ప్రజాశక్తి - మంగళగిరి రూరల్ : మంగళగిరి మండలం ఆత్మకూరులో 40 సంవత్సరాలు నుండి ఇళ్లేసుకుని జీవిస్తున్న 140 పేదల ఇళ్లను రోడ్డు విస్తరణ పేరుతో కూల్చి వేయడం దారుణమని సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శి పాశం రామారావు, కార్యదర్శి వర్గ సభ్యులు ఈమని అప్పారావు తీవ్రంగా ఖండించారు. ఆత్మకూరు వడ్డెర కాలనీలో ఇళ్లు కోల్పోయిన బాధితులను వారు ఆదివారం పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముందస్తు సమాచారం గానీ నోటీసులు కానీ ఇవ్వకుండా ఇళ్లను కూల్చడం అక్రమమని, కనీసం ప్రత్యామ్నాయ స్థలాలు చూపకుండా అక్కడున్న ఇళ్లను తొలగించడం ఏమిటని మండిపడ్డారు. అధికారులు, ప్రజాప్రతినిధులు చట్ట విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారన్నారు. ప్రస్తుతం ఉన్న రోడ్డు వెడల్పుగానే ఉందని, గుంతల మయంగా ఉన్న రోడ్డును మరమ్మతు చేయకుండా విస్తరణ సాకుతో ఆత్మకూరు సెంటర్ నుండి బైపాస్ రోడ్డు వరకు ఉన్న పేదల ఇళ్లను తొలగించడం అన్యాయమని విమర్శించారు.ప్రత్యామ్నాయ స్థలాలు చూపి ఇళ్లను నిర్మించాకే రోడ్డు వెడల్పు చేస్తామని ఎమ్మెల్యే గతేడాది వాగ్దానం చేశారని, నేడు దాన్ని విస్మరించారని దుయ్యబట్టారు. మంగళగిరి నియోజకవర్గంలో సుమారు 10 వేల కుటుంబాలు ప్రభుత్వ భూముల్లో ఇల్లు వేసుకుని నివాసం ఉంటున్నారని, వారు పట్టాల కోసం దీర్ఘకాలంగా ఆందోళన చేస్తున్నా పట్టించుకోవడంలేదని గుర్తు చేశారు. ప్రత్యామ్నాయాలు చూపకుండా ఇళ్లు తొలగిస్తే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అభివృద్ధి అంటే రోడ్డు వెడల్పు ఒక్కటే కాదని, ప్రజల జీవితాలనూ మెరుగుపరచాలని హితవు పలికారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు వి.దుర్గారావు, పి.ప్రసాద్, సిహెచ్.సీతారామాంజనేయులు, బి.రాంబాబు, జనార్ధనరావు, వి.రామారావు, పద్మనాభశర్మ, బాబ్జి, సుబ్రహ్మణ్యం, అజరు కుమార్ పాల్గొన్నారు.










