రోడ్డునపడ్డ ఐదు కుటుంబాలు
ప్రజాశక్తి - నూజివీడు
గొల్లపల్లి పిహెచ్‌సి సమీపంలో పేదలు వేసుకున్న గుడిసెలను రెవెన్యూ అధికారులు బుధవారం అన్యాయంగా తొలగించారు. 15 మంది విఆర్‌ఒలు, విఆర్‌ఎలు కలిసి జెసిబి సాయంతో వాటిని కూల్చివేశారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలంటూ పేదలు వేడుకున్నా వినకుండా తొలగించారు. దీంతో ఐదు కుటుంబాల ప్రజలు రోడ్డున పడ్డారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి నిమ్మగడ్డ నరసింహ మాట్లాడుతూ మూడు దశాబ్దాలుగా ప్రభుత్వ పోరంబోకు భూమిలో పేదలు గుడిసెలు వేసుకుని జీవిస్తున్నారని, ఉన్నఫళంగా వాటిని తొలగిస్తే వారి పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. పెద్దమనుషులమని చెప్పుకుంటూ వందలాది ఎకరాలు కబ్జా చేస్తుంటే వాటిని తొలగించలేని అధికారులు పేదలపై ప్రతాపం చూపించడం అన్యాయమన్నారు. ఎంఎల్‌ఎ మేకా వెంకట ప్రతాప్ అప్పారావు ఆదేశాలతో, తహశీల్దార్ ఎల్లారావు అధికార పార్టీ తొత్తుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. గొల్లపల్లిలో వేలాది ఎకరాల, ప్రభుత్వ భూములు కబ్జా చేసి పక్కా నిర్మాణాలు చేసిన బడా భూస్వాములను అంగుళం కూడా కదపలేని అధికారులు పేదలను ఎలా రోడ్డుకీడుస్తారని ప్రశ్నించారు. నివాసం కోల్పోయిన పేదలకు ప్రభుత్వమే జగనన్న కాలనీల్లో స్థలం కేటాయించి, ఇల్లు నిర్మించి ఇవ్వాలని సూచించారు.










