
ప్రజాశక్తి-తాడేపల్లి : పేదల ఇళ్లజోలికొస్తే ఊరుకునేదిలేదని సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శి పాశం రామారావు హెచ్చరించారు. మంగళగిరి నియోజకవర్గంలో ముఖ్యంగా తాడేపల్లి ప్రాంతంలో ఎర్రజెండా అండతోనే పేదలకు ఇళ్లు దక్కాయని ఆయన స్పష్టం చేశారు. పట్టణంలోని అమరారెడ్డినగర్, యానాదుల కాలనీ, ఉండవల్లి తదితర ప్రాంతాల్లో ఇరిగేషన్ స్థలాల్లో నివాసం ఉంటున్న పేదలకు ఇళ్లుఖాళీ చేయాలని ఇటీవల ఇరిగేషన్ అధికారులు నోటీసులు జారీ చేశారు. నోటీసులపై గత నెలలో వేసిన తేదీలను కొట్టి వేసి ఈనెలకు సంబంధించిన తేదీలు వేసి పంపిణీ చేయడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆదివారం పట్టణంలో అధికారులు నోటీసులు జారీ చేసిన పేదల పేటల్లో సిపిఎం నాయకులు పర్యటించారు. ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ ప్రభుత్వానికి ఎంత వరకు పనికిరాని ఇరిగేషన్, పోరంబోకు భూముల్లో సుమారు వెయ్యి కుటుంబాలు నివాసం ఉంటున్నాయని చెప్పారు. 40 ఏళ్ల క్రితం కమ్యూనిస్టుల కృషి, చొరవ అనేక కేసులు ఎదుర్కొని పేదల గూడు నిలబెట్టారని గుర్తు చేశారు. ఆనాటి నుండి ఒక్కో ఇంటి నిర్మాణానికి తమ కష్టార్జితం అంతా దారపోసి రూ.లక్ష నుంచి ఐదు లక్షల రూపాయలు వెచ్చించి పేదలు ఇళ్లు నిర్మించుకున్నారని తెలిపారు. ప్రస్తుతం ఉపాధి దొరుకుతున్న ఇక్కడ నుంచి పేదలను ఖాళీ చేయించడం చట్టవిరుద్ధమన్నారు. నోటీసు అందుకున్న దగ్గర నుంచి ఏడు రోజుల్లో ఖాళీ చేయమనడం మరింత దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్‌ఆర్ చట్టం ప్రకారం ప్రస్తుతం ఉన్న స్థలాలు పేదలకు అవసరమైతే వేరే చోట స్థలాలు చూపించి పేదలకు ఇళ్లు కట్టించిన తరువాతనే ఇళ్లు ఖాళీ చేయించాలని చట్టంలో స్పష్టంగా ఉందని చెప్పారు. కొంతమంది పేదలు నోటీసులు తీసుకోకపోతే నోటీసులు ఇళ్లకు అంటించి వెళ్లారని, ఇది సరైనది కాదని అన్నారు. ప్రజలను భయాందోళనలకు గురి చేసే విధంగా అధికారులు వ్యవహరించడం ఏమిటని ప్రశ్నించారు. ప్రస్తుతం నివాసం ఉంటున్న ప్రాంతాల్లో గతంలో పంచాయతీ, మున్సిపాలిటీ అధికారులు అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించారని చెప్పారు. అధికారులు తమ తీరు మార్చుకోకపోతే పేదలను సమీకరించి ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి ఎక్కడున్న వారికి అక్కడే పట్టాలివ్వాలని డిమాండ్ చేశారు. ఇందుకు భిన్నంగా పేదల ఇళ్లను ఖాళీ చేయిస్తే ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు.
ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ తాము ఇక్కడే ఉంటామని, ఇక్కడ నుంచి కదిలే ప్రసక్తేలేదని సిపిఎం నాయకుల ముందు స్పష్టం చేశారు. ఎక్కడో స్థలాలు ఇస్తామని ప్రభుత్వం చెబితే ఆశపడి వెళ్లామని, తీరా అక్కడకు వెళ్తే కోర్టు వివాదాల వల్ల స్థలాలు రావని తేలిపోయిందని నాయకుల ముందు వాపోయారు. మంగళవారం సచివాలయం ముందు నిరసన ధర్నా చేయడానికి సంసిద్ధంగా ఉన్నామని చెప్పారు. అనంతరం తాడేపల్లి సిపిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రామారావు మాట్లాడుతూ ప్రస్తుతం ఎక్కడ నివాసం ఉంటున్న పేదలను అక్కడే ఉంచి, ప్రభుత్వం పట్టాలు మంజూరు చేసి తమ చిత్తశుద్ధి నిరూపించుకోవాలన్నారు. లేకపోతే ప్రజలను సమీకరించి ఉద్యమిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి బి.వెంకటేశ్వర్లు, నాయకులు కె.కరుణాకరరావు, ఎస్.ముత్యాలరావు, డివి భాస్కరరెడ్డి, ఎల్.ఆచారి, బి.గోపాల్‌రెడ్డి, డి.యోహాన్, కె.వెంకటయ్య, బి.సుబ్బారావు, ఎం.శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.