Sep 24,2023 21:19

దళిత రక్షణ యాత్ర ప్రారంభంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వి.శివనాగరాణి
ప్రజాశక్తి - జంగారెడ్డిగూడెం

పేదలు నివసిస్తున్న గుడిసెలకు పట్టాలివ్వాలని ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వి.శివనాగరాణి డిమాండ్‌ చేశారు. ఆదివారం మండలంలోని కేతవరంలో దళిత రక్షణ యాత్రను జిల్లా అధ్యక్షులు ఎం.జీవరత్నం ప్రారంభించారు. కేతవరం, పేరంపేట, నాగులగూడెం గ్రామాల దళితపేటల్లో కరపత్రాలు పంపిణీ చేస్తూ ఇంటింటా ప్రచారం నిర్వహించారు. అనంతరం నాగులగూడెం గ్రామ ప్రభుత్వ భూముల్లో పర్యటించి పేదలతో మాట్లాడారు. అనంతరం వి.శివనాగరాణి మాట్లాడుతూ నాగులగూడెంలో 439, 440 సర్వే నెంబర్లలో ప్రభుత్వ డొంక పోరంబోకు భూముల్లో పేదలు గత 20 సంవత్సరాలుగా గుడిసెలు వేసుకుని 40 కుటుంబాలు జీవిస్తున్నారని తక్షణం వీరికి మూడు సెంట్లు చొప్పున ఇళ్ల పట్టాలివ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. అలాగే ఎస్‌సి, ఎస్టఇ సబ్‌ప్లాన్‌ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని, జస్టిస్‌ పున్నయ్య కమిషన్‌ సిఫార్సులు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. అసైన్డ్‌ చట్ట సవరణను ఉపసంహరించుకోవాలని, ఈనెల 29న విజయవాడలోని మహాధర్నాను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. దేశంలో, రాష్ట్రంలో పరిపాలన అధ్వానంగా తయారైందన్నారు.
దళిత హక్కులను ప్రభుత్వాలు కాలరాస్తున్నాయని విమర్శించారు. అనేక సంవత్సరాలుగా దళితులు సామాజికన్యాయం కోసం రోడ్డెక్కుతున్న వారికి న్యాయం జరగడంలేదని అసహనం వ్యక్తం చేశారు. ఆర్థిక అసమానతలు పెరిగిపోతున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో దాదాపు 45 సంఘాలు కలిసికట్టుగా ఏర్పడి దళితుల అభ్యున్నతికి పనిచేస్తున్నాయని తెలిపారు. దళిత గిరిజనులకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్‌ను 300 యూనిట్లకు పెంచాలని, కోనేరు రంగారావు భూ కమిటీ సిఫార్సులను అమలు చేయాలని, డప్పు, చర్మకారుల పెన్షన్‌ రూ.ఐదు వేలకు పెంచాలని డిమాండ్‌ చేశారు. శ్మశానంలో పనిచేస్తున్న కార్మికులను నాలుగో తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని. ప్రభుత్వరంగాన్ని కాపాడి, ప్రయివేటురంగంలో రిజర్వేషన్లు అమలు చేయాలని కోరారు. ఈనెల 29వ తేదీన చలో విజయవాడ కార్యక్రమానికి వ్యవసాయ కార్మికులు దళితులంతా పెద్దఎత్తున తరలివచ్చి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘం మండల కార్యదర్శి ఎ.ప్రభాకర్‌రావు, ఎం.ఆనందరావు, కె.సుబ్బారావు, జి.సూర్యకిరణ్‌, నిట్ట నాగరాజు, కె.చిరంజీవి, సిహెచ్‌.మరియమ్మ, ఎం.కుమారి, కె.సుబ్బమ్మ, కె.రత్నం, జి.వెంకటలక్ష్మి పాల్గొన్నారు