Jan 17,2023 22:46

విశాఖ కెజిహెచ్‌లో చికిత్స పొందుతున్న బాధితరాలు నాగమణి

ప్రజాశక్తి- దేవరాపల్లి
స్థానిక టీటీడీ కల్యాణ మండపం ప్రహరీకి ఆనుకొని ఉన్న స్థలంలో 40 ఏళ్లగా నివాసముంటున్న పేదలు గుడిసెలను తొలగించడం అన్యాయమని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి.వెంకన్న పేర్కొన్నారు. మంగళవారం ఆయన స్థానిక విలేకర్లతో మాట్లాడుతూ దేవాదాయ శాఖ అధికారులు సంక్రాంతి పండగకు రెండు రోజుల ముందు శుక్రవారం రాత్రి సమయంలో పాకలు తొలగించడం దుర్మార్గమన్నారు. ఏళ్ల తరబడి నివాసముంటున్న పేదల గుడిసెలు తొలగింపునకు పూనుకోవడంతో మనస్తాపానికి గురైన బాధితురాలు బొబ్బరి నాగమణి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలిపారు. ప్రస్తుతం ఆమె విశాఖ కెజిహెచ్‌లో ప్రాణాపాయ స్థితిలో వైద్య సేవలు పొందుతుందన్నారు. దీనికి దేవాదాశాఖ అధికారులను బాధ్యులను చేసి వారిపై కేసులు పెట్టాలని డిమాండ్‌ చేశారు.
ఈ పాకలు తొలగింపు వెనుక అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లు ఉన్నట్లు అర్థమౌతుందని పేర్కొన్నారు. అధికారం ఉంటే ఏదైనా చేయొచ్చు అనడానికి ఇదే నిదర్శనమన్నారు. దేవరాపల్లికి చెందిన బొబ్బరి కనకమ్మ, బొబ్బరి నాగమణి సుమారు 40 ఏళ్లు పైబడి ఇక్కడ పాకలు వేసుకొని నివాసముంటున్నారని, వీరికి విద్యుత్‌ మీటర్లు ఉన్నాయని, బిల్లులు చెల్తిస్తున్నారని తెలిపారు. అయినా వీరికి ఎటువంటి నోటీసులు ఇవ్వకుండానే జెసిబితో వీరి పూరిళ్లును, కరెంటు మీటర్లు తొలగించారని పేర్కొన్నారు. దేవరాపల్లి మండలంలోని మారేపల్లి రెవెన్యూలో దాదాపుగా 30 ఎకరాలు దేవుని మాన్యం భూమిలో కోట్లాది రూపాయల వ్యాపారం జరుగుతున్నా కనీసం పట్టించుకోని దేవాదాయశాఖ అధికారులు పేదలు గుడిసెలను అర్ధాంతరంగా తొలగించడం దుర్మార్గమన్నారు. ఈ గుడిసెలు ఉన్న స్థలం రోడ్డుకు అనుకొని ఉండటం, దీని విలువ కోట్ల రూపాయల్లో ఉండడంతో దీనిని అధికార పార్టీ నాయకులకు కట్టబెట్టడం కోసం ఇటువంటి ఘాతుకానికి పూనుకున్నారని వెంకన్న మండిపడ్డారు. అధికార పార్టీ అగడాలు ఇక ఎన్నో రోజులు సాగవని, ప్రజలు గనపాఠం చెప్పే సమయం దగ్గర పడిందని హెచ్చరించారు. వెంటనే అక్రమంగా తొలగింపునకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని, బాధితులకు న్యాయం చేయాలని వెంకన్న డిమాండ్‌ చేశారు.