Sep 02,2023 22:27

 ప్రజాశక్తి - యంత్రాంగం
              కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై పెనుభారాలు మోపుతున్నాయని సిపిఎం నేతలు తీవ్రంగా విమర్శించారు. ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ చేపట్టిన సిపిఎం 'సమరభేరి'లో భాగంగా శనివారం జిల్లావ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు కొనసాగాయి. ఈ సందర్భంగా పార్టీ నేతలు ప్రభుత్వాల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పలు గ్రామాల్లో సిపిఎం నేతలు ఇంటింటికీ వెళ్లి కరపత్రాలు పంచుతూ విస్తృత ప్రచారం నిర్వహించారు. అనంతరం ప్రజల నుంచి సంతకాలు సేకరించారు.
జీలుగుమిల్లి : మండలంలోని వంకవారిగూడెం, జీలుగుమిల్లి సచివాలయాల వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఆయా కార్యక్రమాల్లో సిపిఎం జిల్లా కార్యదర్శి ఎ.రవి పాల్గొన్నారు. అనంతరం ఆయన ఆయన మాట్లాడుతూ పేదలపై భారాలు మోపుతూ కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలను బిజెపి అమలు చేస్తుందని విమర్శించారు. బిజెపి హయాంలో గ్యాస్‌, పెట్రోల్‌, డీజిల్‌, విద్యుత్‌ ఛార్జీలు భారీగా పెరిగాయన్నారు. రాష్ట్రంలో ఉన్న వైసిపి బిజెపికి తోత్తుగా మారిందని ఆయన విమర్శించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి తెల్లం దుర్గారావు, తెల్లం రామకృష్ణ, రాజమండ్రి దానియేలు, కారం దుర్గ, ఎన్‌.అప్పారావు, కొండలరావు, నిర్మల పాల్గొన్నారు..
జంగారెడ్డిగూడెం : నిరుద్యోగం, నిత్యావసరాల ధరలను అదుపు చేయడంలో కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని సిపిఎం జిల్లా కార్యదర్శి ఎ.రవి అన్నారు. మండలంలోని పట్టినపాలెం సచివాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమానికి మండల కమిటీ సభ్యులు జోడే సూర్యచంద్రం అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా రవి మాట్లాడారు. బిజెపి గద్దెనెక్కిన నాటి నుండి ప్రజావ్యతిరేక విధానాలు అమలు చేస్తూ దేశ సంపదను అంబానీ, అదానీలకు కట్టబెడుతుందని మండి పడ్డారు. ప్రభుత్వరంగ సంస్థలను కార్పొరేట్లకు, పెట్టుబడిదారులకు అప్పగిస్తున్నారని విమర్శించారు. ఈ విధానాలను జగన్‌ ప్రభుత్వం వ్యతిరేకించకుండా మోడీకి భజన చేస్తూ ఆ విధా నాలనే అత్యుత్సాహంతో అమలు చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు జి.సూర్యకిరణ్‌, పి.దుర్గ, ఎం.చిన్నలక్ష్మి, కోసం రాముడు, బోడిగ సీతారాములు పాల్గొన్నారు.
మండలంలోని తాడువాయిలో సిపిఎం మండల కార్యదర్శి ఎం.జీవరత్నం ఆధ్వర్యంలో ఉదయం ఇంటింటికీ తిరిగి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిత్యవసర సరుకుల ధరలు పెట్రోల్‌, డీజిల్‌ గ్యాస్‌, విద్యుత్‌, విధానాలు మానుకోవాలని నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, పేదలకు ఎర్ర కాలువ ప్రాజెక్ట్‌ మిగులు భూములు పంచాలని, ఇళ్ల స్థలాలకు పట్టాలివ్వాలని సచివాలయం వద్ద సిపిఎం నాయకులు పటాన్‌ మస్తాన్‌ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కార్యదర్శి మానుకొండ జీవ రత్నం. మాట్లాడుతూ కేంద్ర బిజెపి ప్రభుత్వం పేద ప్రజలు కొనుగోలు చేసే నిత్యవసర సరుకుల ధరలు కూరగాయల ధరలు ఆకాశాన్నంటు తున్నాయని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ ధర్నాలో ప్రభాకర్‌రావు, కె.సుబ్బా రావు, లక్ష్మీనారాయణ, రామారావు, బి.నాగేశ్వరరావు, కెవి.రెడ్డి, లక్ష్మణరావు, మంగరాజు పాల్గొన్నారు.
