాకినాడ రూరల్ కార్యదర్శి తిరుమలశెట్టి నాగేశ్వరరావు మాట్లాడారు. గంగనాపల్లి గ్రామంలో శాలిమామ కాలనీలో 40 ఏళ్లుగా నివాసముంటున్న వివిధ సామాజిక వర్గాలకు చెందిన పట్టాలు ఉన్న 30 మంది పేదల ఇళ్లను కూల్చివేశారన్నారు. మంగళవారం ఉదయం అధికార వైసిపి నేతలు పేదల ఇళ్లపై బుల్డోజర్లతో, రౌడీలు, గుండాలు, హిజ్రాలు 500 మందితో దాడి చేసి ఇళ్లను కూల్చివేయడం దారుణం అన్నారు. గతంలో పదేళ్లు అధికారంలో ఉన్న ఒక పార్టీ నాయకుల అండతో భూ కబ్జాదారులు ఇది వారి స్థలం అంటూ పేదలు వేసుకున్న నివాస గృహాలను దౌర్జన్యంగా తొలగిస్తే పేదలు కోర్టును ఆశ్రయించారన్నారు. కోర్టు తీర్పు మేరకు ఎవరి స్థలంలో వాళ్లు ఇల్లు నిర్మించుకున్నారన్నారు. తాజాగా అధికార పార్టీ నేతలు దౌర్జన్యంగా 4 బుల్డోజర్లు, గూండాలను, కిరాయి రౌడీలు, హిజ్రాలను తీసుకుని వచ్చి క్షణాల్లో పేదలు నిర్మించుకుంటున్న ఇళ్లలను నేల కూల్చడాన్ని పార్టీ నాయకులు తీవ్రంగా విమర్శించారు. రోజువారీ కూలి పనులు చేసుకుంటూ అప్పులు చేసి నిర్మించుకున్న ఇల్లును వారి కళ్ల ముందే కూల్చివేస్తుంటే అధికారులు, పోలీసులు పట్టించుకోకపోవడం దారుణం అన్నారు. ఈ సమస్యపై పోరాటానికి సిపిఎం ముందుంటుందని అక్కడ ఉన్న ప్రజలకు భరోసా ఇచ్చారు. ప్రభుత్వం తక్షణమే కూల్చివేతదారులపై కఠిన చర్యలు తీసుకుని, వెంటనే ప్రభుత్వ సొమ్ముతో తిరిగి పక్కా గృహాలు నిర్మించి ఇవ్వాలని, అందుకు జిల్లా కలెక్టర్ చొరవ తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ పర్యటనలో సిపిఎం కాకినాడ రూరల్ నాయకులు చిట్టూరి విజరు కుమార్, మేడిశెట్టి వెంకటరమణ, చింతపల్లి అజరు కుమార్, తొట్టిపూడి రాజా, వాసంశెట్టి చంద్రరావు, చైతన్య రెడ్డి పాల్గొన్నారు. బాధితులు పంపన సుబ్బారావు, పంపన నాగేశ్వరరావు, దుప్పలపూడి లక్ష్మణరావు, శాసమ్మ, అనసూరి లక్ష్మి, దుప్పలపూడి సత్యవేణి, దేవిశెట్టి వెంకటలక్ష్మి, అనసూరి కష్ణ, పింకే సుబ్బలక్ష్మి పార్టీ బృందానికి తమ సమస్యలను వివరించారు.










