Aug 21,2023 22:59

పేదల ఇళ్ల పట్టాల కోసం ధర్నా

మంగళగిరి రూరల్‌: మంగళగిరి మండలం కాజ గ్రామంలో పుల్లయ్య నగర్‌ , సుందరయ్య నగర్‌,వెంకటరెడ్డి పాలెం చెరువు లో నివాసం ఉంటున్న పేద ప్రజలందరికీ ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని కోరుతూ కాజా సచివాలయం వద్ద సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాను ఉద్దేశించి సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఈమని అప్పారావు మాట్లాడుతూ కాజలో గత నలభై ఏళ్లుగా ప్రభుత్వ భూములలోను, చెరువు పోరంబోకు భూములలోను ఇళ్లు వేసుకుని నివాసం ఉంటున్న పేదలందరికీ ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్‌ సంస్థలకు ఫారెస్ట్‌ భూములను, ప్రభుత్వ భూములను కన్వర్షన్‌ చేసి భూములిస్తుందని, గత అనేక సంవత్సరాలుగా ఇళ్ల నిర్మాణం చేసుకొని నివసిస్నున్న పేదలకు పట్టాలు ఎందుకు ఇవ్వదని ప్రశ్నించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్‌.జగన్‌ మో హన్‌ రెడ్డి రాష్ట్రంలో ప్రతి పేదవాడికి ఇంటి కల సాకారం చేస్తా మని వాగ్దానం చేశారని, ప్రభుత్వంపై పైసా ఖర్చు లేకుండా ఇళ్ల పట్టాల మంజూరు చేయవచ్చని అన్నారు. చెరువు పొరంబోకులను రెవిన్యూ పరంగా కన్వర్షన్‌ చేసి ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని లేనిపక్షంలో రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పారు. అనంతరం సిపిఎం మంగళగిరి నాయకులు బి .కోటేశ్వరి, టీ. ప్రసాద్‌ రెడ్డి ప్రసంగించారు. అనంతరం సచివాలయం అధికారికి వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఆళ్ల సాంబి రెడ్డి, సింహాద్రి సుమ, బి. సత్యమారెడ్డి, గాదె రామారావు, పాలేటి అప్పారావు, శివయ్య ,బ్రహ్మారెడ్డి, మాధవ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి వినతి
తాడేపల్లి: ఉండవల్లి బాపనయ్యనగర్‌ వాసులు ఇళ్లపట్టాలు మంజూరు చేయాలని సోమవారం స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి వినతిపత్రం అందజేశారు. గత 50 ఏళ్ల నుంచి బాపనయ్యనగర్‌లో ఎస్‌సి, ఎస్‌టి, బిసి తరగతులకు చెందిన సుమారు 300 కుటుంబాలు నివశిస్తున్నామని పేర్కొన్నారు. గత పంచాయతీ పాలకవర్గం ఈ ప్రాంతంలో సిమెంటు రోడ్లు, విద్యుత్‌, డ్రెయినేజీ, మంచినీరు తదితర మౌలిక సదుపాయాలు కల్పించినట్లు చెప్పారు. ఇక్కడ నివాసముంటున్న ప్రజలకు స్థానికరగానే పట్టాలివ్వాలని గత 15 సంవత్సరాల నుంచి సిపిఎం ఆధ్వర్యంలో ఆందోళనలు చేసి సమస్యను ప్రజాప్రతినిధులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. అయినా సమస్య నేటికీ పరిష్కారం కాలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇటీవల గడపగడపకు వైసిపిలో భాగంగా పర్యటనకు వచ్చిన ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డికి సిపిఎం నాయకులు వినతిపత్రం ఇచ్చిన సంగతిని గుర్తు చేశారు. అయినా ఇంతవరకు సమస్య పరిష్కారానికి నోచుకోలేదని చెప్పారు. అలాగే ఇటీవల ఉండవల్లి అమరారెడ్డినగర్‌లో నిర్మించిన రోడ్డు డ్రెయిన్‌ టు డ్రెయిన్‌ నిర్మించకపోవడం వల్ల ఎదురెదురుగా వాహనాలు వస్తే తప్పుకోవడానికి ఇబ్బందిగా ఉందని ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. తక్షణమే రోడ్డును డ్రెయిన్‌ టు డ్రెయిన్‌ రోడ్డుగా మార్పు చేయాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్పందిస్తూ దీనిపై తగు చర్యలు తీసు కుంటానని హామీనిచ్చారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో సిపి ఎం రాజధాని డివిజన్‌ కార్యదర్శి వర్గ సభ్యులు వి.వెంక టేశ్వరరావు, ఈమని రామారావు, సైకం వెంకటనారాయణ, బాపనయ్యనగర్‌ వాసులు ఉన్నారు.