Aug 08,2023 22:39

జెసిబిలతో గుడిసెలను తొలగిస్తున్న అధికారులు

          పెనుకొండ : 'నిరుపేదలందరికీ ఇళ్ల పట్టాలు ఇస్తాం... దరఖాస్తు చేసుకున్న 90 రోజుల్లోపే ఇళ్ల పట్టాలను వారి వద్దకు చేరుస్తాం.. సొంతిళ్లు లేకుండా పేదలు ఎవరూ ఉండకూడదు'.. ఇవి నాయకుల నోటి నుంచి నిత్యం వచ్చే మాటలు. ఆచరణలో ఇందుకు భిన్నంగా పరిస్థితులు కన్పిస్తున్నాయి. దరఖాస్తు చేసుకుని సంవత్సరాలైనా పేదలకు ఇళ్ల పట్టాలు అందని పరిస్థితి పెనుకొండ పట్టణంలో నెలకొంది. దీంతో పేదలు సిపిఎం, వ్యకాసం, సిఐటియు ప్రజాసంఘాల ఆధ్వర్యంలో గత నెల 24వ తేదీన భూస్వాధీన పోరాటం నిర్వహించారు. ప్రభుత్వ స్థలంలో గుడిసెలు వేసుకుని అందులో పట్టాలు ఇవ్వాలని కోరారు. ఇదేదో నేరం అయినట్లు అధికార యంత్రాంగం వారి మందీమార్బలంతో పేదలు వేసుకున్న గుడిసెలను జెసిబిలతో తొలగించేశారు. గుడిసెలు తొలగించొద్దంటూ పేదలు కన్నీళ్లు పెట్టుకుని ప్రాధేయపడినా కనికరం చూపకుండా అధికారులు వాటిని తొలగించేశారు.
పెనుకొండ పట్టణంలో పేదలు ఇళ్ల స్థలాలు లేకుండా ఇప్పటికీ అద్దె ఇళ్లలోనే నివాసం ఉంటున్నారు. ఇలాంటి వారందరూ పెనుకొండ పట్టణం మడకశిర రోడ్డులోని 668 సర్వే నెంబర్‌ ప్రభుత్వ భూమిలో వ్యవసాయ కార్మిక సంఘం, సిపిఎం, సిఐటియు ఆధ్వర్యంలో గత నెల 24వ తేదీన గుడిసెలను వేసుకున్నారు. ఈ భూమిలో ఇళ్ల స్థలాలు ఇవ్వాలని అధికారులను కోరారు. ప్రభుత్వ స్థలంలో పేదలకు పట్టాలు ఇవ్వాల్సిన అధికారులు ఆ దిశగా ఆలోచించకుండా వారిని అక్కడి నుంచి ఖాళీ చేయించడమే పనిగా పెట్టుకున్నారు. మంగళవారం వేకువజామన 6 గంటల సమయంలో తహశీల్దార్‌ స్వర్ణలత, కమిషనర్‌ వంశీకృష్ణభార్గవ్‌, పెనుకొండ సిఐ కరుణకర్‌తో పాటు రెవెన్యూ, నగర పంచాయతీ, పోలీసు సిబ్బంది పెద్ద ఎత్తున పేదల స్థలంలోకి వెళ్లారు. జెసిబిలు, లారీలను పిలిపించి గుడిసెలను తొలగించేశారు.
అడ్డుకున్న పేదలు... సిపిఎం నాయకుల అరెస్టు..
గుడిసెలను తొలగిస్తున్న విషయం తెలుసుకున్న పేదలు, సిపిఎం, వ్యకాసం, సిఐటియు, రైతుసంఘం నాయకులు అక్కడికి చేరుకున్నారు. జెసిబిలకు అడ్డుపడ్డారు. పోలీసులు వారిని బలవంతంగా అక్కడి నుంచి నెట్టివేశారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దన్న , జిల్లా సహాయ కార్యదర్శి గంగాధర్‌, జిల్లా కమిటీ సభ్యులు వెంకట్రాముడు, నరసింహులును అరెస్ట్‌ చేసి చిలమత్తూరు పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. నాయకులు అందరినీ అరెస్టు చేసిన పోలీసులు అనంతరం పేదలు వేసుకున్న గుడిసెలను జెసిబిలతో కూల్చివేశారు.
కన్నీళ్లు పెట్టుకున్నా కనికరం చూపలేదు..
'తాము పేదలం.. ఇళ్ల స్థలాలు ఇచ్చి ఆదుకోవాల్సింది పోయి... వేసుకున్న గుడిసెలను తొలగించొద్దంటూ మహిళలు అధికారుల ఎదుట కన్నీళ్లు పెట్టుకున్నారు. అయినా అధికారులు కనికరం చూపలేదు. ఈ సందర్భంగా పేదలు మాట్లాడుతూ సొంత ఇళ్లు లేక ఏళ్ల తరబడి అద్దె ఇళ్లలో నివాసం ఉంటున్నామన్నారు. రోజు కూలి పనులు చేసుకునే తాము ఇంటి బాడుగలు కట్టలేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ స్థలంలో గుడిసెలు వేసుకుంటే తొలగించడం అన్యాయంగా ఉందన్నారు. అధికారులకు, రాజకీయ నాయకులకు పేదలపై కనికరం లేదంటూ కన్నీటి పర్యవంతం అయ్యారు. పట్టణంలో అధికార పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు కోట్లాది రూపాయల విలువైన స్థలాలను కబ్జా చేస్తున్నా పట్టించుకోని అధికారులు పేదలు సెంటు స్థలం ఇవ్వమంటే ఇలా వ్యవహరించడం ఏమిటంటూ ఆక్రోశం వ్యక్తం చేశారు.