కలిదిండి : 'సమర భేరి'లో బాగంగా మండలంలోని పోతుమర్రు, సానా రుద్రవరం, కోరుకొల్లు, ఎస్‌ఆర్‌పి అగ్రహారం, చిన తాడినాడ గ్రామాల్లో సిపిఎం నాయకులు సంతకాల సేకరణ నిర్వహించారు. ఆయా గ్రామ సచివాలయాల వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ప్రజాసమస్యలపై సంతకాలతో కూడిన అర్జీలను అధికారులకు అందించినట్లు సిపిఎం మండల కార్యదర్శి శేషపు మహంకాళిరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు మహేష్‌, శ్రీకాంత్‌, రమేష్‌, వినోద్‌, గంటా సోమయ్య, వై.మంగయ్య, నున్న వెంకన్న, కె.శ్రీనివాసరావు, పాపారావు, వెంకటేశ్వరరావు, కె.రామకృష్ణ పాల్గొన్నారు.
ఆగిరిపల్లి : కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల నాలుగో తేదీన మండల కార్యాలయాల వద్ద నిర్వహించే ధర్నాలను జయప్రదం చేయాలని సిపిఎం మండల కార్యదర్శి సిహెచ్‌.శివనాగరాజు డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా గొల్లగూడెం, కనసానపల్లి, అడవినెక్కలం, ఆగిరిపల్లి, వడ్లమాను గ్రామాల్లో సిపిఎం సమరభేరిలో భాగంగా కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయ కులు సత్తు కోటేశ్వరరావు, ఆర్‌.చంటి, ఎం.నరేష్‌, నవీన్‌ కుమార్‌, గోపాలరావు, సుభాని పాల్గొన్నారు.
4న మండల, మున్సిపల్‌ కార్యాలయాల వద్ద ధర్నాలు
ఏలూరు : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ, పెరిగిన ధరలు తగ్గించాలని, యువతకు ఉద్యోగాలివ్వాలని, విద్యుత్‌ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ ఈనెల నాలుగో తేదీన జిల్లాలోని అన్ని మండల కార్యాలయాలు, మున్సిపల్‌ ఆఫీసుల వద్ద జరిగే ధర్నా కార్యక్రమాల్లో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి ఎ.రవి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. సిపిఎం సమర భేరిలో భాగంగా గతనెల 30వ తేదీ నుండి ఈనెల నాలుగో తేదీ వరకూ జిల్లాలో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో ఈనెల నాలుగో తేదీన మండల కేంద్రాలు, మున్సిపల్‌ కార్యాలయాల వద్ద ధర్నా చేపడుతున్నామని, ప్రజలు పెద్దఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయని, రూ.450 ఉన్న గ్యాస్‌ ధర రూ.1200కు పెరిగిందన్నారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కంటితుడుపుగా రూ.200 కేంద్ర ప్రభుత్వం తగ్గించిందన్నారు. కాయగూరలు, పప్పులు, నూనెలు 50 శాతం పెరిగాయన్నారు. జిల్లాలో మూతపడిన ఏలూరు జ్యూట్‌ మిల్లు, భీమడోలు సుగర్‌ ఫ్యాక్టరీని వెంటనే తెరిపించాలని డిమాండ్‌ చేశారు. పోలవరం నిర్వాసితులకు పూర్తిస్థాయి నష్టపరిహారం చెల్లించి న్యాయం చేయాలని కోరారు. ఉపాధి హామీ పథకానికి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో నిధులు పెంచి వంద రోజుల పని కల్పించాలని, గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణాలకు కూడా విస్తరింపచేయాలని డిమాండ్‌ చేశారు.