తహశీల్దార్‌, పోలీసు స్టేషన్‌ వద్ద ధర్నా
పేదలకు అండగా నిలిచిన సిపిఎం, వ్యకాసం, సిఐటియు నాయకులను వెంటనే విడుదల చేయాలంటూ తహశీల్దార్‌, పోలీసు స్టేషన్‌ వద్ద ధర్నా నిర్వహించారు. రైతుసంఘం జిల్లా ఉపాధ్యక్షులు హరి ఆధ్వర్యంలో తహశీల్దార్‌ కార్యాలయం నుంచి పోలీస్‌ స్టేషన్‌ వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా హరి, నాయకులు హనుమయ్య, రమణ, బాబావలి తదితరులు మాట్లాడుతూ నవరత్నాలు - పేదలందరికీ ఇళ్లు పథకం కింద నగర పంచాయతీ పరిధిలో ఇళ్లు లేని నిరుపేదలు ఇళ్ల స్థలాల కోసం స్పందన కార్యక్రమంలో అనేక సార్లు దరఖాస్తు చేసుకన్నారన్నారు. దరఖాస్తు చేసుకుని రసీదు పొందిన 90 రోజుల్లోపు ఇళ్ల స్థలాలు ఇస్తామన్న అధికారుల మాట సంవత్సరాలు గడిచినా అమలుకాలేదన్నారు. సబ్‌కలెక్టర్‌, తహసీల్దార్లు ప్రభుత్వ భూమిని గుర్తించే పనిలో ఉన్నారంటూ నిత్యం వాయిదాలు వేస్తున్నారన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో గత్యంతరం లేక లబ్ధిదారులే ప్రభుత్వ భూమిని గుర్తించి సంబంధిత అధికారులకు ముందస్తు సమాచారం ఇచ్చి భూస్వాధీన పోరాటం నిర్వహించారన్నారు. అందులో పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు అధికారులు స్పందించకపోగా, వేసుకున్న గుడిసెలను జెసిబిలతో తొలగించడం దుర్మార్గమైన చర్య అన్నారు. ప్రయివేటు వ్యక్తులు చేసినట్లుగా అధికారులు వ్యవహరించిన తీరు సరికాదన్నారు. ప్రభుత్వ భూమిని గుర్తించి దరఖాస్తుదారులందరికీ పట్టాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పిన తహశీల్దార్‌ ప్రస్తుతం ప్రభుత్వ భూమే లేదని చెప్పడం సిగ్గుచేటన్నారు. పేదలు గుడిసెలు వేసుకున్న భూమిని ఎవరికి కట్టబెట్టడానికి అధికారులు ఇలా వ్యవహరిస్తున్నారో చెప్పాలని ప్రశ్నించారు. గుడిసెలు వేసుకున్న స్థలాల్లో పేదలకు పట్టాలు ఇచ్చేంతవరకు ఆందోళన విరమించేది లేదన్నారు. అవసరమైతే న్యాయపోరాటం కూడా చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఐద్వా మహిళా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గౌతమి, కెవిపిఎస్‌ నాయకులు వెంకటేష్‌, చేనేత కార్మిక సంఘం నాయకులు శీలా నారాయణస్వామి, సిఐటియు నాయకులు బాబావలి, తిప్పన్న, కొండా వెంకటేష్‌, రంగప్ప, కిష్టప్ప, నరసింహమూర్తి, ఉత్తప్ప పాల్గొన్నారు.
ప్రభుత్వ భూమిలో బోర్డును ఏర్పాటు
పేదలను స్థలం నుంచి ఖాళీ చేయించిన అధికారులు ఆఘమేఘాల మీద ఆ స్థలంలో బోర్డు ఏర్పాటు చేశారు. మడకశిర రోడ్డులోని సర్వే నెంబర్లు 668-1, 668-3, 668-5, 668-7, 668-8, 668-9, 668-13 సర్వేనెంబర్లలోని భూమి ప్రభుత్వ భూమి అని తెలిపేలా బోర్డులు ఏర్పాటు చేశారు. ఈ భూమిని దురాక్రమణ చేసినవారు ఐపీసీ సెక్షన్‌ 447 మేరకు శిక్షార్హులు అన్నట్లు తహశీల్దార్‌ పేరుపై బోర్డును ఉంచారు. పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని కోరిన స్థలం ఇలా బోర్డులు ఏర్పాటు చేయడం ఏమిటంటూ పలువురు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.